ఓట్లు వేయలేదని నాయకుల బూతు పురాణం
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గొల్లగూడెం వాసులు
నవతెలంగాణ-అశ్వాపురం
గ్రామపంచాయతీ ఎన్నికల సమరం ముగిసినప్పటికీ వైరం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో ఓ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల గెలుపు కోసం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా వారు ఫలితాల్లో చుక్కలు చూపించారు. అది జీర్ణించుకోలేని నాయకులు తమకు ఓట్లు వేయలేదన్న అక్కసుతో బూతు పురాణం మొదలెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గొల్లగూడెం గ్రామపంచాయతీలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీలో దిగిన సర్పంచ్, వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య పోరు కొనసాగింది. మొత్తం 10 వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థికి పోటీ జరగ్గా.. బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు 8 వార్డులతో పాటు సర్పంచ్ అభ్యర్థి గెలుపొందారు.
హస్తం పార్టీ బలపరిచిన వారిలో రెండు వార్డు సభ్యులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటమిపాలైన అభ్యర్థికి మద్దతు తెలిపిన నాయకులు అవాకులు, చవాకులు పేలడం మొదలెట్టారు. ఓటమిని జీర్ణించుకోలేక ఓటర్లను దూషించారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులందరూ మూకుమ్మడిగా శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మళ్లీ శనివారం ఉదయాన్నే సుమారు 150 మంది పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమను తిట్టి అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులను అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకూ ఆందోళన విరమించేది లేదని పట్టుపట్టారు. ఫిర్యాదులో పేర్కొన్న వారిని అదుపులోకి తీసుకొని 13 మందిపై కేసు నమోదు చేసినట్టు సీఐ జి.అశోక్‌రెడ్డి తెలిపారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.



