బీఆర్‌ఎస్ బహిష్కరించడంతో అవకాశం
అసెంబ్లీలో జీరో అవర్‌లో ప్రస్తావన
పలు సమస్యలను పరిష్కరించాలన్న బీజేపీ, ఎంఐఎం సభ్యులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అధికార పార్టీకి చెందిన సభ్యులు సమస్యలను ఏకరువు పెట్టారు. నియోజకవర్గాల్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. బీఆర్‌ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో అధికార కాంగ్రెస్ సభ్యుల్లో ఎక్కువ మందికి ఈ అవకాశం లభించింది. బీజేపీ, ఎంఐఎం సభ్యులు పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. సోమవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో పలువురు సభ్యులు మాట్లాడారు. ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమ శాఖకు నిధులు కేటాయిస్తున్నా ఖర్చు చేయడం లేదని చెప్పారు. ఇంకా రెండు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనీ, వెంటనే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్నును తొలగించాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడు శ్రీగణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదన్నారు. జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తే కార్పొరేషన్ నిధులు, ఎమ్మెల్యే నిధులతో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేయొచ్చని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించాలని కోరారు. కాంగ్రెస్ సభ్యులు అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బస్‌డిపోను మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ సభ్యులు నాయిని రాజేందర్ మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాన్ని నిర్మించాలని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక వసతులను మెరుగుపర్చాలనీ, మందులుండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్‌లో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్‌ను నిర్మించాలని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండిలో మినీట్యాంక్‌బండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
బీజేపీ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికుల పెన్షన్లను ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించారు. ఎంఐఎం సభ్యులు మీర్ జుల్ఫీకర్ అలీ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు విపరీతంగా చలాన్లు వేస్తున్నారని అన్నారు. ర్యాపిడో, ఊబర్ బైక్‌లపైనా చలాన్లు వేస్తున్నారనీ చెప్పారు. చలాన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అధికారులు రూ.30 వేలు, రూ.40 వేలు బిల్లులు చెల్లించాలంటున్నారనీ, వాటిని రద్దు చేయాలని కోరారు. కాంగ్రెస్ సభ్యులు మందుల సామేల్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదైందని వివరించారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 47 శాతమే పోలింగ్ నమోదైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటేయని వారికి నీళ్లు, కరెంటు ఆపాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సభ్యులు శంకరయ్య మాట్లాడుతూ ఉద్యమకారులు, జర్నలిస్టులను గౌరవించాలనీ, వారికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యులు విజయరమణారావు మాట్లాడుతూ చెక్‌డ్యామ్‌లు పేలడంపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.వాటిలో నాణ్యతా లోపం, డిజైన్ లోపం ఉందన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ స్పందిస్తూ చెక్‌డ్యామ్‌లు కూలిపోవడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని చెప్పారు. బాధ్యులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ సభ్యులు పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు (ఏసీడీపీ) కేటాయిస్తున్నా సభ్యులకు ఇవ్వడం లేదన్నారు. ప్రజలు అడిగిన చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు.
కాంగ్రెస్ సభ్యులు ఆదినారాయణ మాట్లాడుతూ దమ్మపేట, చంద్రుగుండ మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలను వచ్చే విద్యాసంవత్సరంలోగా ప్రారంభించాలని కోరారు. ‘ఆడపల్లి ఆడపిల్ల ఆడేపిల్లనట.. నేను పాడు పిల్లనట’ అంటూ పాటపాడారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు 13 వేల అక్రిడిటేషన్లను తగ్గిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడలో 50 పడకల ప్రసూతి ఆస్పత్రిని నిర్మించాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడు మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ గొల్లపల్లిని అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌గా చేయాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యులు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాటా ్లడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ ఆత్మగౌరవ భవనా లను నిర్మించాలని కోరారు. అనంతరం మంగళ వారం ఉదయం పది గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
అధికార పార్టీ సభ్యుల సమస్యలు ఏకరువు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



