చూపులతో మంత్రం వేసి మనసులో మాయ చేసిన అమ్మాయి కళ్ళముందుకొచ్చి, తన పక్కన చోటిస్తే అబ్బాయికి ఇక హద్దు ఉండదు. ఊహల నింగిలో విహరిస్తూ ఉంటాడు. తన ఆనందాన్ని పాటగా పాడుతుంటాడు. అదే ఈ పాట..2024 సం.లో సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో వచ్చిన రాచరికం సినిమాలో వెంగి రాసిన ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
అమ్మాయి చూపులతో మంత్రం వేసింది. ఆ మంత్రబలం వల్ల అబ్బాయి కదలకుండా ఉండిపోయాడు. ఆమె చూపుల్లోని వశీకరణశక్తి సోకి అతడు ఆమె వెంటే తిరగడం మొదలుపెట్టాడు. అతడు అంతలా తన వెంట తిరగడం చూసి ఆమె చిరునవ్వు నవ్వి అతన్ని స్వీకరిస్తుంది. అతని ప్రేమను అంగీకరిస్తుంది. అతడు ఆమెను పొగడుతూ ఓ పాట పాడుతుంటాడు. అదే ఈ పాట..
ఎప్పటికీ మాయని మాయను మంత్రంగా వేశావు. నా హృదయాన్నే యంత్రం చేశావు అని అంటాడు ఆ అబ్బాయి. ఎందుకంటే.. అతని మనసు ఓ యంత్రంలా ఆమె గురించే ఆలోచిస్తుంది. ఆమె చుట్టే తిరుగుతుంది. కాబట్టి తన హృదయాన్ని యంత్రంగా మార్చిందని అంటాడు. ఆమె దానికి సమాధానం చెప్పదు. చూపులతోనే కవ్విస్తుంటుంది. అతని వింత ప్రశ్నలకి, వింత మాటలకి ఆమె చూపులతోనే సమాధానమిస్తుంటుంది. కాని ఆమె చూపుల్లో వింత వింత భావాలు తొంగి చూస్తాయి. నిఘంటువులకు అందని వింత అర్థాలు ఆమె చూపుల్లో కనబడతాయి. అంత లోతు ఉంది ఆ చూపుల్లో.. ఇదీ ఇక్కడి వరస..
ఆమె చూపులతో మంత్రం మాత్రమే వేయలేదు. ఎప్పటికీ మానని గాయం కూడా చేసిందట. మరి మానని గాయం చేసిన ఆమెని ఆ అబ్బాయి ఎందుకు అంతలా ఆరాధిస్తున్నాడు.. అంటే.. ఆ గాయం తీయనిది. ప్రేమగాయం.. అని ఇక్కడ అర్థం. ఆ తీయని గాయం చేసినందుకే అతడు ఆమెను అంతలా ఆరాధిస్తున్నాడని స్పష్టమవుతుంది. మానని గాయం చేసి, మదినే మౌనం చేసిందామె. మనసును మాట్లాడనీయకుండా అలా నిశ్శబ్దంగా ఉండేలా చేసిందన్న విషయం కూడా ఇక్కడ తెలుస్తుంది.
ఆమె కన్నులు తెరిచిన పరువాలని.. అంటే వయసు అందాలని తన ముందు పోసిందట. మనసులోని చలి విరహాలన్నింటిని చెరిపేసిందట. ఎందుకంటే ఆమె తనకు దగ్గరైపోయింది కాబట్టి. చెలి దూరంగా ఉన్నప్పుడే విరహం. దగ్గరగా ఉంటే ప్రణయమే కదా. అయితే.. మనసులో చలి విరహం ఉందట. చలి ఎందుకు ఉందంటే.. ఆమె దగ్గర లేదు కాబట్టి చలిగా ఉంది. ఆమె చేరువయ్యాక వెచ్చదనమే అంతా.. అని అర్థమవుతుంది. ఆమె మనసును మౌనం చేసినప్పటికి కూడా మనసులోని చలి విరహాలన్నీ చెరిపివేసి చెప్పలేనంత సంతోషాన్ని అతనికి అందించింది.
ఆమె నడుస్తూనే ఉంది. ఆమెతో అతని ప్రయాణం సాగుతూనే ఉంది. వాలిపోయే పొద్దుల వైనాన్ని గుర్తిస్తున్నాడు అబ్బాయి. మళ్ళీ తొలిపొద్దు రాగానే ఆమె కోసం అతని పయనం సాగుతుంటుంది. ఆమె మౌనంగానే ఉంటుంది. అతడితో నడుస్తూ ఉన్నా ఆమె మౌనంగానే సాగుతోంది. ఆమె మాటలు బయటికి చెప్పదు. లోలోపల ప్రేమను దాచుకున్నట్టే మాటల్ని దాచుకుంది. గాలిలోన దాగిన గానంలాగా, పువ్వులోన దాగిన ప్రాణంలాగా ఆమెను చూసుకుంటున్నాడు ఆ అబ్బాయి. ప్రేమతనాన్ని ఆమెలో నిండుగా దర్శించుకుంటున్నాడు.
గుండెల్లో తీయని గాయంగా, అర్థం కాని ఓ గేయంగా భావిస్తున్నాడు. ఆమెలోని అందమైన ఆడతనాన్ని మనసుతో చూస్తున్నాడు ఆ అబ్బాయి. ఆమె చేసిన మాయల వల్ల తాను ఎలా మారిపోయాడో ఈకింది పంక్తుల్లో వివరంగా చెబుతున్నాడు.
పెదవులు కదిలించకుండా అతడు కవితలు చదువుతున్నాడట. పెదవులు కదలకుండా కవితలు చదవడం సాధ్యం కాదు కదా. మరి అలా చదువుతున్నాడంటే ఆ మహిమ ఆమెదే. అది ఆమె చూపులు చేసిన గారడే. ఆమె అడుగులు అతని కంటికి కనిపించడం లేదు. కాని ఆమె నడుస్తూనే ఉంది. నడకలనదిగా ఆమె ప్రవాహశీలత గల గమనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడతడు. గురువారంగా, శనివారంగా ఆమెను చూస్తున్నాడు. గురువారం, శనివారం.. అని వారాలపేర్లు ఎందుకు ప్రయోగించాడంటే..ఆమెను ప్రతీ గురువారం, ప్రతీ శనివారం అతడు కలుసుకుంటాడు కాబట్టి. ఆ రోజుల్లో ఆమె కనుచూపుల వరం అతన్ని సోకాలని ఆరాటపడుతుంటాడు కాబట్టి.
ఆమె లేకుంటే అతనికి ఎదభారంగా ఉంటుంది. ఆమె ఊహలతో, ఆమె ఆలోచనలతో నిండిపోయి ఎదబరువెక్కితే ఫర్వాలేదు. కాని ఆమె విరహంతో ఎద బరువెక్కకూడదన్నది ఇక్కడి భావన. ఆమె సుకుమారమైనది. నాజూకుగా నడుస్తూ, నాజూకుగా చూస్తూ ఉందామె. నాజూకుతనాన్ని తనువున, మనసున దాచుకున్నది. అందుకే ఆమెను సుకుమారమా! అని అంటున్నాడు. తనను తాకిన తీయని స్వరంలా, సంగీతంలా భావిస్తున్నాడామెని.
మగువ వెంట్రుకలను తాకిన శ్వాస ఈ భూమి మీద ఆగదు. అది ఆకాశమార్గంలో విహరిస్తూ విహరిస్తూ అలా.. అలా ఎగిరిపోతుంటుంది. అది మగువ కురులకున్న మాహాత్మ్యం..మగువ వెంట్రుకలకే అంత మహిమ ఉంటే, మగువ వెంట్రుకలే ఇంత పని చేస్తే, మరి మగువే స్వయంగా తలచుకుంటే ఇంకెంత మాయ చేస్తుందో, ఇంకెంతగా మంత్రించేస్తుందోనని చెప్పకనే చెప్పాడు కవి.
మగువ చూపులు చేసిన గారడిని గురించి ఈ పాటలో అద్భుతంగా చెప్పాడు వెంగి. ఆమె ఏమి మాట్లాడకుండా చూపులతోనే రేపిన వింత అలజడిని గురించి, ఆ అబ్బాయికి అమ్మాయి వల్ల కలిగిన ప్రేమమైకం గురించి ఈ పాట తెలియజేస్తుంది.
పాట:
ఏం మాయని మాయని మాయని మంత్రం వేశావే ఎదనే యంత్రం చేశావే/
ఓ మానని మానని మానని గాయం చేశావే/
మదినే మౌనం చేశావే/
కనులు తెరిచిన పరువాలన్నీ ఎదుటపోసావే మనసులో చలి విరహాలన్నీ చెరిపివేసావే/
పయనమా పయనమా వాలే పొద్దుల వైనమా/
మౌనమా మౌనమా మాటే చెప్పని మౌనమా/
గాలిలోని గానమా పువ్వులోని
ప్రాణమా ప్రేమతనమా/
గుండెల్లోని గాయమా
అర్థం కానీ గేయమా ఆడతనమా/
పెదవులే కదిలించక కవితలు చదివా/
అడుగులే అగుపించని నడకల నదివా/
గురువారమా శనివారమా
కనుచూపుల వరమా/
ఎదభారమా సుకుమారమా
నన్ను తాకిన స్వరమా/
మగువ కురులను తాకిన
శ్వాస భువిన ఉండదులే/
గగన మార్గములో అడుగేసి ఎగిరిపోవుద్దే..
- డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682