– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
సరస్వతి నది అంతరవాహిని అయిన త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించడం సంతోషకరమని వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం కాళేశ్వరం చేరుకున్న మంత్రి.. త్రివేణి సంగమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి, భూపాలపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కన్‌సింగ్‌తో కలిసి పుష్కర స్నానం చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకున్నట్టు తెలిపారు. సరస్వతి పుష్కరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగాన్ని అభినందిం చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీఓ రవి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆర్జెసి రామకృష్ణారావు పాల్గొన్నారు.
పుష్కరాలు మహాద్భుతం :ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సరస్వతి పుష్కరాలు గోదావరి, ప్రాణహిత, సరస్వతి అంతర్వాహిని మూడు నదుల సంగమం అని.. 12ఏండ్లకోసారి వచ్చే పుష్కరాలు కాళేశ్వరంలో అద్భుతంగా జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సరస్వతి పుష్కరాల్లో భాగంగా శనివారం ఉదయం సరస్వతి ఘాట్‌లో సోదరుడు మల్లు ప్రసాద్‌తో కలిసి పెద్దలకు పిండిపదానం నిర్వహించారు. అనంతరం సరస్వతి పుష్కర ఘాట్‌లో స్నానమాచరించి కాళేశ్వర శివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంతోపాటు మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు మక్కన్‌సింగ్, గండ్ర సత్యనారాయణ ఉన్నారు.
వర్షానికి కూలిన టెంట్లు..
కాళేశ్వరంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షంలో టెంట్లు కూలిపోయాయి. దీనిపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ స్వయంగా పర్యవేక్షించారు. రాత్రి నుంచి ఇద్దరూ సరస్వతి ఘాట్, టెంట్ సిటీ, స్టాల్స్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. వర్షం కారణంగా విద్యుత్తులో తాత్కాలిక అంతరాయం ఏర్పడటంతో వెంటనే విద్యుత్ శాఖ అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలు అందిస్తున్నాయి.
