వారి పార్టనర్లు తోలుబొమ్మలు కాదు..: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య
ప్రభుత్వమే యాప్ తీసుకురావాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోర్టర్ డ్రైవర్లు సంబంధిత పనిలో భాగస్వాములా? బానిసలా? అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య ప్రశ్నించారు. పోర్టర్ ఆన్లైన్ బిజినెస్ యాప్‌కి డ్రైవర్ పార్టనర్స్ పేరుతో అటాచ్ అయిన డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఆ మేనేజ్మెంట్ పూనుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్(సీఐటీయూ) పోర్టర్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రెండురోజుల రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కె అజరుబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో వీరయ్య మాట్లాడుతూ గిగ్ వర్కర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెడుతున్నట్టు ప్రచారం చేసుకుంటుందనీ, కానీ..ఈ బిల్లును రూపొందించే ముందు కనీసం కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించటమేంటని ప్రశ్నించారు. గిగ్ వర్కర్లను భాగస్వాములంటూ ముద్దు పేర్లతో పిలవటం విడ్డూరంగా ఉందన్నారు. డ్రైవర్ల జుట్టు వారి చేతుల్లో పెట్టుకుని, ఆదాయం వారి చేతుల్లోనే పెట్టుకుని డ్రైవర్లను తోలుబొమ్మలుగా ఆటాడిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరు ఎలా బాగస్వాములవుతారని ప్రశ్నించారు. ప్లాట్‌ఫాం యజమానులకు కోపం వస్తే ఏదో ఒక నెపంతో తొలగిస్తారనీ, తిరిగి రెన్యూవల్ చేసుకోవాలంటే..పోలీసు స్టేషన్నుంచి సర్టిఫికెట్ తేవాలని చెప్పటం తగదని చెప్పారు. డ్రైవర్ల శ్రమను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కమీషన్‌ను ఎవరు నిర్ణయిస్తున్నారు..దానికి చట్టం, గైడ్లెన్స్ ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ట్రాన్స్‌పోర్టు రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు చట్టాన్ని చేసిందని గుర్తు చేశారు. ఆ చట్టం ప్రకారం వ్యక్తిగత వాహనా లను నడుపుకునే పరిస్థితి ఉండదని చెప్పారు. ఏదో ఒక ప్లాట్ ఫామ్‌లో చేరాల్సిం దేనన్నారు. గిగ్ వర్కర్లన్నా..డ్రైవర్లన్నా మోడీకి ఎందుకింత ద్వేషం? వీరంతా హిందూవులే కదా? అని ప్రశ్నించారు. పెట్టుబడి దారుల ప్రయోజనాలు కాపాడేందుకు మతం అడ్డం రాదని చెప్పారు. మతం పేరుతో రాజకీయాలు చేయటం, తద్వారా రాజకీయ లబ్ది పొందటమే వీరి లక్ష్యమని చెప్పారు. శ్రామికుల సౌకర్యాన్ని చూడకుం డా..తోలుబొమ్మలుగా పరిగణిస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ దీక్షల పట్ల పోర్టర్ మేనేజ్మెంట్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే వచ్చే నెల 6 న పోర్టర్ డ్రైవర్లు చేసే సమ్మెకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోర్టర్ యాపన్లో 30 వేల మంది సర్వీస్ పార్టనర్స్ పేరుతో డ్రైవర్లు పనిచేస్తున్నారని తెలిపారు. వీరు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సర్వీస్ పార్టనర్స్ పేరుతో డ్రైవర్ల సేవల్ని వినియోగించుకుంటూ కమిషన్ 12-19శాతం వరకు తీసుకుంటున్నారని తెలిపారు. చిన్న చిన్న కారణాలతో డ్రైవర్లను సస్పెన్షన్ చేస్తున్నారని చెప్పారు. సర్వీస్ అందించే క్రమంలో యాక్సిడెంటయినా, కస్టమర్ సమస్యలు వచ్చినా మేనేజ్మెంట్ కలగజేసుకోవట్లేదని తెలిపారు. మోటార్ వెహికల్స్ అగ్రిగ్రేటర్స్ గైడ్లెన్స్ యాక్ట్ ప్రకారం డ్రైవర్లకు ఇవ్వాల్సిన రూ.ఐదు లక్షల ప్రమాద బీమాని కూడా ఇవ్వడం లేదని చెప్పారు. కస్టమర్లను ఆకర్షించేందుకోసం గతంలో ఇచ్చిన దానికంటే తక్కువ రేట్లు ఇస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకునీ, ఛార్జీల రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. కమిషన్ ను ఐదు శాతం నుండి 8శాతానికి తగ్గించాలని సస్పెన్షన్లను రద్దు చేయాలని కోరారు. ‘మోటారు వాహన అగ్రిగేటర్ల మార్గదర్శకాల చట్టం 2025’ ప్రకారం,పోర్టర్ సంస్థలు తమ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ప్రమాద బీమా మరియు జీవిత బీమాను కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్డర్లను రద్దు చేసే హక్కు డ్రైవర్లకు ఉండాలన్నారు. కార్యక్రమంలో పోర్టర్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బి మహేష్, జనరల్ సెక్రటరీ సయ్యద్ మునీర్లు మాట్లాడారు. కాగా దీక్షలో కే సతీష్, శ్రీకాంత్ రెడ్డి, ఏడుకొండలు, పి దేవా, లక్ష్మీకాంతరెడ్డి, హరిదాస్, రామాంజనేయులు, నారాయణస్వామి, నాగేష్ బాబు, ఎం సతీష్, తదితరులు పాల్గొన్నారు.
పోర్టర్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



