Friday, February 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యాక్షేత్రంలో 'మనువాద' పునరాగమనం!

విద్యాక్షేత్రంలో ‘మనువాద’ పునరాగమనం!

- Advertisement -

భారతదేశంలోని ఉన్నత విద్యాసంస్థలు జ్ఞాన సముపార్జన కేంద్రాలుగా ఉండాల్సిందిపోయి, కుల వివక్షకు నిలయాలుగా, అగ్రహారాలుగా మారుతున్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఈ వివక్షను రూపుమాపడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) తీసుకువచ్చిన ‘ఈక్విటీ రెగ్యులేషన్స్‌ 2026’ పై ప్రస్తుతం జరుగుతున్న రగడ వెనుక లోతైన రాజకీయ ప్రయోజనాలు, సామాజిక ఆధిపత్య కాంక్ష దాగి ఉన్నాయి. అణగారిన వర్గాల చైతన్యాన్ని అణచి వేయడానికి అగ్రవర్ణ శక్తులు చేస్తున్న ఈ పోరాటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. కుల వివక్ష అవాస్తవమని వాదించటం ఆత్మవంచన.

మనిషిని వివక్ష ఎంతగా బాధిస్తుందో, పర్యవసానాలెలా ఉంటాయో దాన్ని అనుభవించేవారికి తప్ప అన్యులకు తెలిసే అవకాశంలేదు. అందుకే కుల వివక్షయినా, లింగవివక్షయినా అవేమంత పెద్ద విషయాలు కాదన్నట్టు వాదించేవారు కనబడుతున్నారు. విద్యా సంస్థల్లో కుల వివక్ష రూపుమాపటం సంగతలా ఉంచి, దాన్ని ప్రోత్సహించే ధోరణులు కనబడటం చేదునిజం. ఇటీవల కాలంలో క్యాంపస్‌లలో కులవివక్ష పెరిగిందని గణంకాలు చెప్తున్నాయి. 704 విశ్వవిద్యాలయాలు, 1553 కళాశాలలు, 2160 ఫిర్యాదులందాయి. దీన్ని ఏమంటారు? కులవివక్ష అవాస్తవమని వాదించటం, ఆత్మవంచన కాక మరెమిటీ?

అక్షరంపై వివక్ష ఈనాటిది కాదు
శతాబ్దాల క్రితం శూద్రులకు, అతి-శూద్రులకు అక్షరాన్ని దూరం చేసిన మనువాద భావజాలమే నేడు ఆధునిక రూపంలో విద్యా సంస్థలను శాసిస్తోంది. రోహిత్‌ వేముల, పాయల్‌ తాడ్వి వంటి విద్యార్థులు తమ మేధస్సుతో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టగానే, వారిని వ్యవస్థాగతంగా వేధించి ఆత్మహత్యలకు పురికొల్పడం మన దేశంలో పరిపాటిగా మారింది. ఈ వివక్షను అడ్డుకోవడానికి యుజిసి కఠినమైన నిబంధనలు తెచ్చినప్పుడు, వాటిని స్వాగతించాల్సింది పోయి బీజేపీ, ఆరెస్సెస్‌, ఇతర ఆధిపత్య సంఘాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? ఈ ఆందోళనల వెనుక మత రాజకీయ ప్రయోజనాలున్నాయి. 2026 నాటి రాజకీయ సమీకరణాలను గమనిస్తే, పాలక పక్షం తన ప్రధాన మద్దతుదారులైన అగ్రవర్ణాల ప్రయోజనాలను కాపాడటానికి సిద్ధపడింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సవర్ణ ఓటు బ్యాంకును కోల్పోకుండా ఉండటానికే, కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనల అమలులో వెనకడుగు వేస్తోందన్నది బహిరంగ రహస్యం.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, అణగారిన వర్గాలకు కేవలం కాగితాల మీద మాత్రమే పరిమితం కావాలనేది ఈ శక్తుల ఉద్దేశం.

”అందరికీ సమానత్వం” అనే నినాదం పేరుతో చారిత్రిక అన్యాయానికి గురైన వారికి ఇచ్చే ప్రత్యేక రక్షణలను తొలగించాలనేది వీరి అసలు ప్లాన్‌. ఆధిపత్య సంఘాలు చేస్తున్న వాదనలు ఎంత కుట్రపూరితమైనవో ఒక్కసారి పరిశీలిస్తే ”అగ్రవర్ణాలకూ రక్షణ కావాలి” అంటున్నారు. కింది కులాల వారికి మాత్రం వివక్ష వద్దంటే ఆందోళనలు చేస్తున్నారు. అసలు ”వివక్ష” అనేది ”అధికారం ఉన్నవాడు లేనివాడి మీద చేసే దాడి”. వేల ఏళ్లుగా అధికార పీఠాలను ఏలుతున్న అగ్రవర్ణాలు తాము వివక్షకు గురవుతున్నామని అనడం హాస్యాస్పదం. ఇది బాధితుడిని నేరస్తుడిగా, నేరస్తుడిని బాధితుడిగా చూపే కుట్రలో భాగం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలోనూ ఇదే భయాన్ని సృష్టించారు. అణగారిన వర్గాల చేతికి చట్టబద్ధమైన అధికారం వస్తే తమ అహంకారాన్ని ఎక్కడ దెబ్బతీస్తారో అన్న భయమే వారిని ఈ అవాస్తవ ప్రచారానికి పురికొల్పుతోంది.కులవివక్షను స్పష్టంగా నిర్వచించలేదని సుప్రీంకోర్టు ద్వారా స్టే తెప్పించడం వెనుక పెద్ద న్యాయపరమైన కుట్ర ఉంది. వివక్షను నిర్వచించడం కంటే దాన్ని అనుభవించే వారి వేదనను అర్థం చేసుకోవడం ముఖ్యం.

అట్రాసిటీ చట్టం వర్సెస్‌ యుజిసి నిబంధనలు
గతంలో అట్రాసిటీ చట్టం మీద జరిగిన దాడికి, నేటి యుజిసి 2026 నిబంధనల మీద జరుగుతున్న దాడికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. రెండు సందర్భాల్లోనూ అగ్రవర్ణ శక్తులు ”సమానత్వం”, ”దుర్వినియోగం” అనే ఆయుధాలను వాడాయి. అంటే, ఏ చట్టం అణగారిన వర్గాలకు నిజమైన అండగా నిలుస్తుందో, ఆ చట్టాన్ని సమాజానికి ప్రమాదకారిగా ఉందని ఆందోళనలు చేయడంలో అర్థంలేదు. విద్యా సంస్థలు కుల రహితంగా మారాలంటే, కేవలం నిబంధనలు సరిపోవు. ఆ నిబంధనల అమలును పర్యవేక్షించే గట్టి యంత్రాంగం ఉండాలి. అది ఉందా? ఒకవేళ ఉంటే అది ఎవరి ఆధిపత్యంలో ఉంది? దళిత, బహుజన, మైనారిటీ విద్యార్థులు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి. అగ్రవర్ణ అహంకారాన్ని ఆధిపత్యాన్ని ప్రశ్నించే ధైర్యం ప్రతి విద్యార్థిలో కలగాలి. యూనివర్శిటీలో మౌనంగా ఉండే మెజారిటీ విద్యార్థులు ఈ అన్యాయాలపై గొంతు విప్పాలి.

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీలో ఆరెస్సెస్‌ విద్యార్థులు, ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు దీన్ని నిరసిస్తూ కొంతమంది రాజీనామాలు కూడా చేశారు. యుజిసి కఠిన నిబంధనలు అవసరం అని దళిత బహుజన సంఘాలు సమర్థిస్తుండగా ఆధిపత్య కులాల అహంకార ధోరణితో అక్కసు వెళ్లగక్కుతుంది. అణగారిన వర్గాల ఓట్లతో గెలిచి వారినే అణచివేసే చట్టాలను తెచ్చే శక్తులను ఎండగట్టాలి. యుజిసి-2026 నిబంధనలపై జరుగుతున్న ఈ యుద్ధం కేవలం విద్యా రంగానికి సంబంధించింది కాదు. ఇది భారతదేశ ఆత్మ గౌరవానికి, రాజ్యాంగ విలువల రక్షణకు సంబంధించినది. అగ్రవర్ణ అహంకారం మళ్లీ మనుస్మృతిని తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే, అణగారిన వర్గాలు తమ చైతన్యంతో ఆ కుట్రలను తిప్పికొట్టాలి. అక్షరం అనేది ఒక వర్గం జాగీరు కాదు, అది అందరి హక్కు. ఆ హక్కును కాపాడుకోవడానికి చేసే పోరాటంలో వెనకడుగు వేయకూడదు.

భూపతి వెంకటేశ్వర్లు
9490098343

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -