ప్రభుత్వమే ట్రాన్స్‌పోర్ట్ యాప్‌ను నిర్వహించాలి : కె.అజయ్ బాబు
ప్రజావాణిలో ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్- సీఐటీయూ వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో/ బంజారాహిల్స్
పోర్టర్ ఆన్‌లైన్ బిజినెస్ యాప్‌లో పార్టర్‌లుగా పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.అజయ్ బాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ‘సీఎం ప్రజావాణి’ కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించేందుకు పోర్టర్ డ్రైవర్లు తరలివచ్చారు. ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మెన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్(ఐఏఎస్)ను కలిసి యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.అజయ్ బాబు మాట్లాడుతూ.. పోర్టర్ యాజమాన్యం డ్రైవర్ల అక్రమ సస్పెన్షన్లను రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న 12-19శాతం కమీషన్‌ను 5-8 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించే యంత్రాంగం ఏర్పాటు చేయాలని, రూ.5లక్షల ప్రమాద బీమా, రూ.5 లక్షల జీవిత బీమా కల్పించాలని కోరారు. ప్రయివేట్ పోర్టర్ యాప్ దోపిడీని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ పార్టనర్ యాప్‌ను ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమానికి ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ నాయకులు ఉమేష్‌రెడ్డి అధ్యక్షత వహించారు.నాయకులు బి.మహేష్ మాట్లాడారు. అంతకుముందు స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కు వినతిపత్రం ఇచ్చిన సందర్భంగా చర్చలలో ఆర్కే రవి, పి.వెంకటేష్ నాయక్, మునీర్, హరికృష్ణారెడ్డి, ఎండీ సిరాజ్, సాజిద్ తదితరులు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది డ్రైవర్లు ఈ రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు. డీజిల్ ధరలు పెరుగుతున్నా రవాణా చార్జీలు పెంచకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను విన్న డాక్టర్ చిన్నారెడ్డి, దివ్య దేవరాజన్ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ కలీం, వైస్ ప్రెసిడెంట్ ముఖేష్ శర్మ, సహాయ కార్యదర్శులు ఎండీ మాజీద్, ఎండీ మోయిన్, పోర్టర్ యూనియన్ నాయకులు శివకుమార్, సిరాజ్, బి.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



