– ఉన్నతవిద్యలో జాతీయ విద్యావిధానం అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలి
– బడ్జెట్‌లో కనీసం 20శాతం నిధులు కేటాయించాలి
– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రసదస్సులో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ప్రముఖ విద్యావేత్త వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర విద్యాభివృద్ధి లక్ష్యంగా విద్యాకమిషన్ సమర్పించిన సిఫారసులను సవరించి, మరింత సమగ్రంగా విస్తృతపరచాలని మాజీ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ఆర్.వెంకట్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్‌లోని సీఐటీయూ నగర కార్యాలయంలో మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్ అధ్యక్షతన తెలంగాణ విద్యాకమిషన్ సిఫార్సులపై రాష్ట్ర సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా నర్సిరెడ్డి, వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాకమిషన్ శ్రమించి సిఫారసులు చేయడం అభినందనీయ మన్నారు. అయితే కొన్ని కీలక అంశాల్లో సవరణలు చేసి మరింత విస్తృతపరచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పాఠశాల విద్యపై కమిషన్ నివేదిక ద్వారా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటా యింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించిన సిఫారసులు శాస్త్రీయంగాలేవని, ఆ వ్యవస్థ క్రమ బద్ధంగా ఉండాలని, కాంట్రాక్ట్ విధానం సరైంది కాదని చెప్పారు. పూర్వ ప్రాథమిక విద్యపై సిఫార్సులు ఆమోదయోగ్యమైనప్పటికీ, ప్రభుత్వం ఉచిత ప్రాథమిక విద్యపై ప్రజల్లో నమ్మకం పెంపొం దించాల్సిన అవసరం ఉందన్నారు. 3 నుంచి 18 ఏండ్ల వయసు గల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించేలా చట్టపరమైన మార్పులు చేయాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టీపీఎస్) పేరుతో విద్యను కేంద్రీకరించడం సరికాదని, స్థానిక పాఠశాలలను బలహీనపరిచి కొత్త పాఠశాలలు ప్రారంభించడం వల్ల విద్యా వ్యవస్థకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
ఓయూ ప్రొ.డాక్టర్ ఆమంచి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నత విద్యలో జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) అంశాలను అమలు చేసే క్రమంలో రాష్ట్రానికి అనుకూలమైన అంశాల కంటే మార్కెట్ ఆధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. దీని వల్ల విద్య ప్రయివేటీకరణ దిశగా సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని విశ్వవిద్యాలయాలకు కామన్ అకాడమిక్ క్యాలెండర్ ఉండాలని, కాలేజీల గవర్నింగ్ బాడీలను బలోపేతం చేయాలని సూచించారు. ఎకనామిక్ స్టాండర్డ్స్ పేరిట తీసుకొచ్చిన 50శాతం పాస్ శాతం కారణంగా బలహీనవర్గాల విద్యార్థులు వెనుకబడే ప్రమాదం ఉందని, పాత విధానంలోని 35శాతం పాస్ శాతం కొనసాగించాలని డిమాండ్ చేశారు. వసతిగృహాలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై కమిషన్ సమగ్రంగా చర్చించలేదని, విద్యార్థి సంఘాల ఎన్నికలపై స్పష్టత ఇవ్వలేదని వివరించారు. అటానమస్, మెడికల్, ఇంజినీరింగ్ విద్య, రాష్ట్రంలోని ప్రయివేట్ యూనివర్సిటీలపై సరైన ప్రస్తావన లేదన్నారు. బాలిక విద్య, పరిశోధనల ప్రోత్సాహం, ఫెలోషిప్‌లు అందని విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రయివేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లపై స్పష్టమైన విధానాలు అవసరమన్నారు. కార్పొరేట్, ప్రయివేట్ ఉపాధ్యాయుల జీతాలు, భద్రత వంటి అంశాలనూ కమిషన్ విస్మరించిందని విమర్శించారు. ఈ సదస్సులో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి పొడపంగి నాగరాజు, జార్జిరెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్.నాగేశ్వరరావు తో పాటు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని మాట్లా డారు. ఈ క్రమంలో విద్యా కమిషన్ సిఫార్సులను సవరించి మరింత సమగ్రంగా రూపొందించాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సదస్సు డిమాండ్ చేసింది. ఈ సదస్సులో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.మమత, డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కార్తీక్, రాజకుమార్, రాజేష్, జె.రమేష్, లెనిన్, స్మరణ, శ్రీనాథ్, శ్రీకాంత్, జ్ఞాపిక, నవ్య, కరీంనగర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.
విద్యాకమిషన్ సిఫారసులు సవరించి విస్తృతపరచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



