కుటుంబ వ్యవస్థలోనే అన్నాచెల్లెళ్ళ బంధం విశిష్టమైనది. అనురాగానికి, ఆప్యాయతలకి ఆనవాలుగా అన్నాచెల్లెళ్ళ బంధం విరాజిల్లుతుంది. అన్నా చెల్లెళ్ళ బంధం గురించి వివరిస్తూ ఎన్నో సినిమా పాటలు వచ్చాయి. వాటిల్లో ఇది ఒకటి. చెల్లెలికి తోడుగా, నీడగా నిలిచి, తల్లిదండ్రుల బాధ్యతను కూడా తానే మోస్తూ ఓ అన్న పాడే పాట ఇది. 1995 లో డా. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఒరేరు రిక్షా’ సినిమాలో ప్రజాకవి గద్దర్ రాసిన ఆ పాటనిపుడు చూద్దాం.
ప్రజాకవి గద్దర్ పేరు తలచుకుంటే చాలు పాటల సముద్రాలు పొంగులెత్తుతాయి. ఉవ్వెత్తున జనసంద్రం ఉరకలెత్తుతుంది. ఆ ప్రజా యుద్ధనౌక సినీరంగంలో ప్రవేశించి అద్భుతమైన అభ్యుదయ గీతాలు, అనుబంధగీతాలు రాశాడు. అలాంటి వాటిల్లో ఈ పాట ఒకటి. గద్దర్ పేరు తలచుకోగానే చాలామందికి ఈ పాటే గుర్తుకు వస్తుంది. అలతి అలతి పదాల్లో అనురాగం విలువను చాటి చెప్పాడీపాటలో..
సినిమాకథ పరంగా చూస్తే.. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు ఒకరికొకరంటూ తోడుగా నీడగా పెరిగారు. అన్నే తల్లి, తండ్రి అయ్యి పెంచాడు. ఏ లోటు రానీయకుండా అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. తన చెల్లెలి మీద ఉన్న ప్రేమానురాగాలను తెలియజేస్తూ ఓ సందర్భంలో ఈ పాట పాడతాడు. ఇదీ సినిమా సన్నివేశం..
మల్లెతీగకు పందిరి తోడుగా ఉంటుంది. అలా నీకు నేను తోడుగా ఉంటాను. అండగా ఉంటాను. నువు ఎదగడానికి, ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి బాసటగా నిలుస్తాను అంటూ అన్న తన చెల్లెలితో అంటున్నాడు. మసక చీకటిలో నీకు వెన్నెలలాగా వెలుగునిస్తాను. అంటే.. కష్టాలు అనే చీకట్లు దాపురించినపుడు నేను నీకు వెన్నెల వెలుగులు అందిస్తాను. నీ పాదం మీద పుట్టుమచ్చను నేను.. తోడబుట్టిన రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. అని చెల్లెలికి చెబుతూ తన అనురాగాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
తమ ఇంటికి చుట్టు పక్కల ఉన్నవాళ్ళకి కూడా ఈ అన్నాచెల్లెళ్ళ ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. అన్నకి చెల్లెలంటే, చెల్లెలికి అన్న అంటే ఎంత మమకారమో తెలుసు. అయినా.. అప్పుడప్పుడు ఇద్దరినీ ఆటపట్టిస్తుంటారు. సరదాగా అల్లరిచేస్తుంటారు.
నేటి సమాజంలో ఆడపిల్ల జీవితం ఎంత దుర్భరంగా ఉందో కూడా ఈ పాటలో ప్రస్తావించబడింది. ఆ విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళు ఇలా తెలియజేస్తారు. ముళ్ళతీగమీద చీరవేస్తే తిరిగి రాదు.. అది చిరిగిపోతుంది. అలాగే ఆడపిల్ల కూడా కంటిరెప్పను విప్పుకుని స్వేచ్ఛగా చూస్తే కూడా సమాజం తప్పు పడుతుంది. అని అంటారు.
వెంటనే.. ఆ అన్న అవేమీ పట్టించుకోవద్దన్నట్టుగా తన చెల్లెలికి చెబుతాడు. అయినా.. వాళ్ళు చెప్పిన విషయంలో ఉన్న అంతరార్ధాన్ని తరువాతి పంక్తుల్లో ఇలా అంతర్లీనంగా చెబుతాడు. పెద్దమనిషి అయింది మొదలు ఆడపిల్లకు ఎన్నో ఆంక్షలు పెడతారు. ఎక్కడికీ వెళ్ళనీయరు. ఏమీ చూడనీయరు. స్వేచ్ఛగా తిరగనివ్వరు. చూసే దానిని చూడొద్దంటారు. నవ్వాల్సిన చోట నవ్వకూడదంటారు. అలాంటి అన్నను కాను నేను.. నీ చిన్నప్పటి స్నేహితుడిని. నీకు ఏం కావాలాన్న నన్ను అడుగు. ఒక స్నేహితుడిలా నన్ను భావించు అంటూ పుర్తి స్వేచ్ఛను కల్పిస్తాడు. అడవిలో నెమలిలాగా ఆటలాడుకో. పాటలు పాడుకో. నీకు నచ్చినట్టుగా ఉండు అని అంటాడు.
అపుడు చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ కలుగజేసుకుని ఆడపిల్ల అంటేనే అగ్గిపుల్ల.. ఎవరి కంటపడినా మండిపోతుంది. ఆడపిల్లంటేనే ఇంటికి భారం. కన్నవాళ్ళకి రోకలిపోటు అని అంటారు. అపుడు ఆ అన్న అవేమీ పట్టించుకోకుండా.. నువు చిన్నబోయి కూచుంటే నా వెన్నుపూస ఇరిగినట్టైపోతుంది. ఒక్క క్షణం నువు కనబడకపోతే చాలు నా రెండు కనుపాపలు కమిలిపోతాయి. నువ్వు ఒక్క గడియ మాట్లాడకపోతే దిక్కులేని పక్షినైపోతాను నేను, అనాధనైపోతాను అంటాడు. నువు అన్నం తినకపోతే నా భుజం ఇరిగినంత పనైపోతుందని అంటాడు ఆ అన్న.
అపుడు చుట్టుపక్కల వాళ్ళు.. ఆడపిల్ల బడికివెళ్ళి భుజంతొక్కే చదువు చదివేదెందుకు? కట్నకానుకలిచ్చి చచ్చేటందుకు.. అని బాధగా, వ్యంగ్యంగా అంటుంటారు. ఆ మాటలు వినక.. ఆ అన్న నువు ఎంత చదువుతాననుకుంటే అంత చదివిస్తా. నువు ఎన్ని శిఖరాలకు ఎదగాలనుకుంటావో.. ఎదుగు. నేను చూసుకుంటా. నీకు పెళ్ళి వయసు వచ్చేనాటికి ఎంతో కొంత కూడబెడతా. నీకు నచ్చినోడికే ఇచ్చి పెళ్ళిచేస్తానంటాడు. అంతేకాని.. డాక్టరుకో, లాయరుకో, ఇంజనీరుకో చేస్తానని అనడు. ఎందుకంటే.. తన చెల్లికి నచ్చినోడు.. తన చెల్లి మనసు గెలుచుకున్నోడు కావాలి కాని.. ఏ డాక్టరైతే ఏమి? ఏ కోటిశ్వరుడైతే ఏమి? అని అన్న అభిప్రాయం. తన చెల్లి ఇష్టమే తన ఇష్టంగా భావించే అన్నగా అతను నిలబడి వున్నాడని ఇక్కడ స్పష్టం అవుతోంది. తన కన్నీళ్ళతో తన బావ కాళ్ళు కడిగి, తన చెల్లిని అత్తగారింటికి సాగనంపుతానని అంటాడు.
చెల్లెలే ప్రాణంగా, సర్వస్వంగా బతికే అన్న మనసు ఈ పాటలో కనబడుతోంది. అన్న ప్రేమనే జీవితంగా బతికే చెల్లిగా కూడా ఆమె మసలుకుంటుంది. ఆర్.నారాయణమూర్తి నటన, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం, గానం ఈ సినిమాకి, ఈ పాటకి వన్నె తెచ్చాయి.
పాట:
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె/ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా/ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా/ ముళ్ళతీగమ్మా కంచేమీద చీరవేస్తే రానే రాదమ్మా/ ఆడపిల్లమ్మా రెప్ప రెప్ప విప్పుకుంటూ చూస్తే తప్పమ్మా/ పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో/చూసే దానిని చూడొద్దంటరు/ నవ్వేచోట నవ్వొద్దంటరు అటువంటి నే అన్ననుగాను చెల్లెమ్మా/ నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా/ అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా/ ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా/ ఆడపిల్లంటే అగ్గిపుల్లమ్మా ఓయమ్మా ఎవరికంటపడ్డ మండిపోవునమ్మా/ ఆడపిల్లంటే ఇంటికి భారం ఓయమ్మా కన్నవాళ్ళకే రోకలిపోటమ్మా/ సిన్నబోయి నువు కూసున్నవంటే/ ఎన్నుపూస నాదిరిగేనమ్మా/ ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి/ ఒక్క గడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా/ నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా /బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా/ నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా/ ఇల్లువాకిలి వదిలిపెట్టి ఆడపిల్ల బడికివెళ్ళి భుజం తొక్కే సదువు సదివేదెందుకు/ ఆ కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు/ చదివినంత నిన్ను చదివిస్తనమ్మా/ ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా/ నీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా/ నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా/ నా కన్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా/ రిక్షాబండినే మేనా గడతా చెల్లెమ్మా/ మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682