– మృతులు, గాయపడిన వారి సంఖ్య, వివరాలను ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలి
– బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వెంటనే చెల్లించాలి
– ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి :
తెలంగాణ పౌర సమాజ నిజనిర్ధారణ బృందం డిమాండ్
నవతెలంగాణ-పటాన్‌చెరు
పాశ మైలారం సిగాచి పరిశ్రమ పేలుడు బాధితుల్లో మృతుల, గాయపడిన వారి సంఖ్య, ఘటన వివరాలను ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలనీ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వెంటనే చెల్లించాలనీ, పరిశ్రమ యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలంగాణ పౌర సమాజ నిజనిర్ధారణ బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమను ఆదివారం తెలంగాణ పౌర సమాజ ప్రతినిధుల బృందం నిజనిర్ధారణ చేసింది. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాల సభ్యులను సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కలపాల బాబూరావు నేతృత్వంలోని బృందం సభ్యులు అదివారం కలసి వివరాలను సేకరించారు. ప్రమాదంలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ కలపాల బాబూరావు మాట్లాడుతూ.. పరిశ్రమలో క్యాజువల్, కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నారని, కొద్దిమంది మాత్రమే పర్మినెంట్ ఉద్యోగులుగా ఉన్నారన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు ప్లాంట్‌లో రక్షణపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్యం కనీస అవగాహన కూడా కల్పించలేదని, భద్రతను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయలేదని, యాజమాన్యం ప్రమాదానికి పూర్తి బాధ్యత వహించకుండా, ఆస్పత్రిలో ఉన్న కార్మికుల విషయంలో తగిన పట్టింపులేకుండా వ్యవహరించిందని విమర్శించారు. విధుల్లో ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఈ ప్రమాదంలో ఎంతమంది కార్మికులు మరణించారు? ఎంతమంది గాయపడ్డారు? అనే విషయాలను ఇప్పటివరకూ అధికారికంగా ప్రభుత్వం కానీ, కంపెనీ యాజమాన్యం కానీ స్పష్టంగా ప్రకటించలేదని అన్నారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాల ప్రతినిధులకు, మరణించిన వారి మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయకపోవడం దారుణమన్నారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పినప్పటికీ, వారి మృతిని ధ్రువీకరించడం లేదని, వారికి డెత్ సర్టిఫికెట్ జారీ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10లక్షలు, కొంచెం గాయపడిన వారికి రూ.5లక్షలు ఇస్తామని ప్రమాదం జరిగిన రోజు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. కానీ మరణించిన వారి కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు చేతిలో పెట్టి మౌనంగా ఉందని, ఆయా కుటుంబాలకు మిగిలిన పరిహారం చెల్లింపు విషయంలో స్పష్టత ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలకు కారణాలను వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసినా, గాయపడిన, ప్రమాదం నుంచి బయట పడిన వారిని ఇంతవరకూ కమిటీ సభ్యులు కలసి వివరాలు సేకరించలేదని, బాధిత కుటుంబాల సభ్యులు బృందం దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిజ నిర్ధారణ బృందంలో రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది, మానవ హక్కుల వేదిక నాయకులు వసుధా నాగరాజు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ) రాష్ట్ర కో కన్వీనర్ కన్నెగంటి రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. వెంకట రెడ్డి, వై.అశోక్ కుమార్, నాయకులు జనార్ధన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఉస్మాన్, నాయకులు మజీద్, ప్రజా ఉద్యమాల జాతీయ (ఎన్‌ఏపీఎం) రాష్ట్ర కన్వీనర్ మీరా సంఘ మిత్ర, నాయకులు అఖిల్ సూర్య, కందిలి పత్రిక సంపాదకులు రాజేందర్ తదితరులు ఉన్నారు.
‘సిగాచి’ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES