ప్రధాన కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి
వికారాబాద్‌లో చట్టంపై అవగాహన
నవతెలంగాణ- వికారాబాద్
సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) 2005ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో శనివారం సమాచార హక్కు చట్టం-2005పై పీఐఓలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యమ్రానికి ఆర్టీఐ కమిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి, మొహసిన్ పర్వీన్, వైష్ణవి మెర్ల, జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) సుధీర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్‌ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 17వేల దరఖాస్తు లు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో జిల్లాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్ష 50 వేల మంది సమాచారం అడుగుతున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 137 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్కువ ఉండటంతో జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ప్రతి అధికారీ తన హక్కులు, బాధ్యతలు.. చట్టపరంగా పాటించాల్సిన మార్గదర్శకాలను తెలుసుకొని సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. పీఐఓ ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందని పక్షంలో ఫస్ట్ అప్పిలేట్ అథారిటీని సంప్రదించేలా అవగాహన కల్పించాలని కోరారు.
ఇతర కమిషనర్లు పివి. శ్రీనివాసరావు, మొహసిన్ పర్వీన్, దేశాల భూపాల్, బి.అయోద్యరెడ్డి, వైష్ణవి మెర్ల మాట్లాడారు.. ఆర్టీఐ చట్టం ప్రజల్లోకి వెళ్లేందుకు అధికారులు వారధులుగా పనిచేయాలన్నారు. ప్రపంచంలోకెల్లా సమాచార హక్కు చట్టం అమలులో భారతదేశం 8వ స్థానంలో ఉందని తెలిపారు. దేశంలో మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలని సూచించారు. ఈ సందర్భంగా చట్టంపై పీఐఓ, ఏపీఐలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు సమాచార హక్కు చట్టం చాలా దోహదం చేస్తుందన్నారు. ఆర్టీఐ మార్గదర్శకాల ప్రకారం అధికారులు దరఖాస్తుదారుకు పారదర్శకంగా సమాచారాన్ని అందించాలని సూచించారు. జిల్లాలో దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని తెలిపారు. అనంతరం 137 కేసులను కమిషన్ సభ్యులు పరిశీలించి పరిష్కరించారు. ముందుగా కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ప్రధాన కమిషనర్, కమిషనర్లు పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సమావేశంలో పీఐఓలు, ఏసీఐఓలు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఫస్ట్ అప్పిలేట్ అధికారులు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టాన్నికట్టుదిట్టంగా అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES