వేతన ప్యాకేజీని సవరించిన ప్రభుత్వం
తిరువనంతపురం : రేషన్ డీలర్ల వేతన ప్యాకేజీని సవరించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన ప్యాకేజీ కింద గరిష్టంగా మౌలిక వేతనం రూ.18వేల నుండి రూ.21వేలకు పెరిగింది. అదనపు కమిషన్ రేటు కూడా క్వింటాల్‌కు రూ.180 నుండి రూ.270కి పెరిగింది. నెలవారీ 15క్వింటాళ్ళ వరకు పంపిణీ చేసే రేషన్ డీలర్లు కమిషన్ కింద రూ.6800 అందుకుంటారు. 15క్వింటాళ్ళు పైబడి పంపిణీ చేస్తే 45క్వింటాళ్ల వరకు మౌలిక కమిషన్ రూ.9వేలు చెల్లిస్తారు. దీంతో పాటూ రొటీన్‌గా ఇచ్చే క్వింటాల్‌కు రూ.270 కూడా ఇస్తారు. ఒకవేళ ఈ పంపిణీ 45క్వింటాళ్ళు దాటితే మౌలిక కమిషన్ రూ.21వేలు వుంటుంది. దానితో పాటూ 45క్వింటాళ్ళ పైబడిన మొత్తాలకు మాత్రం క్వింటాల్‌కు రూ.200 చెల్లిస్తారు.
జనవరి 1 నుండి ఈ సవరించిన వేతన ప్యాకేజీ అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆహార,పౌర సరఫరాల మంత్రి జి.ఆర్.అనీల్ తెలిపారు. మంగళవారం రేషన్‌డీలర్ల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వేతనం, కమిషన్లను పెంచాలన్నది డీలర్ల సుదీర్ఘకాల డిమాండ్‌గా వుంది. కమిషన్ వ్యవస్థను సవరించడంపై, మౌలిక వేతనాలు, ప్రోత్సాహకాలను పెంచడంపై సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రేషన్ డీలర్ల సంఘాలు స్వాగతించాయి. ఫిబ్రవరిలో నిర్వహంచదలపెట్టిన సంయుక్త ఆందోళనను ఉపసంహరించినట్లు ప్రకటించాయి.



