Saturday, October 25, 2025
E-PAPER
Homeఆటలువైట్‌వాష్‌ ముప్పు

వైట్‌వాష్‌ ముప్పు

- Advertisement -

3-0తో విజయంపై ఆసీస్‌ గురి
ఊరట విజయం వేటలో భారత్‌
నేడు సిడ్నీలో ఆఖరు వన్డే పోరు
ఉ|| 9 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో…

వన్డే క్రికెట్‌ చరిత్రలో భారత్‌ ఎన్నడూ ఆసీస్‌ చేతిలో వైట్‌వాష్‌ ఓటమి చవిచూడలేదు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ విజయం అనంతరం తొలి సిరీస్‌ ఆడుతున్న భారత్‌.. నేడు సిడ్నీలో వైట్‌వాష్‌ ప్రమాదంలో పడింది. 3-0తో క్లీన్‌స్వీప్‌పై కంగారూలు కన్నేయగా.. భారత్‌ ఆఖరు వన్డేలో ఊరట విజయం సాధించాలని చూస్తున్నారు. నామమాత్రపు వన్డేలో విరాట్‌ కోహ్లిపైనే అభిమానుల ఫోకస్‌ కనిపిస్తోంది.

నవతెలంగాణ-సిడ్నీ : భారత్‌, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ తుది ఘట్టానికి చేరుకుంది. తొలి రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా సాధికారిక విజయాలు సాధించింది. 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ పనరాగమనం కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు కంగారూ గడ్డపై ఈ ఫలితాన్ని ఊహించలేదు. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు సమిష్టిగా విఫలమైన వేళ ద్వితీయ శ్రేణి ఆస్ట్రేలియా జట్టుకు టీమ్‌ ఇండియా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. వైట్‌వాష్‌ ఓటమి ప్రమాదం అంచుల్లో నిలిచిన భారత్‌.. నేడు సిడ్నీలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్‌, ఆస్ట్రేలియా నామమాత్రపు మూడో వన్డే సిడ్నీలో ఉదయం 9 గంటలకు ఆరంభం.

సమిష్టిగా రాణిస్తేనే
భారత బ్యాటర్లు రెండు వన్డేల్లో దారుణంగా విఫలమయ్యారు. రోహిత్‌ శర్మ నుంచి కెప్టెన్సీ అందుకున్న శుభ్‌మన్‌ గిల్‌ వరుసగా 10, 9 పరుగులు చేశాడు. కీలక బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి 0, 0 పరుగులకే డకౌట్‌గా నిష్క్రమించాడు. పవర్‌ప్లేలో వరుస వికెట్లు భారత్‌ను ఒత్తిడికి గురి చేశాయి. ఆడిలైడ్‌లో రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ రాణించినా.. మిడిల్‌ ఆర్డర్‌లో సరైన భాగస్వామ్యాలు నిర్మించలేదు. విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌ వ్యక్తిగతంగా ఒత్తిడిలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు మెరిస్తే టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ కష్టాలకు చెక్‌ పడుతుంది. శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, కెఎల్‌ రాహుల్‌ అంచనాలను అందుకోవాల్సి ఉంది. ఆల్‌రౌండర్లు, బౌలర్ల ఎంపిక విమర్శలకు అవకాశం కల్పిస్తోంది. హర్షిత్‌ రానా, వాషింగ్టన్‌ సుందర్‌లు బెంచ్‌కు పరిమితం కావాలనే వాదన పెరుగుతోంది. కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ నేడు తుది జట్టులోకి వచ్చే వీలుంది. మహ్మద్‌ సిరాజ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది.

బంతితో, బ్యాట్‌తో సమిష్టిగా రాణిస్తేనే నేడు వైట్‌వాష్‌ ప్రమాదం నుంచి భారత్‌ బయటపడగలదు. ఆసీస్‌ జట్టులో సీనియర్లు స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ వన్డేలకు వీడ్కోలు పలికారు. యువ ఆటగాళ్లు మాట్‌ షార్ట్‌, కూపర్‌, మిచ్‌ ఓనెన్‌, మాథ్యూ రెన్షాలు మిడిల్‌ ఆర్డర్‌లో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొత్త ఆటగాళ్లు బాధ్యత తీసుకోవటం ఆతిథ్య జట్టుకు బాగా కలిసొచ్చింది. నామమాత్రపు వన్డేలో మిచెల్‌ స్టార్క్‌, జోశ్‌ హాజిల్‌వుడ్‌కు విశ్రాంతి ఇచ్చే ఆలోచన ఉంది. స్పిన్నర్‌ ఆడం జంపా, పేసర్‌ జేవియర్‌ సహా మిచెల్‌ మార్ష్‌, ట్రావిశ్‌ హెడ్‌లు ఆసీస్‌కు నేడు కీలకం కానున్నారు.

పిచ్‌, వాతావరణం
శనివారం ఆఖరు వన్డేకు సిడ్నీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. సంప్రదాయ సిడ్నీ పిచ్‌పై లభించే టర్న్‌ ఇప్పుడు స్పిన్నర్లకు ఉండబోదు. కానీ పరుగుల పిచ్‌పై స్పిన్నర్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఆసీస్‌ బ్యాటర్లు ఇక్కడ పరుగుల వరద పారించారు. ఇక్కడ ఆడిన చివరి ఆరు వన్డేల్లో ఆతిథ్య జట్టు గెలుపొందింది. నేడు టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌/కుల్‌దీప్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రానా/ప్రసిద్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌.
ఆస్ట్రేలియా : మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), ట్రావిశ్‌ హెడ్‌, మాట్‌ షార్ట్‌, మాథ్యూ రెన్షా, అలెక్స్‌ కేరీ (వికెట్‌ కీపర్‌), కూపర్‌, మిచ్‌ ఓవెన్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, మిచెల్‌ స్టార్క్‌/జాక్‌ ఎడ్వర్డ్స్‌, ఆడం జంపా, నాథన్‌ ఎలిస్‌/జోశ్‌ హాజిల్‌వుడ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -