నూతన విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపనలో ఉపముఖ్యమంత్రి బట్టి…
నవతెలంగాణ – అశ్వారావుపేట: గత పదేళ్ళు పాలించిన దొరలం కాదు, దోపిడీ దారులం కాదు.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలకులం అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో శనివారం సుమారు రూ.50 కోట్లు వ్యయం నూతనంగా నిర్మించనున్న 5 విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం అశ్వారావుపేటలోని పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అద్యక్షతన జరిగిన ఈ సభలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లు మాట్లాడుతూ.. దొరల పాలన కోసం దోపిడీ దారులు ఏకం అవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ తెలంగాణ ప్రజలను హెచ్చరించారు. నువ్వు, నీ కుటుంబం, నీ పార్టీ రాష్ట్ర సంపదను దోచుకుంటే న్యాయమా? అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను నాలుగు కోట్ల ప్రజలకు పంచాలని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టడం అన్యాయమా అని అన్నారు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి దోపిడీ చేయడానికి మేము అధికారంలోకి రాలేదు అని స్పష్టం చేసారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నాము అని ప్రకటించారు.
ఏ ఒక్క రైతు సోదరుడు గాని, విద్యుత్ వినియోగదారుడు ఇబ్బంది పడకూడదని స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ విన్నపంతో అశ్వారావుపేట నియోజకవర్గంలో 6 సబ్ స్టేషన్ లు మంజూరు చేసాం అని హర్షం వ్యక్తం చేసారు. ఒకే నియోజకవర్గంలో ఒకేసారి రూ.40 కోట్లతో 6 సబ్ స్టేషన్ లు మంజూరు చేయడం ఎమ్మెల్యే ఆదినారాయణ పట్టుదలకు నిదర్శనం అన్నారు. పదేళ్లు పాలించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేసింది అని ఆవేదన వ్యక్తం చేసారు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బు ఫామ్ హౌస్ నుండి ఖర్చు పెడుతూ సభలు పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడతారు అని ఎద్దేవా చేసారు. గతంలో మీరు ఇచ్చిన హామీలు ఒక్కటైన అమలు చేశారా? ఆని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదు అని, కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు తెచ్చి గోదావరిలో పోశారని వాపోయారు. ఏడు లక్షల కోట్లు అప్పు మా మీద పడేసారు అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఒకేసారి మంజూరు చేసుకున్నాం చెప్పారు. పదేళ్ళలో ఒక్క సారైనా గ్రూప్ వన్ పరీక్ష పెట్టారా అన్నారు.
ఏడాదిలో 57 వేల ఉద్యోగాలు ఇచ్చాం, మరో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చే పనిలో ఉన్నాం అని తెలిపారు. రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాస్ ద్వారా నిరుద్యోగులకు ఆసరా కల్పిస్తున్నాం అని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పధకం ఆపలేదు అని, ఇంకా పెంచి పథకాలు అమలు చేస్తున్నాం అన్నారు. ధనిక రాష్ట్రాన్ని దివాళా తీసిన నీకు పదేళ్లలో సన్న బియ్యం ఇచ్చే సోయి రాలేదు ఎందుకు అని ఎద్దేవా చేసారు. 90 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పథకం ప్రవేశ పెట్టాం అన్నారు. మీ పదేళ్ల పాలనలో గిరిజన నియోజక వర్గాల్లో అటవీ పట్టా భూముల సాగు విషయంలో మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టారు అని తెలిపారు. రూ.12,500 కోట్ల నిధులతో గిరిజనులు వ్యవసాయం కోసం ఇందిర గిరి జల వికాస్ పథకాన్ని ప్రవేశ పెడుతున్నాం అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి ఎన్నికల హామీ నిలబెట్టుకుని పేదల కళ్ళలో ఆనందం చూస్తున్నాం తెలిపారు. పేదలకు మంచి చేయడానికి కేబినెట్ మొత్తం సంక్షేమ పథకాలు రూపకల్పన చేస్తున్నాం అన్నారు. పేదలకు సాయం చేయడానికి కేసీఆర్ కి, కేటీఆర్ కి, హరీష్ రావుకు మనసు ఒప్ప లేదన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ నీ మీరు మూలకు పడేస్తే మేము ఆ వ్యయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి 90 లక్షల కుటుంబాలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం అన్నారు. స్త్రీలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకువచ్చింది అని తెలిపారు.
ఉచిత బస్ పథకం ఆపేయాలని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. పోషకాహారం ఇవ్వాల్సిన హాస్టల్స్ విషయంలో పదేళ్లు కేసీఆర్ పట్టించుకోలేదు అని, మేము అధికారంలోకి రాగానే డైట్ చార్జీలు 40 % కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచాం అని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలని ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలకు తగ్గకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నాం అని, అశ్వారావుపేటలోను ఒక స్కూల్ కు త్వరలో శంఖుస్థాపన చేస్తామన్నారు. పదేళ్లు రాష్ట్ర సంపద మొత్తం దోచుకుని వరంగల్ సభలో కేసీఆర్ కాంగ్రెస్ మీద బురద జల్లుతున్నారు అని తెలిపారు. ఇందిరా క్రాంతి ద్వారా రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రతి మహిళ తలెత్తుకుని బతికేలా చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర సంపద నాలుగు కోట్ల ప్రజలకి పంచుతాం తప్ప కేసీఆర్ మాదిరి దోచుకోము అని ఉద్ఘాటించారు. మన ప్రజా ప్రభుత్వంలో మెరుగైన పాలన చేసుకుందాం అని అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పార్కలగండి లో రూ. 2.24 కోట్లతో,అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం లో రూ. 3.10 కోట్లతో, తిరుమలకుంట లో రూ. 3.15 కోట్లతో, కావడిగుండ్ల లో రూ. 2.24 కోట్లతో,అశ్వారావుపేట పట్టణంలో రూ. 2.53 కోట్లతో నూతనంగా చేపట్టబోయే 33/11 కెవి సబ్ స్టేషన్ ల శంకుస్థాపనకు,అదేవిధంగా రూ. 24.46కోట్ల అంచనా వ్యయంతో 33 కేవీ ఫీచర్ ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు.
రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అశ్వారావుపేట నియోజకవర్గం కొన్ని దశాబ్దాల కాలంగా వెనుకబడి ఉంది అని,అలాంటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ధ్యేయం అని, అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి చొరవతో విద్యుత్ వెలుగులు నింపేందుకు విద్యుత్ సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకుంటున్నాం అన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రతీ తండాకు, ప్రతీ గ్రామానికి నాణ్యమైన విద్యుత్ తో పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే నని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది తెలిపారు. ఎనిమిదో అద్భుతం కాళేశ్వరం కడుతున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని ఎద్దేవా చేసారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది అని వాపోయారు. అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకుని వారు చేసిన తప్పిదాలను సరిచేస్తూ ఎన్నికల్లో ఇచిన ప్రతీ హామీని నెరవేరుస్తూ వస్తున్నాం అన్నారు. ఎవరికీ ఉపయోగపడని ధరణిని పక్కన పెట్టి ప్రతీ ఒక్కరికీ ఉపయోగ పడేలా భూ భారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకు వచ్చాం అన్నారు. విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తున్నాం, నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం, రాజీవ్ యువ వికాస్ పేరుతో త్వరలోనే ప్రతీ నిరుద్యోగికి ఉపాధి కల్పించేందుకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది అన్నారు.
గత ప్రభుత్వంలో కోళ్ల ఫారాల్లో, పాడుబడిన రైస్ మిల్లు ల్లో ఉన్న గురుకులాలను పక్కన పెట్టీ ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయలతో గురుకులాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అన్నారు. హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాం, మనసుంటే మార్గం ఉంటుంది అని, పేదవాడి కళ్లలో చిరునవ్వు చూడాలని కాస్త ఇబ్బందులు ఎదురు అయినా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. కచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం రైతుని రాజును చేశాం అనీ, రుణమాఫీని సక్రమంగా అమలు చేశాం, రైతు బంధు ఇచ్చాం. వర్షాకాలంలో సన్నాలు కి బోనస్ ఇచ్చాం, యాసంగిలో కూడా ఇస్తాం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.8 లక్షల 19 వేల కోట్ల రూపాయలకు మన ప్రభుత్వం ప్రతీ నెల రూ. 6500 కోట్లు అస్సలు, మిత్తి కడుతూ వస్తున్నాం అన్నారు. పేదవాడికి ఏది ముందు అవసరమో అది ఇస్తున్నాం అని, మొదటి విడతలో ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు ఇవ్వడం జరుగుతుంది అని, ఐటిడిఎ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కోటా కంటే ఎక్కువ ఇళ్లు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. గత ప్రభుత్వం చేసింది గోరంత చెప్పుకున్నది కొండంత అని మనం కొండంత చేసి గోరంత చెప్పుకుంటున్నాం అన్నారు. ఐ అండ్ పీఆర్ ద్వారా రూ. 1052 కోట్ల రూపాయలను అసత్యపు ప్రచారానికి గత బీఆర్ఎస్ పాలకులు అక్రమంగా వినియోగించుకున్నారు. పదిహేను, పదహారు నెలల నుంచి ఏ విధమైన పాలనను మన ప్రభుత్వం అందిస్తుందో రాబోయే మూడున్నర సంవత్సరాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అదే విధమైన మంచి సుపరిపాలన అందిస్తారని మనవి చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం, వైరా ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ లు పాల్గొన్నారు.
దొరల పాలన కాదు..ఇందిరమ్మ ప్రజా పాలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES