-రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులు గాజుల భగవాన్ నేత
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
చేనేత కార్మికులపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 15 శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులు గాజుల భగవాన్ నేత అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని పద్మశాలి కాలనీలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సీనియర్ చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పింది చేనేత రంగం అన్నారు. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద జీవనోపాధి కల్పిస్తున్న రంగం చేనేత రంగమని చేనేత రంగం కళాత్మకమైనది కుట్టు లేని జాతీయ జెండాను కుర్తాను మరియు అగ్గిపెట్టెలు సైతం చేనేత కార్మికులు తయారు చేశారన్నారు.
ఇటీవల ప్రభుత్వం చేనేత రుణాలను మాఫీ చేసిందని అదే విధంగా ఆరోగ్య బీమా పథకాన్ని అమలుపరచడానికి కృషి చేస్తున్న సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మార్కెట్ చేయడానికి అర్హులైన వారికి ఉచితంగా మోపెడ్ వాహనాలను ఇప్పించాలని కోరారు. చేనేత కార్మికులకు జకట్ మిషన్లు ఆధునిక చేనేత మగ్గాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు దూడం నాగభూషణం, రాష్ట్ర సలహాదారులు చింతకింది శ్రీనివాస్, చేనేత సహకార సంఘం అధ్యక్షులు సభని వెంకటేశం ,చింతకింది రాజమల్లు, మల్లేశం, శ్రీహరి, రాములు, సుదర్శనం, దుర్గయ్య నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.