Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంసమర్ధతకు మారు పేరు కామ్రేడ్‌ వీఎస్‌

సమర్ధతకు మారు పేరు కామ్రేడ్‌ వీఎస్‌

- Advertisement -

పొలిట్‌బ్యూరో నివాళి
న్యూఢిల్లీ :
కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖులు, సీపీఐ(ఎం) అగ్ర నేతల్లో ఒకరైన కామ్రేడ్‌ వి.ఎస్‌.అచ్యుతానందన్‌ మృతికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వి.ఎస్‌గా అందరికీ చిరపరిచితులైన అచ్యుతానందన్‌ సుదీర్ఘకాలంగా అస్వస్థతతో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం 3.20గంటలకు కన్నుమూశారు. ఆయన పొలిట్‌బ్యూరో మాజీ సభ్యులు కూడా. సమర్ధవంతమైన నిర్వాహకుడిగా పేరొందిన అచ్యుతానందన్‌ కేరళలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. అస్పిన్‌వాల్‌ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో కొబ్బరిపీచు కార్మికులందరినీ సంఘటితపరిచిన అచ్యుతానందన్‌ అప్పుడే తొలిసారిగా కేంద్ర కార్మిక సంఘంలో చేరారు.

1940లో, కేవలం 17ఏండ్ల వయస్సులో ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కుట్టనాడ్‌లో భూస్వాముల చేతుల్లో భయంకరమైన దోపిడీకి గురవుతున్న వ్యవసాయ కార్మికుల మధ్య వుంటూ వారితో కలిసి పనిచేసే బాధ్యతలను ఆయనకు కృష్ణ పిళ్ళై అప్పగించారు. ట్రావెన్‌కూర్‌ దివాన్‌కు వ్యతిరేకంగా పున్నప్రా-వాయలార్‌ తిరుగుబాటు సమయంలో వీఎస్‌ అజ్ఞాతంలోకి వెళ్ళాల్సి వచ్చింది. అరెస్టయిన తర్వాత కస్టడీలో ఆయన తీవ్ర వేధింపులను ఎదుర్కొనాల్సి వచ్చింది. 1956లో ఐక్య కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీకి విఎస్‌ ఎన్నికయ్యారు. 1958లో నేషనల్‌ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌)ను ఏర్పాటు చేయడానికి నేషనల్‌ కౌన్సిల్‌ను వీడి బయటకు వచ్చిన 32మంది సభ్యుల్లో అచ్యుతానందన్‌ చివరి వారు. 1980 నుండి 1991 వరకు సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. 1964లో పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1985లో పొలిట్‌బ్యూరో సభ్యులయ్యారు. వృద్దాప్యం కారణంగా 2022లో కేంద్ర కమిటీ నుండి రిలీవ్‌ అయిన అచ్యుతానందన్‌ ఆ తర్వాత కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా వున్నారు. కేరళ అసెంబ్లీకి విఎస్‌ ఏడుసార్లు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా రెండు పర్యాయాలు చేశారు. 2006 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా వున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టపరమైన, పాలనాపరమైన చర్యలు తీసుకున్నారు. పార్టీతో ఆయనకు గల ఎనిమిదన్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధంలో, కేరళలో కమ్యూనిస్టు ఉద్యమం సుస్థిరంగా వృద్ధి చెందిన క్రమాన్ని వీఎస్‌ చూశారు. ఒక ప్రజా వక్తగా, విఎస్‌ నేరుగా ప్రేక్షకులతోనే మాట్లాడడంలో దిట్ట. నిరాడంబ రమైన జీవనశైలికి, సామాజిక న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు పేరొందిన వీఎస్‌ కేరళ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేశారు. ఆయన మృతితో, పార్టీకి, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో పేర్కొంది. వి.ఎస్‌.అచ్యుతానందన్‌ మృతికి సంతాపసూచకంగా పొలిట్‌బ్యూరో అరుణ పతాకాన్ని అవనతం చేసింది. విఎస్‌ భార్య, కుమారుడు, కుమార్తెలకు సానుభూతిని తెలియచేసింది.

ప్రజాసేవకు పునరంకితం
అచ్యుతానందన్‌ మరణం బాధాకరం. ఆయన తన జీవితంలో చాలా సంవత్సరాలు ప్రజాసేవకు, కేరళ పురోగతికి అంకితం చేశారు. మేమిద్దరం మా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పని చేసినప్పుడు జరిగిన సంభా షణలను నాకు గుర్తుకొచ్చాయి. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి.
– భారత ప్రధాని నరేంద్ర మోడీ
అచ్యుతానందన్‌ మృతికి ప్రముఖుల సంతాపం
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ (ఎం) సీనియర్‌ నేత అచ్యుతానందన్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
– అచ్యుతానందన్‌ ప్రజా నాయకులు. జీవితకాలం కమ్యూనిస్టుగానే కొనసాగారు. సూత్రబద్ధమైన రాజకీయాలకు, ప్రజాసేవా స్ఫూర్తికి ఆయన నిదర్శనం.
– తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

– పోరాటాల వారసత్వానికి అచ్యుతానందన్‌ ఒక అద్భుతమైన చిహ్నం. కేరళ చరిత్రలో ఆయన జీవితం ఒక ముఖ్యమైన అధ్యాయం. అచ్యుతానందన్‌ అసాధారణమైన పట్టుదల కలవారు. తన రాజకీయ వైఖరిలో రాజీ పడలేదు. శతాబ్ద కాలపు జీవితంలో ఆయన ప్రజల పక్షానే నిలిచారు. వారి సమస్యలపై గళం విప్పారు. కేరళ ఆధునిక చరిత్రలో ఆయన విడదీయరాని భాగం.
-కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌

– అచ్యుతానందన్‌ ప్రజా ప్రయోజనాల కోసం పోరాడారు. ఆ క్రమంలో ముళ్లు, రాళ్లతో కూడిన బాటలో నడిచారు. అచ్యుతానందన్‌ జీవితం అంత తేలికైన ప్రయాణం కాదు. ఆయన మొదటి అక్షరాలు వీఎస్‌ అనేవి ప్రతిఘటనకు, న్యాయం కోసం పోరాటానికి ప్రతీకలు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా అచ్యుతానందన్‌ కేరళ ప్రజా జీవితంలో గొప్ప వ్యక్తిగా నిలిచారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రకు అచ్యుతానందన్‌ సరికొత్త, అసమానమైన సామాజిక-రాజకీయ కోణాన్ని జోడించారు. తాను సరైనదేనని భావించిన దానిని ఆచరించడంలో ఏ శక్తీ ఆయనను అడ్డుకోలేకపోయింది.
-కేరళ శాసనసభలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌

– అచ్యుతానందన్‌ గొప్ప పరిపాలనా దక్షుడు, ప్రజా సేవకుడు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఆయన అందించిన సేవలు ఎంతో విలువైనవి.- కేరళ పీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసఫ్‌

– కమ్యూనిస్టు రాజకీయాలలో ఆదర్శవాదులుగా నిలిచిన వారిలో అచ్యుతానందన్‌ చిట్టచివరి వారు.- కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రమేష్‌ చెన్నితాలా
– ఆర్‌ఎంపీ నాయకుడు కె.కె రెమా, ముస్లింలీగ్‌ నేత పీకే కన్హలికుట్టి కూడా అచ్యుతానందన్‌ మృతికి సంతాపం తెలిపారు.

– సీపీఐ(ఎం) వ్యవస్థాపక సభ్యులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానూభూతి. నిజాయితీగా, ప్రజాహితం కోసం పని చేసి, ఆదర్శ నేతగా నిలిచిన అచ్యుతానందన్‌ రాజకీయ జీవితాన్ని ఎంతో స్పూర్తిమంతంగా గడిపారు. ప్రజల పక్షాన పోరాడిన ఆయన జీవితం, అనేక తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. ఉజ్వల రాజకీయ జీవితాన్ని గడిపి అచ్యుతానందన్‌ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారు. అచ్యుతానందన్‌ మరణం దేశానికే తీరని లోటు. తుదిశ్వాస వరకు సాధారణ జీవితం గడిపిన అచ్యుతానందన్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి – బీఆర్‌ఎస్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -