Sunday, August 3, 2025
E-PAPER
Homeజోష్ట్రెండ్‌ మారిన... ఫ్రెండ్‌ మారడు...

ట్రెండ్‌ మారిన… ఫ్రెండ్‌ మారడు…

- Advertisement -

నిక్కర్‌ నుండి జీన్స్‌ లోకి మారిన
సైకిల్‌ నుండి బైక్‌ లోకి మారిన
కాన్వెంట్‌ నుండి కాలేజీ కి మారిన
నోట్బుక్‌ నుండి ఫేస్బుక్‌ కి మారిన
ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్‌ మారిన
ఫ్రెండ్‌ అన్న మాటలోన స్పెల్లింగ్‌ మారున ఫీలింగ్‌ మారున
ట్రెండ్‌ మారిన ఫ్రెండ్‌ మారడే
ఎండ్‌ కానీ బాండ్‌ పేరు ఫ్రెండ్షిప్‌ ఏ
ట్రెండ్‌ మారిన ఫ్రెండ్‌ మారడే
గుండెలోన సౌండ్‌ పేరు ఫ్రెండ్షిప్‌ ఏ

అమ్మ ఒడి వీడాక.. నాన్న చేయి వదిలాక.. దొరికే తొలితోడు స్నేహం. కొండంత కష్టమైనా, కడలి నిండే కన్నీళ్ళైనా పంచుకునేది నేస్తమే. చిరు చెమటలో చిరుగాలై.. నడి వేసవిలో మంచుముక్కై.. అడుగులో అడుగై.. జీవితాంతం మనస్సు పంచుకునే ఆత్మబంధం స్నేహం.
‘స్నేహం సంతోషాన్ని పెంచుతుంది. భావాలను పంచుతుంది. ఆందోళనలను తుంచుతుంది. గతాన్ని గుర్తు చేస్తుంది. వర్తమానాన్ని వడ్డిస్తుంది.’ స్నేహం కూడా ప్రేమ లాంటిదే. ఎప్పుడు, ఎందుకు, ఎవరి మీద, ఎలా పుడుతుందో తెలియదు. ప్రేమకు స్నేహమే తొలి అడుగు అవుతుంది. ఆ మాటకొస్తే, నిజమైన స్నేహితులు అతి తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే స్నేహమనేది చాలా విలువైనది. విలువైనదేదీ ఎవరికీ అంత సులువుగా దొరకదు. నిజమైన స్నేహమంటే ‘నీ కన్నా ముందు నడవక నీ కన్నా వెనుక నడవక నీతో పాటే కలిసి అడుగులు వేయడమే’ అంటాడో రచయిత.
నిజమైన స్నేహంలో తన మిత్రులలోని మంచినీ, చెడునీ – రెండింటినీ అంగీకరించే మనసుంటుంది. ఈ మానవాళిలో అత్యంత తీయనైనది, అద్భుతమైనది, ఎల్లలు లేనిది, స్వార్థం లేనిది స్నేహం మాత్రమే. రక్త సంబంధాలకు, బంధుత్వాలకు అతీతమైనది, ధనిక పేదలనే తేడా తెలియనిది, కుల, మత, వర్గ భేదాలు తెలియనిది స్నేహం. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మనస్సుల మధ్య అల్లుకుపోయే పవిత్రబంధం. అది అనుభవిస్తే తప్ప అందులోని మాధుర్యం తెలియదు. మనస్సుకు ఉల్లాసం, ఉత్సాహం కావాలంటే మనిషికి స్నేహం చాలా అవసరం. స్నేహితులుంటే వారు ఆరోగ్యంగా ఉంటారనేది వైద్యశాస్త్రం కూడా అంగీకరించిన విషయమే.
బంధం, అనుబంధాల మేలుకలయిక స్నేహం. ఎక్కడో ఒకచోట ఇరువురి (అంతకంటే ఎక్కువ) మధ్య ఏర్పడే పరిచయం మొగ్గ తొడిగి, పూలు పూసి స్నేహంగా వికసిస్తుంది. అది మన జీవితానికి ప్రత్యేకమైనది. జీవితం సాఫీగా సాగాలంటే భార్యాభర్తలు స్నేహితులుగా ఉండాలంటారు పెద్దలు. యుక్తవయసు వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు కూడా స్నేహితులుగా మెలగాలంటారు. ప్రపంచ దేశాలు వైషమ్యాలు మరచి సమన్వయంతో, సామరస్యంతో మెలిగితే ఆ దేశం సుభిక్షం.. సుసంపన్నం.. అదే స్నేహంలోని గొప్పతనం. స్నేహం ఒక అపురూపమైన అనుబంధం. ఆస్వాదిస్తే మధురంగా ఉంటుంది. అవసరార్థం కొనసాగిస్తే అనర్థానికి దారితీస్తుంది.

ట్రెండ్‌ మారినా..
ఐఫోన్‌లో వెర్షన్లు మారిపోతున్నాయి, వాట్సాప్‌లో అప్‌డేట్స్‌ వచ్చి చేరుతున్నాయి.. ఫేస్‌బుక్‌ ఫేడవుట్‌ అవుతోంది.. ఇన్‌స్టాగ్రామ్‌ దూసుకెళ్తోంది.. నిన్నటి రోజు నేడు కనుమరుగువుతోంది. ఎన్ని ట్రెండ్‌లు మారినా. మారనిది ఫ్రెండు ఒక్కడే! స్నేహం మనసుల మధ్య వారధి. కాలేజీలో పక్క బెంచీ అమ్మాయి.. ఆఫీసులో సహౌద్యోగితో అల్లుకున్న బంధం.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు కలబోసుకునే వైనం.. దేశ సంస్కతి, సరిహద్దుల విషయంలో సుహద్భావం.. స్నేహం ఎక్కడైనా మొగ్గ తొడిగేందుకు ఆస్కారముందనడానికి నిదర్శనం. సరదాలను చేరువ చేస్తూ.. ట్రెండు మారినా ఫ్రెండు మారునా అనిపిస్తుంది. స్నేహితులే బాధల్ని దూరం చేస్తూ జీవితానికో పరమార్థం కల్పిస్తారు.

రసాయనిక చర్య
స్నేహంలో అతి ముఖ్యమైనది నమ్మకం. అలాగే ఇచ్చి పుచ్చు కోవడం. అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలనుకునేవారి మధ్య స్నేహం ఎంతోకాలం నిలవదు. ఎదుటివారి మాటకు విలువ నివ్వడం అలవాటు చేసుకుంటే, ఆ స్నేహం పదికాలాల పాటు నిలిచి ఉంటుంది. ఏ స్నేహానికైనా పరిచయమే పునాది. ఒకరి సాంగత్యలో మరొకరు ఆనందం పొందుతున్నప్పుడూ, అదే సందర్భంలో తప్పును సున్నితంగా తెలియజెప్పడంలో ఉన్న నేర్పరితనం వల్లనే వారి మధ్య స్నేహం బలపడుతుంది. ఏ రకమైన స్నేహమైనా ఇద్దరి మధ్య సర్దుకుపోయే గుణం ఉండాలి. ఒకరికొకరు భావాలనూ, బాధలనూ పంచుకొనే చొరవ ఇద్దరి మధ్య ఉన్నప్పుడే ఆ బంధం దఢమవుతుంది. సందర్భం ఉన్నా, లేకపోయినా అనుక్షణం నీడలా వెన్నంటి ఉండే వారే నిజమైన స్నేహితులు. రంగు, రూపాలతో స్నేహానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం రెండు మనస్సుల మధ్య జరిగే రసాయనిక చర్య.

పైలంగుండాలి!
‘స్నేహమేరా జీవితం… స్నేహమేరా శాశ్వతం..’ అన్నాడో సినీ కవి. అందుకే, ప్రపంచంలో ఎన్ని బంధాలున్నా స్నేహబంధం మాత్రమే మనిషి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. ఆధునిక స్నేహాలు… మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఆధునాతన టెక్నాలజీ పరంగా స్నేహం సరికొత్త పుంతలు తొక్కుతోంది. అయితే, పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మంచిని పెంచుకోవాల్సిందిపోయి చెడు మార్గాలు పట్టడం, దానికి స్నేహం అనే ముసుగు వేయడం బాధాకరమైన విషయం. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల వంటివాటిని వినియోగించుకోవడంలో ముందున్న యువత ముక్కూముఖం తెలియనివారితో అవసరానికి మించి చనువు ప్రదర్శించడం, అవతలి వ్యక్తి అసలు ఆడో మగో కూడా తెలియకుండా స్నేహం చేస్తున్నాం అనుకోవడం వంటి వాటివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనం నిత్యం చూస్తున్నాం. కొందరు స్వార్థపరుల వల్ల స్నేహం కూడా వ్యాపారీకరణకు గురవుతున్న సంఘటనలు కూడా చాలానే జరుగుతున్నాయి. సోషల్‌ నెట్‌వర్క్‌ను సన్మార్గంలో ఉపయోగించుకున్న వారికి మంచి స్నేహితులు లభిస్తారు. కాబట్టి ఈ ఆధునిక యుగంలోనూ స్నేహానికి ఉన్న వన్నె తగ్గలేదు.

రీజనల్‌ స్నేహాలు..
అవసరాల కోసం మొదలయ్యే రీజనల్‌ స్నేహాలు.. సీజనల్‌ ఫ్రెండ్‌షిప్‌లు క్యాజువల్‌గా వస్తుంటారు, పోతుంటారు. అలాంటి స్నేహితులు వందలు, వేలున్నా.. అసలు లేకపోయినా ఒక్కటే. బాధను పంచుకునే.. తడి కన్నులను తుడిచే నేస్తం ఒక్కరున్నా జీవితం పూదోటే. స్నేహంలో సాన్నిహిత్యమే కాదు.. గౌరవం, చొరవ, నమ్మకమూ.. ఉండాలి.

వదిలించుకోవాల్సినవి…
అవును నిజమే వదిలించుకోవాల్సిన స్నేహాలు కూడా ఉంటాయి. అవి ఎంత త్వరగా వదిలించుకుంటే అంత ఆరోగ్యకరం. మంచి స్నేహితులున్నట్లే కొంతమంది చెడ్డవారూ ఉంటారు. అలాంటి వారు స్నేహాం ముసుగులో చేసే పనుల వలన మిగతా వారిని కష్టాలు పాలు చేస్తుంది. ఒక్కొక్కసారి జీవితాలనే చిందర చేస్తుంది. వారితో జర జాగ్రత్తగా ఉండటం కంటే మరో మార్గం ఉండదు. గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు కొంత వయస్సు వచ్చేవరకైనా వారి స్నేహితులెవరనేది ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు అంత తీరిక తల్లితండ్రులకు లేదు. ఈ బిజీ లైఫ్‌లో వారు ఇరువురూ ఉద్యోగస్థుల్క్కెతే, వారి పిల్లలను ఎక్కడో దూరంలో ఉన్న ఏదో ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఉంచడంవల్ల వారు ఎవరితో స్నేహం చేస్తున్నారో వీరికి తెలియదు. కాబట్టి మన స్నేహితుల విషయంలో అనేక జాగ్రత్తలు అవసరం.తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు వహించాల్సిందే.

మరి ఈ రక్తతర్పణలెందుకు..!
ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాల మధ్య సయోధ్య సరిగా లేదు. కొన్ని దేశాలు యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నాయి.. రక్తపుటేరులు పారుతున్నాయి. పసిపిల్లల్ని, మహిళల్ని బలిగొంటున్నాయి. ప్రజల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఇజ్రాయెల్‌ పాలస్తీనా మధ్య పోరు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అంతకుముందు నుంచే రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతోంది. ఈ యుద్ధాల్లో అమాయక పసి పిల్లలు వసివాడుతున్నారు. పిల్లలనే మమకారం లేదు.. ముసలివారనే కనికరం లేదు.. ఆడవారనే ఆలోచన లేదు. ఎందుకీ పరిస్థితి? దీనిపై బాధ్యత వహించాల్సిన ఐరాస, అభివద్ధి చెందిన దేశాలుగా నీరాజనాలు అందుకుంటున్న దేశాలు ఈ స్నేహ దినోత్సవాన్ని పురస్కరించుకునైనా ఈ యుద్ధానికి చరమగీతం పాడాల్సి ఉంది. ఆ విధంగా ప్రపంచంలో శాంతిని నెలకొల్పి, సయోధ్య కుదిరే పరిస్థితులు రావాలని ఆశిద్దాం.

గుప్పెడు చాలు..
గుండెల్లో గుప్పెడంత ప్రేమ, అభిమానం ఉంటే చాలు. వర్షంలో తడుస్తుంటే వర్షాన్ని ఆపలేకపోవచ్చు.. తడవకుండా గొడుగు పట్టగలం కదా. చీకట్లో భయపడుతుంటే సూర్యుడిని రప్పించలేకపోవచ్చు.. ఓ వెలుగును చూపించగలం కదా.. ఏ పరిస్థితుల్లోనయినా ‘నాకేం భయం లేదు.. నా ఫ్రెండ్‌ ఉన్నాడు’ అని భరోసా కల్పించగలిగితే అదే పదివేలు.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -