రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మకాలు
మత్తులో చిత్తవుతున్న యువత
ఎక్సైజ్ అధికారులపైనా దాడులు
పెట్రేగుతున్న అఘాయిత్యాలు
మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రం గంజాయి గబ్బుకొడుతోంది. ఆ మత్తు యువతను చిత్తుచేస్తుంది. అరికట్టాల్సిన ప్రభుత్వం చేష్టలుడిని చోద్యం చూస్తుంది. మత్తు పదార్థాలను అరికట్టేందుకు రకరకాల పేర్లతో విభాగాలను ఏర్పాటు చేసినా, గంజాయి మొక్కలు వివిధ రూపాల్లో విచ్చలవిడిగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తూనే ఉన్నాయి. గంజాయి బ్యాచ్‌లపైకి దాడులు చేసేందుకు స్వయంగా ఎక్సైజ్ అధికారులు కూడా వెనుకంజ వేస్తున్నారంటే వారి అరాచకాలు ఏ మేరకు పెచ్చరిల్లాయో అర్థమవుతోంది. ‘ఈగల్’ విభాగం ప్రధానంగా నార్కొటిక్ డ్రగ్స్‌పైనే దృష్టికేంద్రీకరించింది. అలాగని అవి రాష్ట్రంలోకి రావట్లేదనుకుంటే పొరపాటే. హైదరాబాద్‌లోని ఏ పబ్, ఫాంహౌజ్‌పై దాడులు చేసినా, విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, విదేశీమద్యం పట్టుబడుతూనే ఉన్నాయి. డ్రగ్స్, గంజాయి విషయంలోనే కాదు…శాంతిభద్రతల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థ ఎంత నిద్రాణంలో ఉందో ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
గంజాయి తాగిన యువకులు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. హఠాత్తుగా నడిరోడ్లపైకి పరిగెత్తుతూ, వాహనదారుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రశ్నిస్తే, మత్తులో కార్ల బారునెట్‌లపైకి ఎక్కి ‘చంపేస్తాం’ అని బెదిరిస్తున్నారు. అసలు వారికి పోలీసులు, ఎక్సైజ్, ఈగల్ వంటి శాఖల భయం ఏకోశానా లేదు. దాడులు చేసి పట్టుకుంటే ‘ఐతే ఏంటి?’ అనే ఎదురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎక్కడో మారుమూల నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి తాగేవారు. ఇప్పుడు నడిరోడ్లపైనే గంజాయి పీలుస్తూ విచ్చలవిడిగా ప్రవరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అనేక పాన్‌షాపుల్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం ఎక్సైజ్, ఈగల్ శాఖల అధికారులకు తెలుసు. కొన్ని మెట్రోస్టేషన్ల కింది పాన్‌షాపుల్లో గంజాయి చాక్లెట్ల ను మామూలు పిప్పర్‌మెంట్ల తరహాలోనే అమ్మేస్తు న్నారు. ఒకప్పుడు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు గంజాయి బ్యాచ్‌లకు అడ్డాలుగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే కొత్త బ్యాచ్‌లు ఏర్పడుతున్నాయి.
నిజామాబాద్‌లో దారుణం
తాజాగా నిజామాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గ్యాంగ్‌ను పట్టుకొనేందుకు ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి అడ్డగిస్తే, మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై నుంచి కారును పోనిచ్చి, హత్య చేసేందుకు కూడా గంజాయి స్మగ్లర్లు వెనుకాడలేదంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు ఆమె కిడ్నీ, ప్లీహం తొలగించారు. 48 గంటల దాటితే తప్ప ఆమె పరిస్థితి ఏం చెప్పలేమని వైద్యులు ప్రకటించారు. బాధితురాలిని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పరామర్శించారు. ఇటీవలే మరో ఎక్సైజ్ ఎస్‌ఐపై కూడా గంజాయి బ్యాచ్ ఇదే తరహాలో దాడులకు పాల్పడింది.
ఆయుధాల్లేవు…ఎలా అడ్డుకునేదెలా?
గంజాయి బ్యాచ్‌ల బరితెగింపునకు భయపడి ఎక్సైజ్ పోలీసులు దాడుల్ని ‘మమ’ అనిపిస్తున్నారు. స్మగ్లర్లను అడ్డుకొనేందుకు తమకు కనీసం ఆయుధాలు కూడా లేవనీ, లాఠీలు పట్టుకొని దాడులకు వెళ్తే, స్మగ్లర్లు కత్తులు తీసి తమనే బెదిరిస్తున్నారని వాపోతున్నారు. స్థానిక పోలీసుల సహకారం తీసుకుందామంటే, వాళ్ల శాంతి భద్రతలు, కేసులు, ఇన్వెస్టిగేషన్లతో బిజీగా ఉంటున్నారనీ, దీనివల్ల ఆశించిన ఫలితాలు రావట్లేదని ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులు, యువతే టార్గెట్
గంజాయి విక్రేతలు తాజాగా యువకులు, విద్యార్థులనే టార్గెట్ చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కళాశాలల్నే గంజాయి అడ్డాలుగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కళాశాలలు నిర్మానుష్యంగా ఉండే శివారు ప్రాంతాల్లో ఉండటంతో, ఇక్కడే వారి వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గంజాయి అమ్మకాలకు సిటీలో కొన్ని ప్రాంతాల్లో పర్మినెంటు అడ్రస్‌లు ఉన్నాయి. అడపాదడపా ఎక్సైజ్ పోలీసులు అక్కడ దాడులు చేసి, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందే తప్ప, పూర్తిగా నివారించే చర్యలు కనిపించట్లేదు.
దొరికింది ఇదీ…దారిమళ్ళింది ఎంతో?
2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎక్సైజ్ అధికారుల దాడుల్లో 5,505 కిలోల ఎండు గంజాయి, 1,646 గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకున్నారు. 72.54 కిలోల గంజాయి చాక్లెట్లనూ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారుల దాడుల్లో ఇంత పెద్దమొత్తంలో ‘మత్తు’ పట్టుబడితే, వారి కళ్లుగప్పి ఇంకెంత ‘మాల్’ వినియోగదారులకు చేరిందోననే సందేహాలు సర్వసాధారణం!
తేలని కేసులు
గంజాయి స్మగ్లర్లపై కేసులు పెడితే, వారు బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే పనిచేస్తున్నారు. ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు పడాలంటే కనీసం ఏడు నుంచి పదేండ్లు ఎదురుచూడాల్సి వస్తున్నదని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. అప్పటికి దాడుల్లో వారు స్వాధీనం చేసుకున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాలన్నీ ఆధారాలు లేకుండా నాశనం అయిపోతున్నాయి. దీనితో అనేక సందర్భాల్లో కేసులు వీగిపోయి, నిందితులు నిర్దోషులుగా బయటకు వచ్చేస్తున్నారు. అయితే గంజాయి ముప్పుపై ‘దూల్‌పేట’ తరహాలో ప్రత్యేక డ్రైవ్‌లు, పునరావాసాలు కల్పిస్తే, పరిస్థితుల్లో కొంత మార్పు వస్తుందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ‘మత్తు’ను చిత్తు చేయకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడటం తధ్యం!!



