Friday, April 10, 2026
E-PAPER
Homeజాతీయంఓటు హక్కుకు హామీ కల్పించాలి

ఓటు హక్కుకు హామీ కల్పించాలి

- Advertisement -

ఓటరును అనుమానితుడుగా చూస్తున్నారు
బెంగాల్‌లో ఈసీ తీరు పట్ల తీవ్ర నిరసన
ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి లేఖ

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) పేరుతో ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్లు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు గురువారం ఒక లేఖ రాశారు. ఎలాంటి పరిస్థితులెదురైనా ఓటు వేసే రాజ్యాంగ హక్కుకు ఎన్నికల కమిషన్‌ హామీ కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించడంపై తమ పార్టీ తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తోందని, ఈ తీరు పట్ల తీవ్ర నిరసన కూడా తెలియచేస్తోందని చెప్పారు. 90లక్షలకు పైగా ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి మినహాయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది రాష్ట్ర ఓటర్లలో దాదాపుగా 12శాతంగా వుంది. గణనీయమైన సంఖ్యలో కేసులను ‘విచారణలో వున్నాయి’ అనే కేటగిరీలో వుంచారు. కాగా, పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన పరిష్కార యంత్రాంగాలేవీ అందుబాటులో లేవని, పని చేయడం లేదని వెల్లడైంది.

ఓటర్ల జాబితాలను పాలనాపరమైన రీతిలో ఆధునీకరించే రొటీన్‌ ప్రక్రియకు విరుద్ధంగా సర్‌ను పెద్ద ఎత్తున ఓటర్ల ఓటు హక్కును రద్దు చేసేందుకు ఒక పద్ధతి ప్రకారం సాగించే ప్రక్రియగా తాము మొదట నుంచి కూడా భావిస్తూ వచ్చామని బేబీ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ‘తార్కిక స్థిరత్వం’ (లాజికల్‌ కనిసిస్టెన్సీ) వంటి ఏకపక్ష ప్రామాణికాలతో కూడిన, అలాగే పారదర్శకమైన క్షేత్రస్థాయి ఆధారిత నిర్ధారణలకు బదులుగా ఆల్గారిథమ్‌ ఆధారిత బహిష్కరణలపై ఆధారపడడం పెరుగుతోందని గ్రహించామని ఆయన పేర్కొన్నారు. గతంలో చేపట్టిన ప్రక్రియల్లా కాకుండా ఓటరును అనుమానితుడిగా చూస్తున్నారు. పైగా తమని తాము రుజువు చేసుకునే భారాన్ని కూడా వారిపైనే మోపారు. మొత్తంగా ఈ అభ్యంతరకరమైన, హేయమైన వ్యవహారం, అపారమైన రీతిలో ఆర్థిక నష్టాలే కాకుండా అసౌకర్యం, మానసిక వేదన, చివరకు మరణాలకు కూడా దారి తీసిందని బేబీ ఆందోళన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్‌ కూడా అంగీకరించినట్లుగా న్యాయ నిర్ణయ పరిష్కార యంత్రాంగాలు నిరంతరంగా పని చేయకపోవడం వల్ల వారికి ఎలాంటి అర్ధవంతమైన పరిష్కారం లభించకుండా పోయిందని అన్నారు. మొత్తంగా ఈ ప్రక్రియలో నెలకొన్న అస్పష్టత కూడా అంతే ఆందోళనకరమైన అంశంగా మారిందన్నారు. ఓటర్ల జాబితాలను విశ్లేషించడానికి అనువుగా లేని ఫార్మాట్లలో విడుదల చేయడంతో బహిరంగంగా పరిశీలించడానికి కూడా వీల్లేకుండా పోయింది. స్వతంత్రంగా జరిగిన విశ్లేషణలను బట్టి చూసినట్లైతే, సమాజంలో అట్టడుగు వర్గాలు ముఖ్యంగా ముస్లింలు, మహిళలు, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన వారు మిక్కిలిగా ప్రభావితులయ్యారని తెలుస్తోంది.

ఓటర్ల జాబితా నుంచి ఈ ఓటర్లను తొలగించడమంటే భారత రాజ్యాంగంలోని 326వ అధికరణ కింద హామీ కల్పించబడిన ఓటు హక్కును నిరాకరించడమే అవుతుంది. ఓటు హక్కు అనేది సమానత్వం, గౌరవానికి అత్యంత కీలకమైన మౌలిక ప్రజాస్వామిక హక్కు. అటువంటి ఓటు హక్కును పెద్ద సంఖ్యలో ప్రజలకు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు అందుబాటులో లేకుండా చేయడమనేది రాజ్యాంగ సూత్రాలపై తీవ్రమైన దాడి కాగలదు. పెద్ద ఎత్తున ఓటు హక్కును నిరాకరించడానికి, రాజ్యాంగబద్ధమైన ఓటు వేసే హక్కును తిరస్కరించడానికి దారి తీసిన, భారత ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఈ మినహాయింపు ప్రక్రియ పట్ల సీపీఐ(ఎం) తీవ్ర నిరసనను పునరుద్ఘాటిస్తోంది. ఎంతటి వ్యయ ప్రయాసలకోర్చి అయినా ఓటు వేసే రాజ్యాంగ హక్కుకు ఎన్నికల కమిషన్‌ హామీ కల్పించాల్సిందేనని బేబీ ఆ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -