మెజార్టీ మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లు కాంగ్రెస్ ఖాతాలోకే..
చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా ముగిసిన ఎన్నిక
కొన్నిచోట్ల విచిత్రపొత్తులు
పలుచోట్ల కలిసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ
హంగ్ ఏర్పడ్డ నిజామాబాద్, బోధన్‌లో ఎంఐఎంతో పొత్తు
నేరుగా క్యాంప్‌ల నుంచి వచ్చిన అభ్యర్థులు
నవతెలంగాణ- విలేకరులు
మున్సిపల్ ఎన్నికల్లో చివరి అంకమైన కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక సోమవారం ముగిసింది. ఈ ప్రక్రియతో మున్సిపల్ ఎన్నికల ఘట్టం పరిసమాప్తమైంది. ఇక పాలకవర్గం మున్సిపాలిటీల పాలనపై దష్టి సారించాల్సి ఉంటుంది. చెదురుమదురు ఘటనలు మినహా సోమవారం మున్సిపల్, కార్పొరేషన్ పాలకవర్గాలు కొలువుదీరాయి. పదకొండు చోట్ల మినహా మిగతా మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. మెజార్టీ పాలకవర్గాలను కాంగ్రెస్‌పార్టీ హస్తగతం చేసుకుంది. గెలుపొందిన కార్పోరేటర్‌లు, కౌన్సిలర్‌లు ప్రత్యేక క్యాంప్‌ల నుంచి తమ నాయకులతో కలిసి బస్సుల్లో నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు తరలివచ్చారు. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఎన్నిక జరిగింది. చాలాచోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడంతో అధికార, పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పోరేషన్, 7 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. 5 మున్సిపాల్టీల్లో ఇది వరకే క్లీన్‌స్విప్ చేసిన కాంగ్రెస్.. హంగ్ ఏర్పడ్డ నిజామాబాద్ కార్పోరేషన్‌తో పాటు బోధన్, కామారెడ్డి మున్సిపాల్టీలను హస్తగతం చేసుకుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో కార్పోరేషన్‌లో మేయర్ పదవితో పాటు, 7 మున్సిపాల్టీల్లో చైర్మన్ పదవులు కాంగ్రెస్ వశం అయ్యాయి. హంగ్ ఏర్పడ్డ నిజామాబాద్ కార్పోరేషన్‌లో ఎంఐఎంతో పాటు బీఆర్‌ఎస్ మద్దతు పలకగా, బోధన్‌లో ఎంఐఎం మద్దతు పలకడంతో రెండు చోట్ల డిప్యూటీ మేయర్‌తో పాటు, వైస్ చైర్మన్ పోస్టులను ఎంఐఎం దక్కించుకుంది. నిజామాబాద్‌లో 60 కార్పోరేటర్‌లతో పాటు ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణగుప్త, రాకేశ్‌రెడ్డి ఎక్స్‌అఫిషియో హౌదాలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. మొత్తం 65 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనగా, కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు బీఆర్‌ఎస్ అభ్యర్థి సైతం కూరగాయల ఉమారాణిని మేయర్‌గా, సల్మ తహసీన్‌ను డిప్యూటీ మేయర్‌గా 34 మంది చేతులు పైకెత్తి మద్దతు తెలిపారు. బీజేపీకి 31 మంది సభ్యుల మద్దతు వచ్చింది.
ఆమన్‌గల్‌లో కాంగ్రెస్‌కు ఒక వార్డే..
రంగారెడ్డి జిల్లాలో చైర్మెన్, వైస్ చైర్మెన్ల ఎంపిక ప్రశాంత వాతావరణంలో కొనసాగినప్పటికీ.. ఇబ్రహీంపట్నంలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఆమన్‌గల్‌లో అనుహ్యంగా కాంగ్రెస్ చైర్మెన్ కుర్చీని కైవసం చేసుకుంది. మొయినాబాద్, పరిగిలో కూడా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ చైర్మెన్ పదవులను దక్కించుకుంది. దాంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో 9 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆమన్‌గల్‌లో కాంగ్రెస్ గెలుపొందింది ఒక వార్డు మాత్రమే, ఇక్కడ బీజేపీ 6 వార్డులు, బీఆర్‌ఎస్ 8 వార్డులు గెలుచుకున్నాయి. అయితే ఒక వార్డు గెలుచుకున్న కాంగ్రెస్ బీజేపీ మద్దతుతో చైర్మెన్ పదవి కైవసం చేసుకుంది. మొయినాబాద్‌లో 5 మంది స్వతంత్య్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడంతో పాటు బీజేపీ అభ్యర్థుల నుంచి కూడా మద్ధతు కూడగట్టింది. పరిగి మున్సిపాలిటీలో స్వతంత్రులు ఇద్దరు మద్ధతు, ఎమ్మెల్యే ఎక్స్‌ఆఫిషియో ఓటు ఉండంబతో కాంగ్రెస్ చైర్మెన్ సీటును కైవసం చేసుకుంది.
ఉమ్మడి మెదక్‌లో విచిత్ర పొత్తులు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు విచిత్ర సంఘటలు చోటు చేసుకున్నాయి. నిత్యం విమర్శించుకునే బీజేపీ, కాంగ్రెస్ బందం బలపడి చైర్మన్ స్థానాలను కాంగ్రెస్ సాధించింది. అదే విధంగా పలు చోట్ల బీఆర్‌ఎస్, బీజేపీ అవగాహన ఒప్పందం చేసుకుని కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకోగా 8 స్థానాలను బీఆర్‌ఎస్ దక్కించుకుంది. మరో రెండు జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీలకు కోరం లేకపోవడంతో వాయిదా పడింది.
ఇబ్రహీంపట్నంలో రెండుగా చీలిన బీజేపీ..
ఇబ్రహీంపట్నంలో కేవలం రెండు వార్డుల్లో విజయం సాధించిన బీజేపీ రెండుగా చీలిపోయింది. ఒకరు ముత్యాల శ్యామల భాస్కర్ బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు. 18వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన సిద్ధం భానుప్రియ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. దాంతో బీజేపీలో రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారనేందుకు ఇదొక సంకేతమని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల వర్షం కురింది. కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. కౌన్సిలర్లే లక్ష్యంగా రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. రాళ్ల వర్షం కురుస్తుండటంలో సమావేశంలోని సభ్యులతో పాటూ, ఇటు మీడియా, పోలీసులు అయోమయానికి గురయ్యారు. వెంటనే పోలీలు పలువురు కాంగ్రెస్ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ 25 మందికి 24 మంది హాజరైనా ఎన్నిక వాయిదా పడింది. కౌన్సిలర్ ఆకుల యాదగిరి సభకు రాకుండా బీఆర్‌ఎస్ అడ్డుకున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. అతన్ని రప్పించే వరకు ఎన్నికలు నిలిపివేయాలని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవడంతో వాయిదా పడింది.
భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐకే మొదటి రెండున్నరేండ్లు
రాష్ట్ర కాంగ్రెస్, సీపిఐ రెండు పార్టీల అధిష్టానం మధ్య జరిగిన చర్చల ఒప్పందం మేరకు కొత్తగూడెం కార్పొరేషన్ తొలి మేయర్‌గా సుజాతనగర్ 20 డివిజన్ నుండి గెలుపొందిన సీపీఐ కార్పొరేటర్ మూడ్ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత డిప్యూటీ మేయర్‌గా పాల్వంచ 8వ డివిజన్ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి సిరిపురపు లలిత కుమారి ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ నుండి ఎన్నికైన అభ్యర్ధి దుంపల రాజేష్ నల్లబ్యాడ్జీతో ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం గమనార్హం. ఎక్స్-అఫీషియో సభ్యులుగా సమావేశానికి హాజరైన స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించారు.
అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాల్టీల ఎన్నిక సజావుగా ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన మేయర్, చైర్మన్లతో పాటు, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లు, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ నూతన సారథులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
సకాలంలో రాని కౌన్సిలర్స్
ఎన్నికల అధికారుల నిబంధన ప్రకారం ఉదయం 11 గంటల నుండి ఒకటి 30 నిమిషాల వరకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం, అనంతరం చైర్మెన్ ఎన్నిక ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ కార్యాలయంలో సమయానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది కౌన్సిలర్స్ హాజరు కాలేదు. దీంతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వాయిదా పడింది.
కరీంనగర్ బీజేపీకే..
కరీంనగర్ మేయర్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్‌పార్టీ కూడా పోటీలో ఉంటుందని చెప్పడంతో బీజేపీలో టెన్షన్ నెలకొంది. చివరికి కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులను బీజేపీనే కైవసం చేసుకుంది. సిరిసిల్లపైనా కాంగ్రెస్‌పార్టీ దృష్టి పెట్టిందన్న ప్రచారం వార్తలతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌కు సిరిసిల్ల, జమ్మికుంట, రాయికల్ దక్కాయి. పెద్దపల్లి మేయర్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ చైర్మెన్ ఎన్నిక విషయంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఆ పదవికి ఇద్దరు పోటీపడటంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా చేశారు.
జనగామలో హైడ్రామా.. తొర్రూరులో లాఠీఛార్జీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాల్టీలలో 9 మున్సిపాల్టీలలో కాంగ్రెస్‌పార్టీ చైర్మెన్, వైస్ ఛైర్మెన్ పదవులను దక్కించుకుంది. పరకాల, నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, కేసముద్రం, మహబూబాబాద్, మరిపెడ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట మున్సిపాల్టీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. జనగామ మున్సిపాల్టీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పరస్పరం ఆందోళనలకు దిగడంతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులను కిడ్నాప్ చేశారంటూ పరస్పరం ఫిర్యాదులు చేసుకొని ఎన్నికలు వాయిదా వేయాలని ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు మంగళవారానికి ఎన్నికను వాయిదా వేశారు. తొర్రూరు మున్సిపాల్టీలో తొలుత బిఆర్‌ఎస్ కౌన్సిలర్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన వెంట తీసుకొని మున్సిపాల్టీ హాలులోకి ప్రవేశించారు. అనంతరం ఎమ్మెల్యే యశ్వసినీరెడ్డి, ఎంపి డాక్టర్ కడియం కావ్య నేతృత్వంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపాల్టీ హాలులోకి వెళ్లారు.
‘ఎర్రబెలి’ బయటకు రావాలంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో ప్రతిగా బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పరస్పరం కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. పోలీసులు లాఠీఛార్జి చేసి రెండు పార్టీ నేతలు, కార్యకర్తలను చెదరగొట్టారు. జనగామ, తొర్రూరులో సమానంగా ఉండగా టాస్‌తో ఇక్కడ గెలుపోటములను నిర్ధారించాల్సి వుండగా, పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం, ఆందోళనకు దిగడంతో ఎన్నికలను వాయిదా వేశారు. డోర్నకల్ మున్సిపాల్టీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వున్న సమావేశానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు నిర్ధిష్ట సమాయానికి రాకపోవడంతో కోరం లేక ఎన్నికల అధికారులు వాయిదా వేశారు.
నల్లగొండలో ప్రశాంతం..
నల్లగొండ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక, కార్పొరేటర్ల ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. కార్పొరేషన్‌లో తొలి మేయర్‌గా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి కావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తిరుమలగిరిలో తప్ప మిగతా చోట్ల కాంగ్రెస్‌పార్టీవారే ఎన్నికయ్యారు.
ఆదిలాబాద్, భైంసా స్వతంత్రులకే పట్టం
ఆదిలాబాద్, భైంసా మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక నాటకీయ పరిణామాలు మధ్య ముగిశాయి. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలకు తక్కువ స్థానాలు రావడంతో స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు. అదే విధంగా భైంసా మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆదిలాబాద్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బండారి అనూష, వైస్ చైర్మన్‌గా ఎండీ రోహిత్ ఎన్నికయ్యారు. భైంసా మున్సిపాలిటీ చైర్మన్‌గా తూమెల్ల దత్తాత్రి, వైస్ చైర్మన్‌గా కాకూజ సిద్ధీఖి ఇద్రిస్‌లు ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్‌లో చైర్మన్ ఎన్నికకు వచ్చిన ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు గంట పాటు మున్సిపల్ కార్యాలయం ఎదుట బజ్జగించే ప్రయత్నం చేశారు. చివరకు బీఆర్‌ఎస్ అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా బీఆర్‌ఎస్ మూడో వార్డ్ కౌన్సిలర్ మెంగ్రే ఆకాష్, 17వ వార్డు కౌన్సిలర్ ఎండీ.అహ్మద్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయారు.
వనపర్తిలో కాంగ్రెస్‌పార్టీ కౌన్సిలర్ రాజీనామా
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ మహబూబ్‌నగర్ కార్పొరేషన్ సహా 15 మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ రెండు, బీజేపీ, పార్వర్డ్ బ్లాక్ ఒక్కొక్క చోట ఎన్నికైంది. ఇదిలావుండగా వనపర్తి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వలేదని కౌన్సిలర్గా గెలుపొందిన చీర్ల రజిని చందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చైర్మన్ వైస్ చైర్మన్ పదవి స్వీకరణ అనంతరం ఆర్డీవోకు సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయ్ చందర్ ఆయన భార్య మూడో వార్డ్ కౌన్సిలర్ రజిని మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించామని ఎమ్మెల్యే మాట ప్రకారం ఆయన సూచనల ప్రకారం నడుచుకోవడం జరిగిందన్నారు. తనకు ఇస్తానని చెప్పి చైర్మన్ పదవిని అగ్ర వర్గానికి చెందిన ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి పార్టీ జెండాను మోయనటువంటి పార్టీ కొరకు ఏనాడు కూడా పనిచేయునటువంటి ఆమెకు చైర్మన్ పదవిని కట్టబెట్టడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.






