Thursday, January 8, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ రైతులకు శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం..ఆ కష్టం తీరినట్లే..!

 రైతులకు శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం..ఆ కష్టం తీరినట్లే..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వ్యవసాయ రంగంలో విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రైతుల విద్యుత్ కనెక్షన్ల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘విద్యుత్ అంబులెన్స్’ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ నిర్ణయం రైతులకు వేగంగా సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖలో పెద్దఎత్తున సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు, విద్యుత్ సరఫరా అంతరాయాలు వంటి అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకే విద్యుత్ అంబులెన్స్‌లను తీసుకొచ్చామని చెప్పారు. కరెంట్‌కు సంబంధించిన ఏ సమస్య వచ్చినా రైతులు 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇస్తే, 24 గంటల లోపే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
వారానికి మూడు రోజులు విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ‘ప్రజాబాట’ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని భట్టి తెలిపారు. అధికారులు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ట్రాన్స్‌ఫార్మర్ల కొరతపై ప్రశ్నించగా, అదనపు విద్యుత్ లోడ్ అవసరం ఉన్న రైతులకు మాత్రమే కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేస్తున్నామని భట్టి స్పష్టం చేశారు. అవసరం లేని చోట యథేచ్ఛగా ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడం లేదని చెప్పారు.
పీఎం కుసుమ్ పథకం విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని, తమ ప్రభుత్వం మాత్రం దాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసినట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో వినియోగం కాకుండా మిగిలిపోయిన కోటాను కూడా తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -