నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి విడతలో పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు.. అలాగే ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేవారికి కూడా డబ్బుల్ని ఇవ్వలేదు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం తొలి విడతలో డబ్బులు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.. ఆ అప్లికేషన్‌లను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది.
అలాగే ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరినవారి లిస్ట్‌ను కూడా రెడీ చేసింది. మంగళ, ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లులకు డబ్బులు విడుదల చేస్తారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సీబీఎస్‌ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల 10న తల్లికి వందనం నగదు జమ చేయనుంది. వివిధ కారణాల వల్ల నగదు అందని వారి దరఖాస్తుల్ని పరిశీలించిన ప్రభుత్వం అర్హత ఉన్నవారికి కూడా డబ్బులు జమ చేయనుంది. మొత్తం 7,99,410 మంది విద్యార్థులకు గాను 7,84,874 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున జమ చేస్తారు. మొదటి విడతలో కొందరు అర్హులైనప్పటికీ డబ్బులు రాలేదు.. వారు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు వారి సమస్యలను పరిష్కరించారు. అర్హులుగా తేలిన 1.34 లక్షల మందికి కూడా ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారు.
స్కూళ్లకు సంబంధించి అర్హులైన తల్లుల జాబితాలను నేరుగా టీచర్ల లీప్ యాప్‌లో పొందుపరుస్తారు. వీరందరికి ఈ నెల 10న అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేస్తారు. అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వ వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/ అందుబాటులో ఉంచింది.. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ApplicationStatusCheckP క్లిక్ చేయాలి.. అప్పుడు ఏ పథకమో (తల్లికి వందనం) సెలక్ట్ చేసుకోవాలి. ‘ ఆ పక్కనే ఉన్న 2025-26ను సెలక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే.. పథకానికి సంబంధించి లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది.. దానిని ఆ కాలమ్‌లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు’ అంటున్నారు.