ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు రెండో దశ కస్టోడియల్ విచారణను సిట్ అధికారులు శనివారం మొదలు పెట్టారు. ఈనెల 20-26వరకు ప్రభాకర్‌రావును కస్టడీలో ఉంచుకొని విచారణ జరపడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిట్‌కు అనుమతి నిచ్చిన విషయం తెలిసిందే. అంతకముందు వారం పాటు తమ కస్టడీలో ప్రభాకర్‌రావును ఉంచుకొని విచారించిన సిట్ అధికారులు.. ఆ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తూ తమకు ప్రభాకర్‌రావు ఏ మాత్రమూ విచారణకు సహకరించలేదని తెలపడంతో మరో వారం పాటు విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. ఈ నేపథ్యంలో పాత సిట్ స్థానంలో నగర పోలీస్ కమిషనర్ వి.సి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పడిన కొత్త సిట్ బృందం ప్రభాకర్ రావు విచారణను ప్రారంభించింది. జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో ప్రభాకర్‌రావును ఒక ప్రత్యేక గదిలో ఉంచి అధికారులు తొలిరోజు విచారించారు.
కొత్త సిట్ బృందంలో ఉన్న మాదాపూర్ డీసీపీ రితురాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ్‌రెడ్డి, రామగుండం కమిషనర్ అంబర్‌కిషోర్ ఝాలు ఈ విచారణలో పాల్గొన్నారు. వీరు ఇప్పటి వరకు పాత సిట్ అధికారులు సాగించిన విచారణాంశాలను క్షుణ్ణంగా పరిశీలించారని తెలిసింది. మరోవైపు ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తూ ఫోన్‌ట్యాపింగ్‌ను నడిపించిన వ్యవహారంపై తనకు తెలిసిన ప్రతీ విషయాన్నీ బయటపెట్టాలనీ, తెలిసినా తెలియనట్టు నటించి నిజాలను దాచి పెట్టడం వల్ల ప్రయోజనం లేదని ప్రభాకర్‌రావుకు అధికారులు ముక్కుసూటిగా స్పష్టం చేసినట్టు తెలిసింది. అనంతరం ఈ కేసులో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, అరెస్టయిన నిందితులు ఇచ్చిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆదివారం నుంచి అధికారులు దర్యాప్తును తీవ్రతరం చేయనున్నట్టు సమాచారం. మరోవైపు సిట్ అధిపతి అయిన నగర పోలీసు కమిషనర్ వి.సి సజ్జనార్ సైతం ఈ కేసు పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
ప్రభాకర్‌రావు రెండో దశ కస్టోడియల్ విచారణ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



