Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజికొత్త పెన్షన్‌ ముమ్మాటికీ విద్రోహమే!

కొత్త పెన్షన్‌ ముమ్మాటికీ విద్రోహమే!

- Advertisement -

భారత ప్రధాని గతవారం బీహార్‌ సభలో పదవీచ్యుత బిల్లుపై మాట్లాడుతూ ‘చిరుద్యోగి అరెస్టయి కేవలం 48 గంటల పాటు జైల్లో ఉంటే సస్పెండ్‌ చేసే నిబంధన ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ముప్పయి రోజులు జైల్లో ఉంటే పదవినుండి ఎందుకు తొలగించకూడదు’ అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఆయన మాటలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉద్యోగులు, ప్రజలు గమనించే ఉంటారు. అదే సమయంలో మరొకప్రశ్న? ఇదే పెన్షన్‌ విషయంలో ప్రజాప్రతినిధితో ఉద్యోగిని ఎందుకుపోల్చకూడదు? రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచు కుంటూ ప్రభుత్వంలో ముప్పయి ఏండ్లపాటు సేవలందించిన ఉద్యోగికి లేని పెన్షన్‌ మూడేండ్లు కూడా సరిగా పనిచేయని ఎంపీ, ఎమ్మెల్యేలకి ఇవ్వడం సబబా? ప్రజాప్రతినిధులకో న్యాయం, ప్రభుత్వ ఉద్యోగులకో న్యాయమా? ఏ చదువులేకపోయినా, ఎన్ని కేసులున్నప్పటికీ, రాజకీయ అండదండలు, ధన బలంతో కేవలం ఒకసారి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వారు ప్రజల సొమ్ముతో ఎన్ని సౌకర్యాలు పొందుతు న్నారో తెలియనది కాదు. ఐదేండ్లు కాదు, కేవలం ఒక్క రోజు పదవిలో ఉన్నా వారికి జీవితాంతం పెన్షన్‌ ఇచ్చే చట్టాలు తమకు అనుకూలంగా తయారు చేసుకో వడం సమంజసమేనా? 61ఏండ్ల వయసు వచ్చేవరకు ఉద్యోగసేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి ఉన్న పెన్షన్‌ లేకుండా చేసి, చట్టాన్ని మార్చి ఓపీఎస్‌ను, సీపీ ఎస్‌కు మార్చడం సమానత్వమా? ఇది ఉద్యోగుల పట్ల ద్రోహం కాదా?
ఆర్థిక భారం తగ్గించాలనే కారణంతో కేవలం ఉద్యోగస్తులనే దృష్టిలో ఉంచుకుని 2004 జనవరి1 నుండి పాత పెన్షన్‌ పథకం (ఓపిఎస్‌)ను రద్దుచేసి కాంట్రీ బ్యూటరీ స్కీమ్‌ (సీపీఎస్‌)ను అమల్లోకి తెచ్చింది కేంద్రం. మన తెలుగు రాష్ట్రాల్లో 2004 సెప్టెంబర్‌ 1 నుండి ఇది అమలవుతున్నది. దీని అమలు కోసం కేంద్రం ఒత్తిడి తెచ్చినప్పటికీ పశ్చిమబెంగాల్‌, త్రిపుర మాత్రం పాత పెన్షన్‌ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయకుండా కొనసాగించాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్‌పీఎస్‌ను రద్దు చేసి తిరిగి పాతపెన్షన్‌ను అమలు చేశాయి. తెలంగాణలో కూడా ఉద్యోగుల ఓపిఎస్‌ను అమలు చేయాలనీ గతంలో ప్రతి పక్షంలో ఉన్న పార్లమెంట్‌ సభ్యులు ఇప్పటి మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అప్పట్లోనే డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పాత పెన్షన్‌ను పునరుద్ధ్దరిస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కూడా 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి పాయింట్‌లోనే సీపీఎస్‌ రద్దుచేసి ఓపిఎస్‌ను అమలు చేస్తామని పొందుపరిచి ఉద్యోగులకు మాటిచ్చింది.
కాంట్రీబ్యూటరీ పెన్షన్‌స్కీమ్‌లో ఇటు ఉద్యోగులు ప్రతి నెల జీతంలో పది శాతం, అటు ప్రభుత్వం పదిశాతం వంతున జమచేసి భవిష్యత్‌ ఆధారిత ప్రయోజనం కోసం మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి ఉద్యోగ విరమణ సమయంలో ఉన్న మార్కెట్‌ విలువనుబట్టి ఉద్యోగికి అందులో నుండి కేవలం అరవై శాతం మాత్రమే అంది స్తారు, ఇందులో మళ్లీ ఆదాయపు పన్ను, జీఎస్టీ ఉంటుంది. మిగిలిన నలభై శాతం ఇన్సూరెన్స్‌ కంపెనీ లో ఏదో ఒకప్లాన్‌ తీసుకోని అందులో నుండి ఏడాదికి కేవలం ఆరు శాతం వరకు పెన్షన్‌ రూపంలో వస్తుంది. మొత్తానికి సీపీఎస్‌ కచ్చితంగా ఇంత వస్తుందని భరోసా లేదు. పైగా అప్పటికి మార్కెట్‌ విలువల్లో తేడాలు వస్తే గనుక ఉద్యోగి కొంతమేరకు నష్టపోవచ్చు.! ఈ విధమైన గ్యారంటీ లేని పెన్షన్‌ వద్దని దేశంలోని ఉద్యోగస్తులం దరు ఎంత మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలు ఆర్థిక భారమనే సాకుతో సీపీఎస్‌ను రద్దు చేయడం లేదు.ఇది ఉద్యోగుల పట్ల ఉన్న చిన్నచూపే.
మన రాష్ట్రంలో ఉపాధ్యాయ,కార్మిక, పెన్షనర్ల సంఘాలు కాంగ్రెస్‌ ప్రభుత్వమంటే మనదే అన్న ఆశతో ఉన్నారు.కొన్ని ముఖ్యమైన డిమాండ్లనైనా అమలు చేస్తుందనుకుని ఆశలతో ఎదురుచూస్తున్నారు. కానీ అవేమి నెరవేరక పోగా ప్రభుత్వం,ఉద్యోగస్తుల మధ్య దూరం పెరుగుతూ వస్తున్నది. గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగులు ఎన్నో నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు ఎలాంటి నిరసనలు చేయలేదంటే ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనేది ఆలోచన. కానీ రోజులు గడుస్తున్నా పెన్షన్‌ సమస్యను పరిష్కరించడం లేదు. దీంతో ఉద్యోగస్తుల్లో నిరాశ, అసహనం, వ్యతిరేకగళం పెరుగుతున్నది. దీన్ని గమనించి పాత పెన్షన్‌ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియెస్‌గా చర్చించాలి. లేదంటే ఉద్యోగులకు ఉద్యమాలే శరణ్యం.
(సెప్టెంబర్‌ 1పెన్షన్‌ విద్రోహ దినం)

సయ్యద్‌ జబి
9949303079

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad