Thursday, January 8, 2026
E-PAPER
Homeఖమ్మంఊరూరా హత్య చేయబడిన కమ్యూనిస్టు నాయకుల స్థూపాలు

ఊరూరా హత్య చేయబడిన కమ్యూనిస్టు నాయకుల స్థూపాలు

- Advertisement -

సామినేని హత్యలో నిజాలు బయటకు వస్తే..మల్లు భట్టి విక్రమార్కకు, కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటుందనే భయం.. 
మధిరలో జరుగుతుంది ప్రజల అభివృద్ధి కాదు..
మల్లు భట్టి విక్రమార్క, మల్లు నందిని అభివృద్ధి 
సామినేని జీవితాంతం పార్టీ కోసమే పని చేశారు 
మధిరలో అదనంగా ఒక్క ఎకరానికి సాగునీరు ఎక్కడ ఇచ్చారో చెప్పాలి 
సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు
నవతెలంగాణ – బోనకల్

మధిర నియోజకవర్గంలో జరుగుతున్నది ప్రజల అభివృద్ధి కాదని, కేవలం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆయన సతీమణి మల్లు నందిని అభివృద్ధి, ఇసుక, మట్టి మాఫియా లో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం లో అభివృద్ధి చెందారని సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ఘాటుగా విమర్శించారు. స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అయిదు మండలాల అధ్యక్షులు విలేకరుల సమావేశం పెట్టి సీపీఐ(ఎం) నాయకులపై, సీపీఐ(ఎం) పై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మల్లు భట్టి వక్రమార్క అభివృద్ధి అంటూ పదేపదే అబద్ధాలను వల్లే వేశారని విమర్శించారు. మధిర నియోజకవర్గంలో పారుతున్నది సాగునీరు కాదని, భట్టి విక్రమార్క సొంత అభివృద్ధి అన్నారు.

హైదరాబాదులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తమను కమిషన్లు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంట్రాక్టర్లు మల్లు భట్టి విక్రమార్క చాంబర్ ముందు ధర్నా చేసిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులారా అప్పుడే మర్చిపోయారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ముదిగొండ మండలం నుంచి ఎర్రుపాలెం వరకు కాంగ్రెస్ గూండాలచే హత్య చేయబడిన సీపీఐ(ఎం) నాయకుల, కార్యకర్తల స్తూపాలు కనిపిస్తాయి అన్నారు. హత్య రాజకీయాలు చేసేది కాంగ్రెస్ అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ చింతకాని మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు మీ సొంత గ్రామమైన నాగులవంచలో అనగాని దుర్గారావుని కాంగ్రెస్ గూండాలు హత్య చేయలేదా దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ముదిగొండ మండల అధ్యక్షుడు గండ్లూరి కిషన్ రావుని, మరికొంతమందిని హత్య చేసింది కాంగ్రెస్ గుండాలు కాదా అంటూ ఆయన ప్రశ్నించారు.

చింతకాని మండలంలో పందిళ్ళపల్లిలో అలవాల శ్రీనివాసరావుని, పాతర్లపాడులో సామినేని రామారావుని, బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం గ్రామంలో ఎర్రగాని నాగేశ్వరరావుని హత్య చేసింది కాంగ్రెస్ గూండాలు కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఐదు మండలాల నుంచి వచ్చిన మండలాధ్యక్షులు ఒత్తిడితో అవగాహన లేకుండా, ఒకవేళ అవగాహన ఉన్న ఆత్మను చంపుకొని, విలేకరుల సమావేశం నిర్వహించారని ఎద్దేవా చేశారు. హత్యలు చేయడంలో కాంగ్రెస్ నాయకులు దిట్ట అని విమర్శించారు. ముదిగొండ మండలంలో జానెడు జాగా కోసం ఆందోళన చేస్తున్న ఏడుగురిని కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అంటూ వారి ప్రశ్నించారు. సామినేని రామారావు హత్యపై కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికైనా వాస్తవాలు బయటికి వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు.

పేద ప్రజల కోసం సీపీఐ(ఎం) చింతకాని మండల కమిటీ సెప్టెంబర్ 24న చేపట్టిన పాదయాత్రలో సామినేని రామారావు పాల్గొని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు కక్కిన విషయం గుర్తు తెచ్చుకోవాలని సూచించారు.రాష్ట్రంలో మల్లు భట్టి విక్రమార్క నెంబర్ 2 స్థానంలో ఉన్నారని సామినేని రామారావుని హత్య చేసింది ఎవరో ఎందుకు తేల్చడం లేదని ఆయన ప్రశ్నించారు. రామారావు హత్య కేసులో నిజాలు బయటికి వస్తే అది మల్లు భట్టి విక్రమార్కకు, కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటుందని భయముతోటే నిజాలు బయటకు రానివ్వటం లేదన్నారు.

భట్టి విక్రమార్క ఆదేశాలతోటే పోలీసులు నిజాలను బయటకు చెప్పటం లేదన్నారు. సామినేని రామారావుని ముమ్మాటికీ హత్య చేసింది పాతర్లపాడు కాంగ్రెస్ నాయకులేనని ఆయన స్పష్టం చేశారు. సామినేని రామారావు తన జీవితాంతం పార్టీ కోసమే పని చేశారని స్పష్టం చేశారు. ఆయన జీవితంలో సామినేని రామారావు సీపీఐ(ఎం) కి ఏనాడు దూరంగా లేడని, కాంగ్రెస్ నాయకులు ఇటువంటి ప్రచారానికి కూడా దిగటం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. మధిర నియోజకవర్గంలో సీపీఐ(ఎం) నాయకులను హత్య చేసిన పందిళ్ళపల్లి, పాతర్లపాడు గోవిందాపురం ఎల్ గ్రామాలలో కాంగ్రెస్ కు ప్రజలు గోరి కట్టారన్నారు.

ఆ మూడు గ్రామాల్లో కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముదిగొండ, బోనకల్ మండల కేంద్రాలలో కాంగ్రెస్ కి ప్రజలు ఘోరీ కట్టారు అన్నారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా సగం మంది ప్రజలు మల్లు భట్టి విక్రమార్కను వ్యతిరేకించారన్నారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలలో స్పష్టమైంది అన్నారు. ఆనాటి సీపీఐ(ఎం) మధిర ఎమ్మెల్యేలు బోడెపూడి వెంకటేశ్వరరావు, కట్టా వెంకట నరసయ్య రైతుల సంక్షేమం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 30 ఎత్తిపోతల పథకాల నిర్మించారన్నారు. ప్రస్తుతం ఆ ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయలేని దుస్థితిలో మల్లు భట్టి విక్రమార్క ఉన్నారన్నారు. ఆ ఎత్తిపోతల పథకాలకు నిధులు ఇస్తే, దానివల్ల రైతులకు ఉపయోగమే తప్ప తనకు ఉపయోగం ఏమి రాదనే ఉద్దేశంతోటే నిధులు ఇవ్వటం లేదని విమర్శించారు.

అవసరం ఉన్న లేకపోయినా రోడ్లకు నిధులు మంజూరు చేసి అదే అభివృద్ధి అని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, విద్య, వైద్య రంగాలలో వస్తున్న మెరుగైన ఫలితాలను సాధించటమే అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు. మధిర పట్టణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మించారని, దానిని ప్రారంభించకుండా మల్లు భట్టి విక్రమార్క ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మధిర నియోజకవర్గంలో సీపీఐ(ఎం) ను ఎంత అనిచివేయాలని చూస్తే అంత రెట్టింపు వేగంతో ఎర్రజెండా మరింత ముందుకు సాగుతుందన్నారు. ఈనెల మూడవ తేదీన సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గ కేంద్రంలో నిరసన ప్రదర్శన పెడితే అధికార పార్టీ నాయకులు పోలీసులు ఎందుకు నిర్బంధాలు ప్రయోగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పోలీసుల ద్వారా ఎన్ని నిర్బంధాలు ప్రయోగించిన నిరసన ప్రదర్శన విజయవంతం అయింది అన్నారు. ఇదేమైనా ఎమర్జెన్సీ కాలమా అంటూ ఆయన ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లిన మల్లు భట్టి విక్రమార్క మరికొందరిని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేస్తే ఆందోళన చేయలేదా అంటూ ఆయన ప్రశ్నించారు. సీపీఐ(ఎం) ఆందోళన చేయకూడదా ఇది ప్రజాస్వామ్యం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. మల్లు భట్టి విక్రమార్క, మల్లు నందిని అండదండలతో కాంగ్రెస్ నాయకులు మట్టి, ఇసుక మాఫియాల అవతారం ఎత్తి ప్రభుత్వ సొమ్మును దోసుకుంటున్నారన్నారు.

ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ నాయకులు దోచుకోవటం దాచుకోవటంలో ఆరితేరారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, బోనకల్, మధిర రూరల్ కార్యదర్శులు కిలారు సురేష్ మంద సైదులు, డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు పాపినేని రామనర్సయ్య శీలం నరసింహారావు, డివిజన్ కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు గుగులోత్ నరేష్, బూర్గుల అప్పాచారి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -