గోవిందాపురం (ఎల్)గ్రామానికి చెందిన కన్నెపొగు బాబుకు మూడు చక్రాల వాహనం అందజేత
నవతెలంగాణ – బోనకల్
సీపీఐ(ఎం) పోరాటం, కృషి, వికలాంగుడి పట్టుదల ఎట్టకేలకు ఫలించింది. అనేక సంవత్సరాలుగా మూడు చక్రాలు వాహనం లేక ఆ వికలాంగుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రెండు కాళ్లు పనిచేయటం లేదు. కర్ర సహాయంతో ఆ వికలాంగుడు తన జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో తనకు ప్రభుత్వం మూడు చక్రాల వాహనాన్ని అందజేయాలని సంవత్సరాల తరబడి వేడుకొంటూ వస్తున్నాడు.
చివరకు సీపీఐ(ఎం) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినత పత్రం కూడా అందజేశారు. దీని ఫలితంగా ఆ వికలాంగుడికి ఫలితం దక్కిన సంఘటన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) కార్యకర్త కన్నెపోగు బాబుకి మంగళవారం దక్కింది. దీంతో సీపీఐ(ఎం) ఆ వికలాంగుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన కన్నేపోగు బాబు చిన్నప్పటి నుంచే వికలాంగుడు. రెండు కాళ్లు పూర్తిస్థాయిలో లేకపోయినా కన్నెపోగు బాబు సీపీఐ(ఎం) బలమైన సానుభూతిపరుడుగా ఉంటున్నాడు. మూడు చక్రాలు వాహనం లేకపోవడంతో బాబు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కన్నె పోగు బాబు గత కొంతకాలం క్రితం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో తనకు మూడు చక్రాల వాహనం ఇప్పించాలని దరఖాస్తు అందజేశాడు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బోనకల్లు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గోవిందాపురం ఎల్ గ్రామానికి వెళ్లారు.
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, లక్ష్మీపురం సొసైటీ మాజీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు ఇంటికి మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. ఆ సమయంలో మాదినేని వీరభద్రరావు కన్నెపోగు బాబు పరిస్థితిని వివరించారు. కన్నెపోగు బాబు మల్లు భట్టి విక్రమార్కకు తనకు మూడు చక్రాల వాహనం ఇప్పించాలని వినతి పత్రం కూడా అందజేశారు. దీంతో మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ కన్నెపోగు బాబుకు ప్రభుత్వం తరఫున తప్పకుండా మూడు చక్రాల వాహనాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మల్లు భట్టి విక్రమార్క మధిరలో తన క్యాంపు కార్యాలయంలో కన్నెపోగు బాబుకి మూడు చక్రాల వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కన్నెపొగు బాబు మాట్లాడుతూ తనకు ప్రభుత్వం నుంచి మూడు చక్రాల వాహనం ఇప్పించడంలో కృషిచేసిన సీపీఐ(ఎం) గ్రామ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


