62 శాతం మంది ఇప్పటికీ నిరక్షరాస్యులే
63 శాతం మంది నిరుద్యోగులు
20 ఏండ్ల నితీశ్ పాలనలో ఇదీ పరిస్థితి : ఎన్‌ఏసీడీఏఓఆర్ నివేదిక
పాట్నా : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ పలు సామాజిక వర్గాల స్థితిగతులపై వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పలు సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు గణాంకాలతో ముందుకొస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో దళితుల పరిస్థితిపై నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్స్ (ఎన్‌ఏసీడీఏఓఆర్) ఓ నివేదికను బయటపెట్టింది. ‘బీహార్-వాట్ దళిత్ వాంట్’ అనే శీర్షిఖతో తన తాజా నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలో రెండు దశాబ్దాల నితీశ్ కుమార్ పాలనలో దళితులు ప్రయోజనం పొందలేదని వివరించింది. బీహార్‌లోని దళిత వర్గాల పరిస్థితి, వారి పోరాటాలు, అంచనాలపై ఈ సర్వే నివేదిక దృష్టి సారించింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వాదనలు, రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం, పేలవమైన విద్య, భూమి లేకపోవటం, సరైన గృహ వసతి లేకపోవటం వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న దళితుల వాస్తవికత మధ్య అంతరాన్ని ఇది హైలెట్ చేసింది.
రాష్ట్రంలో పాట్నా, గయ, ముజఫర్‌పూర్, పశ్చిమ చంపారన్, మోతిహరి, దర్బంగా వంటి ప్రధాన జిల్లాలతో సహా దాదాపు 25 జిల్లాల్లో సర్వే జరిపి ఈ నివేదికను తయారు చేశారు. మొత్తం 18,581 దళిత కుటుంబాలను సంప్రదించారు. నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్స్ (ఎన్‌ఏసీడీఏఓఆర్) చీఫ్ అశోక్ భారతి మాట్లాడుతూ.. బీహార్‌లో ప్రతి ఎన్నికల్లోనూ దళితుల గొంతులు అణచివేస్తుండటంతో తాము ఈ నివేదికను సిద్ధం చేశామన్నారు. రాజకీయపార్టీల ఎజెండాలు దళితుల ఆకాంక్షలు, వాస్తవిక ఆందోళనలను ప్రతిబింబించటం లేవని వివరించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్.. పురోగతిని తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. గత రెండు దశాబ్దాలుగా బీహార్‌లో నితీశ్‌ను ‘అభివృద్ధి పురుషుడు’ అని పిలుస్తున్నారనీ, కానీ రాష్ట్రంలో దళితుల పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయన్న వాస్తవాన్ని తమ నివేదిక చెప్తున్నదని ఆయన తెలిపారు.
బడ్జెట్‌లో తగ్గిన దళితుల వాటా
బీహార్ ముఖ్యమంత్రిగా 2005లో నితీశ్ అధికార పగ్గాలు చేపట్టారు. దాదాపు 20 ఏండ్లుగా ఆయన బీహార్‌ను పాలించారు. అయితే ఈ రెండు దశాబ్దాల ఆయన పాలనలో 62 శాతం మంది దళితులు నిరక్షరాస్యులుగా ఉన్నారని అశోక్ భారతి వివరించారు. అలాగే 63 శాతం మంది దళితులు నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు. వాటి సగటు నెలవారి ఆదాయం రూ.6480 మాత్రమేనని చెప్పారు. ”2013-14లో బీహార్‌లో దళితులకు బడ్జెట్ వాటా 2.59 శాతంగా ఉన్నది. ఇది ప్రస్తుతం 1.29 శాతానికి తగ్గింది. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో పలు జిల్లాల్లో దళితుల ఇండ్లను కూల్చేసింది. రాష్ట్రంలో ప్రతీ ఐదో బీహారీ దళితుడే అయినా.. నితీశ్ పాలనలో వారికి స్థానం ఎక్కడీ” అని ఆయన ప్రశ్నించారు.
బీహార్‌లో దళితులు విద్య, అక్షరాస్యత, జీవనోపాధి, ఉపాధి, ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక, భూమి సమానత్వం, సమాజంలో వివక్ష, హింస వంటివి ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తన నివేదికలో ఎన్‌ఏసీడీఏఓఆర్ 20 కీలక వర్గాల కింద 250 డిమాండ్లను పేర్కొన్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని రాజకీయ పార్టీలు వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో 20 అంశాలు చేర్చాలని కోరింది. వీటిలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, ప్రభుత్వ సేవలలో వివక్షతను తొలగించడం, ఎస్సీ, ఎస్టీ మహిళలకు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టడం, బీహార్‌లో ఎస్సీలు, ఎస్టీల అభివృద్ధికి హామీ ఇవ్వటం వంటివి ఇందులో ఉన్నాయి.
అభివృద్ధి పేరుతో దళితుల ఇండ్లను కూల్చారు
బీహార్‌లో దళితులు దీనస్థితిలో ఉన్నారని రాష్ట్రీయ ముషహార్ పరిషత్ సామాజిక సంస్థతో సంబంధం ఉన్న ఉమేశ్ కుమార్ మాంఝీ ఆందోళన వ్యక్తం చేశారు. ”బీహార్‌లో అభివృద్ధి పేరుతో భవనాలు నిర్మిస్తూ.. వేలాది మంది దళితుల ఇండ్లను నితీశ్ ప్రభుత్వం కూల్చేసింది. వారికి పునరావాసం కూడా కల్పించలేదు. గత డిసెంబర్‌లో నా సొంత ఇంటిని కూల్చివేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లూ చేయలేదు. 70వ దశకంలోలానే మేము రోడ్డు పక్కన గుడిసెలలో నివసించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మా బాల్యం, సంస్కృతి, సామాజిక నిర్మాణం.. ఇలా అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. నిరాశ్రయులైన వారు మాత్రమే ఈ బాధను అర్థం చేసుకోగలరు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అభివృద్ధి ఇదేనా?” అని ఆయన ప్రశ్నించారు. నితీశ్ 20 ఏండ్ల పాలనలో దళితుల పరిస్థితి మెరుగుపడలేదు కదా.. క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉమేశ్‌కుమార్ మాంఝీ, సామాజికవేత్త
బీజేపీ-జేడీ(యూ) కూటమికి ఘోర పరాభవం
ఈసారి జరుగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి దళితుల నుంచి తప్పక ఎదురుదెబ్బ తగులుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు దళిత సంఘాలు, సంస్థలు వెలిబుచ్చుతున్న గణాంకాలు, ఆందోళనలే దీనిని స్పష్టం చేస్తున్నదని అన్నారు. నితీశ్ పాలనలో దళితుల జీవన, విద్య, ఉద్యోగ, ఉపాధి పరిస్థితులు గణనీయమైనస్థాయిలో మెరుగుపడలేదన్న విషయాన్ని పలు నివేదికలు తెలిజేస్తున్నాయని వివరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ప్రతీ వర్గమూ తీవ్ర అసంతృప్తిలో ఉన్నది. దీంతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అధికార బీజేపీ-జేడీ(యూ) కూటమికి ఘోర పరాభవం తప్పదని దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు అంటున్నారు.