Saturday, January 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ చేతిలో నోబెల్‌ శాంతి బహుమతి

ట్రంప్‌ చేతిలో నోబెల్‌ శాంతి బహుమతి

- Advertisement -

అందజేసిన మచాడో
ఏ హామీ ఇవ్వకుండానే పంపేసిన డోనాల్డ్‌
బహుమతి గ్రహీత ఎలా మారుతారు ? : నోబెల్‌ పీస్‌ సెంటర్‌

వాషింగ్టన్‌ : వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గురువారం అమెరికా అధ్యక్ష భవనానికి వెళ్లారు. నోబెల్‌ కమిటీ తనకు ప్రదానం చేసిన శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు బహుమతిగా ఇచ్చేశారు. కానీ ఆయన నుంచి ఆమెకు ఎలాంటి మద్దతు లభించకపోవడం గమనార్హం. నికొలస్‌ మదురోను అమెరికా దళాలు నిర్బంధించిన తర్వాత వెనిజులా అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని మచాడో ఎంతగానో ఆశించారు. ట్రంప్‌ తనకే మద్దతు ఇస్తారని భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. వెనిజులా సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఉపాధ్యక్షురాలు రోడ్రిగుజ్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజుల క్రితమే ట్రంప్‌ ఓ ప్రకటన చేస్తూ తనను తాను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.

దీంతో మచాడో ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో మచాడో అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వెనిజులాలో ‘ప్రజాస్వామ్యం’ కోసం పోరాడినందుకు మచాడోకు గత సంవత్సరం నోబెల్‌ కమిటీ శాంతి బహుమతి ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె తన వద్ద ఉన్న ఆ బహుమతిని ట్రంప్‌ కు ఇచ్చేశారు. అందుకు ప్రతిగా ట్రంప్‌ తనకు ఓ పెద్ద బహుమతి ఇస్తారని ఆశ పడ్డారు. అయితే ట్రంప్‌ ఆమెకు మొండిచెయ్యి చూపారు. ట్రంప్‌ బ్రాండెడ్‌ బ్యాగ్‌ ఇచ్చి సాగ నంపారు. మచాడో రాజకీయ భవిష్యత్తుపై ట్రంప్‌ నుంచి ఏమైనా స్పష్టత వచ్చిందా అనే విషయం తెలియరాలేదు.

ఇది అద్భుతమైన గుర్తు
ట్రంప్‌-మచాడో సమావేశం అనం తరం అధ్యక్ష భవనం ఓ ఫొటోను విడుదల చేసింది. అందులో మచాడో పక్కన ట్రంప్‌ నిలబడి ఉన్నారు. ఆయన చేతిలో బంగారు పూత పూసిన ఫలకం ఉంది. దానిలో పతకం, మచాడోను ప్రశంసిస్తూ నోబెల్‌ కమిటీ చెప్పిన మాటలు ఉన్నాయి. ‘నేను చేసిన కృషికి గుర్తుగా మచాడో తన నోబెల్‌ శాంతి బహుమతిని నాకు అందజేశారు. ఇది పరస్పర గౌరవానికి సంబంధించి అద్భుతమైన గుర్తు’ అని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు.

అలా చేయకూడదు : నోబెల్‌ పీస్‌ సెంటర్‌
తాము ప్రదానం చేసిన బహుమతులను గ్రహీతలు ఎవరితోనూ పంచుకోరాదని, ఎవరికీ బదిలీ చేయరాదని ఒస్లోలోని నోబెల్‌ పీస్‌ సెంటర్‌ పునరుద్ఘాటించింది. ‘పతకం యజమానులను మార్చవచ్చు. కానీ నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మాత్రం మారరు’ అని స్పష్టం చేసింది. కాగా ట్రంప్‌తో జరిపిన సమావేశం చారిత్రకం, అసాధారణం అని మచాడో చెప్పుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -