– పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
– జీహెచ్‌ఎంసీలో దంచికొట్టిన వాన
– 50కిపైగా ప్రాంతాల్లో భారీ వర్షం
– సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో 12.7 సెంటీమీటర్ల అతి భారీవాన
– రాష్ట్ర వ్యాప్తంగా 509 చోట్ల వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ఆ జాబితాలో సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలున్నాయని తెలిపారు. తెలంగాణ మీదుగా నైరుతు రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ మీదుగా బలమైన ఉపరిత గాలులు (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) వీచే సూచనలున్నాయని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, సాయంత్రం, రాత్రి సమ యాల్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌ను వర్షం ముంచెత్తింది. నగరవ్యాప్తంగా విస్తారంగా వాన పడింది. గ్రేటర్‌లో 160కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అందులో 54 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 75 చోట్ల భారీ వర్షపాతం నమోదైతే అందులో 54 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయంటేనే వర్ష తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 509 ప్రాంతాల్లో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో అత్యధికంగా 12.7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఆ తర్వాత రంగారె డ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్‌లో 12.3 సెంటీమీటర్ల వాన పడింది.
పుల్కల్ (సంగారెడ్డి) 12.7 సెంటీమీటర్లు
ధర్మాసాగర్(రంగారెడ్డి) 12.3 సెంటీమీటర్లు
మారేడ్‌పల్లి(జీహెచ్‌ఎంసీ) 11.5 సెంటీమీటర్లు
బాలానగర్(జీహెచ్‌ఎంసీ) 11.5 సెంటీమీటర్లు
కందువాడ(రంగారెడ్డి) 11.0 సెంటీమీటర్లు
యాదగిరిగుట్ట(యాదాద్రి) 10.6 సెంటీమీటర్లు
నాచారం(జీహెచ్‌ఎంసీ) 10.1 సెంటీమీటర్లు
మూసారాంబాగ్(జీహెచ్‌ఎంసీ) 10.0 సెంటీమీటర్లు
మల్కాజిగిరి(జీహెచ్‌ఎంసీ) 9.8 సెంటీమీటర్లు
బండ్లగూడ(జీహెచ్‌ఎంసీ) 9.8 సెంటీమీటర్లు
రామాయంపేట(మెదక్) 9.7 సెంటీమీటర్లు
వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES