– కోర్టు తీర్పులను గౌరవించాలి
– బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు విన్నవించుకోవచ్చు
– సీజేఐపై దాడి సహేతుకం కాదు
– ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం తెలియాలి
– న్యాయవ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
– తీర్పుల ప్రభావితం కొంతమేరకే
– 20 ఏండ్లకు పైబడి బార్ వెల్ఫేర్ కోసం సేవలు : ‘నవతెలంగాణ’తో స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మెన్ ఎ.నర్సింహారెడ్డి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల అడవులకు అత్యంత దగ్గరలో ఉన్న అచ్చంపేటలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి..స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మెన్‌గా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అనంత నర్సింహారెడ్డి అంచలంచెలుగా ఎదిగారు. ఉర్దూలో ప్రావీణ్యం ఉన్న తన తండ్రి కుమారున్ని ఇంగ్లీష్‌తో ముడిపడిన లాయర్‌గా చూడాలనుకున్నారు. ఆ దిశగా ఆయన్ను నడిపించారు. నర్సింహారెడ్డి 1978లో అడ్వకేట్‌గా చేరారు. 1995లో బార్ కౌన్సిల్‌లో మెంబర్ అయ్యారు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మెన్‌గా నియమితులయ్యారు. రెండు పర్యాయాలు ఈ హౌదాలో ఆయన పనిచేశారు. కొంతకాలం వైస్‌చైర్మెన్ గానూ ఉన్నారు. దాదాపు 20 ఏండ్లుగా స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు. గతంలో లాయర్స్ చనిపోతే ఒక్క పైసా వచ్చేది కాదు. 1989లో సమరసింహారెడ్డి సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ‘అడ్వకేట్ వేల్ఫేర్ ఫండ్’ను ప్రవేశపెట్టారు. అప్పట్లో వకాలత్‌కు రూ.2 స్టాంప్ అంటిస్తే.. చనిపోయినప్పుడు రూ.70వేలు వచ్చేవి. నర్సింహారెడ్డి నాయకత్వంలో బార్ కౌన్సిల్ దానిని అంచలంచెలుగా పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం రూ.10 లక్షలకు చేర్చారు. ప్రభుత్వం నుంచి ఏరియర్స్ రావాల్సి ఉంది. అవి వస్తే రూ.20 లక్షల వరకు పరిహారం లభిస్తుందని నర్సింహారెడ్డి చెప్పారు. అసోసియేషన్ సభ్యుడు చనిపోతే అంత్యక్రియల నిమిత్తం రూ.20వేలు, లాయర్ దంపతులు ఆకస్మికంగా జబ్బున పడితే చికిత్స నిమిత్తం రూ.లక్ష వరకు ఇస్తున్నామని వివరించారు. లైబ్రరీ కోసం జూనియర్‌లకు రూ.15వేలు ఇస్తున్నామన్నారు. 20ఏండ్లుగా టీఏ, డీఏ తీసుకోకుండా బార్ కౌన్సిల్ కోసం ఆదర్శంగా పనిచేస్తున్న స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మెన్ అనంత నర్సింహారెడ్డి ఐలూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఎన్‌రిచింగ్ ఆన్ ట్రాన్సఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అండ్ మేకింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్’పై సెమినార్‌లో పాల్గొనేందుకు శనివారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా ‘వర్ధమాన కాలంలో న్యాయవ్యవస్థ తీరుతెన్నుల’పై ‘నవతెలంగాణ’ ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాసరెడ్డితో ముఖాముఖి సంభాషించారు. వివరాలు నర్సింహారెడ్డి మాటల్లోనే..
స్థానిక సంస్థల ఎన్నికలపై..
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు మొదలు సుప్రీంకోర్టు వరకు అనేక ఇంప్లీడ్ పిటిషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. రిజర్వేషన్స్ 50 శాతం మించి ఉండరాదని హైకోర్టు చెప్పింది. రాష్ట్రంలోనే కాదు మహారాష్ట్ర, తమిళనాడులోనూ ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గవర్నర్ గడువులోగా ఆమోదం ఇవ్వకపోతే ఇచ్చినట్టుగానే పరిగణించాలి. బీసీ రిజర్వేషన్లపై గవర్నర్ ఆమోదిస్తే ప్రభుత్వం నోటిఫై చేయాల్సి వచ్చేది. న్యాయప్రక్రియ ద్వారా బిల్లుకు ఆమోదం లభించింది కాబట్టి ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. చట్టం అమల్లోకి వచ్చినట్లే. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం అప్పటి తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి 2018లో సవరణ తీసుకు వచ్చింది. రిజర్వేషన్‌లు 50 శాతానికి దాటకూడదన్న నిబంధన చేర్చింది. నాటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను కాదని ఎవరూ ఏమీ చేసేది లేదు. ఇప్పుడున్న జడ్జిమెంట్‌ను పున:పరిశీలన చేయాల్సిందిగా సుప్రీంకోర్టుకు విన్నవించుకోవచ్చు. 2011 జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేసుకొని ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. ఏదైనా సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని చేయాలి, కానీ అలా చేయలేదు. అందుకే హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులను వివరిస్తూ మరోసారి సుప్రీంకోర్టుకు విన్నవించుకోవచ్చు.
కోర్టుల తీర్పులను ప్రభుత్వాల ప్రభావితంపై..
కోర్టుల తీర్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభావితం చేస్తాయనేది అభియోగం మాత్రమే. కొంతమేర ప్రభావం ఉండొచ్చు కానీ.. వందశాతం నిజం కాదు. మనదేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రతో పనిచేస్తుంది. కొన్ని తీర్పులు కేంద్ర సర్కారు ఆశించిన రీతిలో వస్తుండటాన్ని బట్టి ఇలాంటి అపోహలకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. వంద, యాభై ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న అనేక అంశాలను సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా పరిష్కరించిన ఉదంతాలు ఉన్నాయి.
చీఫ్ జస్టిస్ గవారుపై దాడిపై బార్ అసోసియేషన్ స్పందన
భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవారుపై దాడి కేసులో బార్ అసోసియేషన్ తక్షణం స్పందించింది. సీజేఐపై చెప్పు విసిరిన లాయర్ రాకేశ్ కిశోర్‌ను బహిష్కరిస్తూ సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లోనూ ఆయన కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టకుండా ఎంట్రీ కార్డును రద్దు చేసింది. సీజేఐపై దాడి చేయటమనేది పూర్తిగా తప్పు. భారత రాజ్యాంగ వ్యవస్థలో శాసనవ్యవస్థ, కార్యనిర్వాహకవర్గం తప్పు చేస్తే వాటిని రివ్యూ చేసి సరిచేసేది న్యాయవ్యవస్థే.
న్యాయస్థానాల తీర్పులపైనా విశ్లేషణలు
ఒకప్పుడు న్యాయస్థానాల తీర్పులపై విశ్లేషణలు రాయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వాటిని విశ్లేషిస్తూ పత్రికలు, టీవీల్లో అనేక కథనాలు వస్తున్నాయి. దీన్ని తప్పుబట్టడానికి వీల్లేదు. జర్నలిస్టులు తమ కథనాలను ఒక అంశంపై ఉన్న సమాచారం ఆధారంగా రాస్తుంటారు. దీనిలో ఎలాంటి తప్పూ లేదు. కానీ ఒక వ్యక్తిపై కక్షతో లేదంటే అతని పరువుకు భంగం వాటిల్లేటట్టు కథనాలు రాస్తే సరైన ఆధారాలు ఉండాల్సిందే.
న్యాయవ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
న్యాయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకునేలా మార్పులు ఉంటున్నాయి. దీనిలో భాగంగా జీరో ఎఫ్‌ఐఆర్ విధానం అందుబాటులోకి వచ్చింది. పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా ఫిర్యాదు చేసే వెసులుబాటు కలిగింది. ఉమెన్ అండ్ చైల్డ్ లా లోనూ అనేక మార్పులు వచ్చాయి. ఏ వ్యవస్థలోనైనా సంస్కరణలకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. క్లయింట్స్ ఇంట్రెస్టే కొలమానం కాకుండా సమాజహితం కోసం కూడా న్యాయవాదులు నిలబడాలి.
30రోజుల జైలుశిక్ష పదవీచ్యుతిపై..
నేరాలను అదుపు చేయటానికి ఇది ఒక మార్గం కావచ్చు. కక్ష పూరిత చర్యలకు దీనిని వాడటం అనేది సరికాదు. అప్పట్లో లీడర్లు, అధికారులు నీతి నిజాయితీతో వ్యవహరించేవారు. ఆదర్శ పాలన అందించేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిందే. గతంలో లీడర్లు ఎంతో నిష్టతో ఉండేవారు. ప్రస్తుత రాజకీయ నాయకులు పరస్పరం కేసులు వేసుకోవటం చూస్తున్నాం.
ప్రతి ఒక్కరికీ చట్టం తెలియాలి
ప్రతి ఒక్కరూ రాజ్యాంగం, చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లాయర్లు మాత్రమే న్యాయం, చట్టాల గురించి చదవటం కాదు.. అందరికీ రాజ్యాంగం తెలియాలి. హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలి. అక్బరుద్దీన్ ఓవైసీ ఇటీవల ముస్లింలకు ఓ పిలుపు ఇచ్చారు. లాయర్‌గా ప్రాక్టీస్ చేసినా.. చేయకపోయినా రాజ్యాంగం, చట్టాల గురించి తెలుసుకోమని చెప్పారు. ఆ పిలుపుతో అనేక మంది ముస్లిం యువత లా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
‘న్యాయం’ తీరు మారుతోంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES