– ఈ నెల 8 నుంచి 46 లక్షల మంది మహిళకు స్క్రీనింగ్
– టీ డయాగస్టిక్స్ ద్వారా ఒక్కొక్కరికీ 30 రకాల పరీక్షలు
– నాలుగు దశల్లో ఆరోగ్యశాఖ కార్యక్రమాలు : వైద్యారోగ్యశాఖపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వయం సహాక సంఘాల మహిళల హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించే కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష చేశారు. అందులో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదరు కుమార్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజరుకుమార్, డీహెచ్ రవిందర్ నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
99 రోజుల యాక్షన్ ప్లాన్ ఇలా…
ఈ నెల ఆరో తేదీ నుంచి జూన్ 12 వరకూ నాలుగు దశల్లో 99 రోజులపాటు చేపట్టనున్న కార్యక్రమాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు. అధికారులు రూపొందించిన ప్రణాళికను స్వల్ప మార్పులతో ఆమోదించారు. తొలి దశలో మార్చి ఆరో తేదీ నుంచి 31వ తేదీ వరకు 26 రోజుల పాటు మాతా శిశు సంరక్షణ, కౌమార దశ బాలికలు, వృద్ధుల ఆరోగ్య సేవలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, ఆస్తుల వెరిఫికేషన్ వంటి పరిపాలనా పరమైన అంశాలను చక్కదిద్దడంతో పాటు.. క్షేత్రస్థాయిలో రక్తహీనత నివారణ, పాఠశాలలు, అంగన్‌వాడీల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారని తెలిపారు. మార్చి 8 నుంచి మూడు దశల్లో రాష్ట్రంలోని 46 లక్షల మంది మహిళలకు తెలంగాణ డయాగస్టిక్స్ సహకారంతో ఒక్కొక్కరికి 30 రకాల పరీక్షలు చేస్తారని వివరించారు. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి ఐదు మండలాల్లో, రెండో దశలో మరో 10 మండలాల్లో, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో స్క్రీనింగ్ చేపట్టనున్నట్టు తెలిపారు. మొత్తం స్క్రీనింగ్‌ను ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రెండో దశలో(ఏప్రిల్ 1 నుంచి 15 వరకు) అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వాటిని గుర్తించేందుకు సబ్ సెంటర్ల పరిధిలో విస్తృతమైన స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తారని చెప్పారు. జిల్లా డే కేర్ కేన్సర్ సెంటర్లలో కీమోథెరపీ సేవలను మ్యాపింగ్ చేయడంతో పాటు డయాలసిస్ రోగులకు వైరల్ ఇన్ఫెక్షన్ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు సాగే మూడో దశలో అంటువ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య సన్నద్ధతపై దృష్టిసారించాలని సూచించారు. టీబీముక్త్ భారత్ లక్ష్యంగా టీబీ కేసులను గుర్తించడంతో పాటు ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వడదెబ్బ, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలనీ, అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మే 16 నుంచి జూన్ 12 వరకు నాలుగో దశలో పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తరించనున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మేడ్చల్ పరిధిలోని 145 అర్బన్ పీహెచ్‌సీలను పాలిక్లినిక్స్‌గా అప్‌గ్రేడ్ చేసి, స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని మంత్రి సూచించారు. బస్తీల్లో మొబైల్ వెహికిల్స్ ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్యం చేరువ చేయాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ మేళాలు నిర్వహించి ప్రజల్లో కల్తీ ఆహారంపై చైతన్యం తీసుకురావాలని మంత్రి సూచించారు.
మహిళల హెల్త్ ప్రొఫైల్‌కు రంగం సిద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



