ఐక్య ఉద్యమాల ద్వారానే కార్మికుల హక్కులు సాధించుకోవాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు బాస్కర్
ఎస్వీకేలో కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం
నవతెలంగాణ-అంబర్‌పేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధ వైఖరిని కార్మిక వర్గం ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చుక్క రాములు అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె. సూర్యం, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ ఆహ్వానం పలికారు. ఉపాధ్యక్షులు భూపాల్ కార్మికుల హక్కుల సాధనకు రాబో యేరోజుల్లో చేపట్టాల్సిన ఉద్యమాలపై తీర్మానం ప్రవేశపెట్టారు.
చుక్క రాములు మాట్లాడుతూ.. కార్మికోద్యమాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధ చర్యలను తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ, గ్రామపంచాయతీ కార్మికులు శాంతియుతంగా ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి కోరినా నిరాకరించి అరెస్టులు చేయడం నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై నిరంతరం నిర్బంధాలు విధిస్తే అదేబాటలో రాష్ట్ర ప్రభుత్వం నడవడం సరికాదని, రాబోయే రోజుల్లో కార్మికుల హక్కులపై అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సొమ్ము, హక్కులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని అడ్డుకోవాల్సిందిపోయి అంగన్వాడీ, ఆశ వర్కర్లు శాంతియుతంగా ధర్నాలు చేస్తే నిర్బంధించడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా ఈ వైఖరి విడనాడాలని హెచ్చరించారు. మహిళా నాయకులు పి.జయలక్ష్మి, మంగ, సునీత, కాసు మాధవి, ఎస్వీ, రమను అర్ధరాత్రి వేళల్లో అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అందరం ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వ నిర్బంధ వైఖరిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ మాట్లాడుతూ.. వివిధ రంగాల కార్మికుల సమస్యలపై ఐక్య ఉద్యమం చేయాలన్నారు. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె.సూర్యం మాట్లాడుతూ.. కనీస వేతనాలు పెంచకుండా, కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు మాట్లాడుతూ.. హామీలు అమలు చేయాలని పోరాడుతున్న కార్మికులపై దాడులు చేయడం అన్నాయమన్నారు. టీయూసీఐ ఎస్ఎల్ పద్మ, ఐఎన్టీయూ నాయకులు పి.శివబాబు, ఏఐటీయూసీ నాయకులు కె.యాదగిరి, బీఆర్టీయూ మారయ్య, సీఐటీ యూ అనుబంధ సంఘాల నాయకులు ఆర్.సుదాభాస్కర్, ఎస్వి.రమ, జె.మల్లికార్జున్, పి.జయలక్ష్మి, విఎస్.రావు ప్రసంగించారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు వందన సమర్పణ చేశారు. అన్ని కార్మిక సంఘాలు కలిసి ప్రభుత్వ నిర్బంధ విధానాలకు నిరసనగా ఐక్య పోరాటం చేయాలని తీర్మానం చేశారు.
ప్రభుత్వాల నిర్బంధ వైఖరిని తిప్పికొట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


