పోలింగ్‌కు సర్వం సిద్ధం
3,911 గ్రామాలు, 29,917 వార్డుల్లో ఎన్నికలు
3,769 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్.. రూరల్ ఏరియాల్లో వీడియోగ్రఫీ
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు
రూ.8,59,39,828 నగదు సీజ్..33,262 మంది బైండోవర్
తెలంగాణ ఎన్నికల సంఘం వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో నేడు రెండో విడత పోరు జరగనుంది. 193 మండలాల్లోని 3,911 పంచాయతీల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్టు ఎన్నికల సంఘం శనివారమొక ప్రకటనలో తెలిపింది. సర్పంచ్ స్థానాలకు 12,782 మంది, వార్డు స్థానాలకు 71,071 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు.
సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామనీ, వీలు కాకుంటే సోమవారం పూర్తి చేయనున్నారు. ఇప్పటికే అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్ల నియామకం జరిగింది. 99 శాతం ఓటర్ స్లిప్ల్‌ల పంపిణీ, సిబ్బందికి శిక్షణ పూర్తి అయ్యినట్టు పేర్కొంది. 31 జిల్లాల్లో 38,337 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 57,22,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 27,96,006 మంది పురుష ఓటర్లు, 29,26,306 మంది మహిళా ఓటర్లు, 153 మంది ఇతరులు ఉన్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 4,593 మంది రిటర్నింగ్ అధికారులను, 30,661 మంది ఇతర సిబ్బందిని నియమించారు. మూడు విడతలకు కలిపి మొత్తం 2,489 మైక్రో అబ్జర్వర్లను నియమించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
ఓటు వేసే వారు తమ ఎలక్షన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర 18 రకాల ఐడీ కార్డులను అనుమతించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో 3,769 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. దీన్ని సెంట్రలైజ్డ్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు లాగిన్ పాస్వర్డ్ ఇచ్చింది. ఏఏ పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుందో వీరు తమ లాగిన్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షించే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా పొలింగ్, ఇబ్బందులు, ఇతర శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు తక్షణమే స్పందిచి తగు చర్యలు తీసుకుంటారు. నెట్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో లోకల్ వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఫిర్యాదుల కోసం 92400212456 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఓటర్లందరూ పోలింగ్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.
8.59 కోట్ల నగదు స్వాధీనం
గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలైనప్పటినుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,59,39,858 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. రూ.2.28,27,539 విలువైన మత్తు పదార్థాలు, రూ.3,46,95,639 విలువైన మద్యం సీజ్ చేశామని పేర్కొంది. 12,15,500 విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.69,16,560 విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు 3,675 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామనీ, 33,265 మందిని బైండోవర్ చేసినట్టు పేర్కొన్నారు.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎన్నికల సంఘం వివరించింది.




