క్యాలెండర్‌లో ఒక సంవత్సరం అంతర్థానమైంది. దాని స్థానంలో న్యూ ఇయర్ వచ్చి చేరింది. దేశంలోను, రాష్ట్రంలోనూ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణలో నయా సాల్ రాక సందర్భంగా రూ.వెయ్యి కోట్ల మేర లిక్కర్ అమ్మకాలు కొనసాగాయన్నది అధికారికవర్గాల లెక్క. దీన్నిబట్టే వేడుకలు ‘ఏ స్థాయి’లో జరిగాయో తెలుసుకోవచ్చు. వేడుకలు, సంబురాల మాటెలా ఉన్నా.. కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడి ప్రజలకు అనేకానేక సవాళ్లు ఎదురుకానున్నాయి. వీటిని ఎదుర్కోవటం, పోరాడటం, పరిష్కరించుకోవటమనే బృహత్తర కర్తవ్యం మనమీద ఉంది.
పాత సంవత్సరం పోతూపోతూ మన రాష్ట్రంలోని పేదలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారికి ఊతమిచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టా (నరేగా) నికి ఉరేసిపోయింది. దేశవ్యాప్తంగా యాభై శాతం మహిళా కూలీలు నరేగా ద్వారా ఉపాధి పొందితే.. తెలంగాణలో అది అరవై రెండు శాతంగా నమోదైంది. దీన్నిబట్టి రాష్ట్రంలోని మహిళలకు ‘ఉపాధి’ ఏ విధంగా ఊతమిచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఇంతటి ప్రాముఖ్యమున్న ఈ చట్టం పరిధిలో తెలంగాణలో ఐదు కోట్ల పనిదినాలకు కోతపెట్టిన మోడీ సర్కార్… దాన్ని చావు దెబ్బ కొట్టింది. బీహార్‌లో మాదిరిగా తెలంగాణలోనూ ‘సర్’ను అమలు చేసి తీరతామంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన దరిమిలా.. ఇతర రాష్ట్రాల్లో దాని పర్యవసాలను చూసిన మనకు ఇక్కడ ఏం జరగబోతోందో చెప్పాల్సిన అవసరం లేదు. విద్యుత్ సవరణ చట్టాలు తెలంగాణకు గుదిబండగా మారనున్నాయి. అవి అమల్లోకి వస్తే…రైతులు, పేదలకు ఇస్తున్న ఉచిత కరెంటుకు రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వాల్సి వస్తుంది. విద్య, వైద్య తదితర సంస్థలకు ఇచ్చే క్రాస్ సబ్సిడీకి కత్తెరలు పడతాయి. నూతన విత్తన ముసాయిదా చట్టం విత్తనోత్పత్తి రాష్ట్రమైన తెలం గాణకు శాపంగా మారబోతోందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కొత్త సంవత్సరంలో మనకు గుదిబండలుగా మారనున్నాయి.
కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తన వాటాలను క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తోన్న మోడీ ప్రభుత్వం…ఆ మేరకు రాష్ట్రాలపై పెను భారాలు మోపేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా ఇరవై వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ఖజానాపై పడనుంది. ప్రభుత్వం చెబుతున్న రూ. 8.50 లక్షల కోట్ల అప్పు, అందుకు సంబంధించి అసలు, వడ్డీ కలిపి సగటున నెలకు రూ.6,600 కోట్లు చెల్లిస్తున్న క్రమంలో ఇప్పుడు అదనంగా వచ్చిపడ్డ వేల కోట్ల భారం.. రాష్ట్ర ప్రభుత్వ నడ్డి విరగొట్టటం ఖాయం. గత ప్రభుత్వ హయాంలో అనేకానేక హామీలు అమలు కాలేదని ప్రజలు.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పగ్గాలు అప్పగించారు. రేవంత్ రెడ్డి సర్కారుకు ఇప్పుడు రెండేండ్లు పూర్తయ్యాయి. ఆరు గ్యారెంటీల అమలు నత్తనడకన సాగుతోందనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. మన వాటాలను సరిగ్గా చెల్లించకపోవటంతో కేంద్రం నుంచి వివిధ పథకాలకు రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు రావటం లేదనే అపవాదు ఉండనే ఉంది.
నిర్ణయాలు తీసుకోవటంలో వేగం, తాజా దనం కొరవడుతున్నాయనే సంకేతాలు బలంగా వినబడుతున్నాయి. మోడీ ‘వికసిత్ భారత్ -2047’ మాదిరిగానే ‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్’ ఉంది తప్ప కొత్తదనమేమీ లేదని ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఆ డాక్యుమెంట్‌లోని ప్రణాళికలు ప్రజలు కేంద్రంగా లేవనే వాదనలు కూడా వినబడుతుండటం గమనార్హం. చాలినన్ని ఆర్థిక వనరులు లేకుండా అందులోని లక్ష్యాలను ఏ విధంగా చేరుకోగలమన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల సృష్టిపై కూడా సర్కారు దృష్టి పెట్టలేదన్నది కాదనలేని వాస్తవం. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈ సవాళ్లన్నింటినీ ఎలా అధిగమిస్తుందనేది కూడా పెద్ద సవాలే. ఒకవైపు నిధులు, విధులు, అధికారాల కోసం కేంద్రంపై పోరాడటం, మరోవైపు తన పరిపాలనలోని వైఫల్యాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవటం కాంగ్రెస్ ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. తన పాలనకు రెండేండ్లు పూర్తయిన సందర్భంలో ఇంకా ఆత్మస్తుతి, పరనింద అనే మూస ధోరణిని పక్కనబెట్టి, ఇక నుంచైనా పాలనపై పూర్తి స్థాయిలో అది దృష్టి కేంద్రీకరిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.
నయా సాల్ కా సవాల్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



