మూడోరోజు సిట్ ముందు ప్రభాకర్‌రావు వాంగ్మూలం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తన సీనియర్ల ఆదేశం మేరకే ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు సిట్ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. ఆదివారం మూడోరోజు సిట్ అధికారులు ప్రభాకర్‌రావును జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్‌రావును తమ కస్టడీలోనే ఉంచుకొని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న విషయం విదితమే. ఏడు రోజుల పాటు కస్టడీకి సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.గత ప్రభుత్వ హయాంలో సాగిన ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న సిట్ అధికారులు.. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ నుంచి నిజాలను రాబట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తాము ప్రశ్నించిన నలుగురు పోలీసు అధికారుల నుంచి రాబట్టిన సమాచారంతో పాటు తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని తెలిపిన అనేక మంది బాధితుల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా సిట్ అధికారులు క్రోడీకరించుకొని ప్రశ్నలను రూపొందించుకున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్‌ట్యాపింగ్ చేసే సమయంలో తాము ఎవరెవరి ఫోన్లను తప్పనిసరిగా ట్యాపింగ్ చేయాల్సి ఉందో సీనియర్ అధికారులతో కూడిన స్క్రీనింగ్ కమిటీకి పంపించాల్సి ఉంటుంది.
వారిచ్చిన గ్రీన్ సిగల్ మేరకే ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎస్‌ఐబీ అధికారులు ముందుకు నడిపించడం జరుగుతుంది. అయితే బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నడిచిన ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారమంతా రాజకీయ ప్రేరేపణతోనే జరిగిందనీ, అప్పటి ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల ఆదేశాల మేరకే ప్రభాకర్‌రావు ఫోన్‌ట్యాపింగ్‌లను సాగించారని సిట్ ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని బట్టి అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో రోజు ప్రశ్నలలో ఈ ఫోన్‌ట్యాపింగ్‌ను సాగించడానికి వెనుక ఎవరి హస్తమున్నదనేది తేల్చడానికి సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఉన్న తన సీనియర్ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌లు చేశామనీ, అది కూడా చట్ట వ్యతిరేకుల పైనే ఎక్కువగా దృష్టిని సారించామని ప్రభాకర్‌రావు సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా కొందరు రాజకీయ ప్రముఖుల ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ చేశారనే విషయంలో మాజీ ఐజీ నుంచి నేరుగా సమాధానాలు రాలేదని తెలిసింది. మరికొన్ని ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు కూడా ఆయన ఇచ్చినట్టు సమాచారం. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం ప్రభాకర్‌రావుకు ఆయన నివాసం నుంచే భోజనంతో పాటు ఆయనకు అవసరమైన ట్యాబ్లెట్లు తెప్పించి ఆయనకు ఇస్తున్నారు.



