– ప్రొఫెసర్ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం కుల మతాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక కీలక రోజు. ప్రజలు ఫ్యూడల్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక మార్పు కోసం సుదీర్ఘ కాలం పోరాటం సాగించారు. ఆ పోరాట ఫలితంగానే నిజాం పాలన అంతమొందింది. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది..” అని గుర్తుచేశారు. ”ఆ పోరాటంలో ప్రజలు కుల మతాలకు అతీతంగా ఐక్యంగా నిజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థను వ్యతిరేకించారు. సామాజిక జీవితంలో సమానత్వాన్ని ఆకాంక్షించారు. ఆ పోరాటాల స్పూర్తితో నేడు ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం మనమందరం ఐక్యంగా ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు. ”ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడంతో ముల్కీ ఉద్యమం, 1969 ఉద్యమం, మలిదశ ఉద్యమం వరకు సాగి చివరకు తెలంగాణ రాష్ట్రం సాధించగలిగాం. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చారిత్రక ఆకాంక్ష” అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గోపగాని శంకర్రావు, బైరి రమేష్, పల్లె వినరు, నిజ్జన రమేష్, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES