Monday, January 19, 2026
E-PAPER
Homeదర్వాజబతుకు చిత్రాల తలపాగ - 'పగిడి'కథలు

బతుకు చిత్రాల తలపాగ – ‘పగిడి’కథలు

- Advertisement -

కథా సాహిత్యం ఒక ప్రాంతపు సామాజిక చరిత్రను మాత్రమే కాదు, రాజకీయ, సాంస్కృతిక, వర్తమాన పరిస్థితులను లోతుగా ప్రతిబింబిస్తుంది. ఆ దిశగా తెలంగాణ కథలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2024 సంవత్సరంలో రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చలకు వేదికైన సంవత్సరాన్ని అక్షరీకరించిన కథలు ‘పగిడి’. ఈ గ్రంథానికి సమకాలీన విలువను మరింత పెంచింది. పగిడి(తలపాగా) గా మలచడం అంటే, తెలంగాణ కథ సాహిత్యానికి ఒక గౌరవచిహ్నాన్ని ధరింపజేసినట్లేనని భావం.

తెలంగాణ ఆత్మగౌరవం కోసం అహర్నిశలు కృషి చేసే కథాసాహిత్యాన్ని సంగిశెట్టి శ్రీనివాస్‌, వెల్దండి శ్రీధర్‌ గారల సంపాదకత్వం ప్రచురిస్తుంది. వీరి కృషి తెలంగాణ కథా సాహిత్యానికి గొప్ప చేర్పు.
ఈ సంకలనంలోని మొత్తంగా పద్నాలుగు కథలున్నాయి. ఇద్దరు రచయిత్రులున్నారు. కథలలో మత సంబంధిత ప్రభావాలు, మెజార్టీ ఆధిపత్య భావనలు, భయాలు, పరస్పర అనుమానాలున్నాయి. ఇవి కథలలో అంతర్లీనంగా నిగూఢంగా వ్యక్తమవుతున్నాయి. మనుషుల మధ్య ఏర్పడుతున్న దూరాలు, రాజకీయ లాభాల ధోరణి, సామాన్య ప్రజల జీవితాలపై పడుతున్న ప్రభావం ఈ కథలలో వాస్తవాలుగా రూపుదిద్దుకున్నాయి.

అన్నదమ్ముల అనుబంధాలకైనా షరతులు వర్తిస్తాయనీ, చెట్టు నేపథ్యంగా దిగజారుతున్న మానవ విలువలను తెలిపిన అక్షర కుమార్‌ ‘మంకులొల్లి’ కథ. పంచుకోవడంలో ఉన్న సంతృప్తి కోల్పోతున్న పరిస్థితులకు దర్పణం పట్టింది. ఈ కథలో రైల్వే మూడో లైన్‌ మొదలుపెట్టి పది సంవత్సరాలైనా పూర్తికాని విషయాన్ని, కరోనా పెట్టిన కాలపరీక్షకు ప్రపంచమే తల్లడిల్లిందని చర్చించింది.
మంచి బట్టకట్టినా, మంచిగ దువ్వుకున్నా ఓర్వని వివక్షల సమాజాన్ని చూపించిన మారబత్తుల పెద్దన్న కథ ‘పరివర్తన’. కమల తన భర్తను వ్యసనాల నుండి మార్చుకున్నది. పరివర్తనతో కమల ఆత్మగౌరవం అద్ది బతుకు దిద్దుకుంది. ఎన్నో మాటలు తిట్టినా భరించే ఆటో డ్రైవర్‌ వెంకన్న, మాటకు మాట అనగలను అని అన్నాడు. మర్యాద ఇచ్చి పుచ్చుకోండి అని మందు బస్తాలు రోడ్డు మీద పడేసి గల్ల ఎగురేసుకుంటూ పోవడం ఆత్మాభిమానమే.

చేతగాని బతుకు – కంట్లో కారం ఒకటేనని బతుకును పసరులా పిండి పోస్తున్న యాదమ్మ జీవితం నేర్చుకోదగ్గది. ఆమె పెనిమిటి కుందయ్యల బతుకుబాధల్ని కథగా మలచిన తగుళ్ళ గోపాల్‌ ఆర్థ్రమైన కథ ‘కర్ణం కుందయ్య’. పల్లెల్లో కులాల ఐక్యత. అనుబంధాల అల్లికను ఈ కథ తెలియజేస్తుంది. ఈ కథలో సరుకులు కొనలేని దీనస్థితిని యాదమ్మ చెప్పడం కనీస ధరల పెరుగుదలను సూచిస్తుంది. పైసమదం కన్నూ, మిన్ను కానకుండా చేస్తది. ఆపదలో ఆదుకునేది రక్త సంబంధం. ”రక్తబంధాన్ని ప్రేమగా కలుపుకో, లేకుంటే గడ్డకుపడ్డ చాపవైతవు” అని హెచ్చరించిన తల్లి అనుభవమే పెద్దింటి అశోక్‌ కుమార్‌ కథ ‘రక్త బంధం’.

సాటిమిత్రుని సహానుభూతి అలజడిలోంచి పుట్టిన అఫ్సర్‌ కథ ‘డియర్‌ మేరీ’. సెయింట్‌ మేరీ చర్చి దారుల్లోని అనుభూతులు, అనుభవాలు రచయితకు అతని మిత్రుడు శ్రీకర్‌కి జ్ఞాపకాలు. అవి గుర్తుకొచ్చినప్పుడు మిన్ను విరిగి మీద పడ్డట్లు గుండెల్లో ఉత్పాతం పుడుతుంది. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. మన వీధులు చర్చీలు, మసీదులు కాకముందే మేల్కొనాలని కనపడని యుద్ధాన్ని ప్రకటించాడు. అనుకోని పరిస్థితులలో అనుకున్న లక్ష్యాలు సాధించడంలో బతుకులు అగాథమైతాయని సంఘర్షణలు చిత్రించిన హనీఫ్‌ కథ ‘వేప పళ్ళు’. జీవితం చీకటి విషవలం. మాదిగ గూడెంలో పెళ్లికాకుండా కొడుకును కన్న తల్లితో శేషు జీవనాన్ని ఎలా సాగించాడో కులం, ఆర్థిక పరిస్థితులను విశ్లేషించిన కథ.

నివురు కప్పిన నిప్పులాంటి తప్పుడు మనుషులను మైక్రోస్కోప్లో చూపడమంటే పరిశీలనాత్మక సాహసం చేయడమే. మండే అగ్నిగోళం మతిలో పెట్టుకుని, నోరుగాయితనానికి చిరునామాగా మారిన, ఫ్రస్ట్రేషన్తో బతుకుతున్న ఒక సగటు స్త్రీ వ్యథను స్వర్ణ కిలారి ‘నోరుగల్లది’ కథ విరిగిపడిన శకలాలుగా చూపిస్తుంటది. లొల్లిలు, నటనలు అన్నీ సావుకాడనే సురువైతయి. పోటీపడుతయి. రక్తికడుతయి. ఉప్పలయ్య సావు నటనలకు ఉప్పందించిశ్రీ పసునూరి రవీందర్‌ కథ ‘సావులొల్లి’. మనుషులలోని నగమైన స్వభావాలు చిత్రించింది. బొచ్చెగొట్టుకుని ఏడస్తే సచ్చినోడు లేసి వస్తాడా? అని అతనితో జీవితం పంచుకున్న కనకమ్మ అన్నది. మంది బాధకి ఏడ్చింది. పెద్దకోడలు చిన్నకోడలు పోటీపడి అతని మూడు గుంటల జాగకోసం ఏడుపులోనూ నటిస్తున్నారు. డప్పులు మోగుతున్నాయి. తీన్మార్‌ దరువులలో తీర్తం కనపడుతుంది.

గాయకుడు లేనిపోని పొగడ్తలతో పాటందుకున్నాడు. చిన్న కోడలను మెచ్చుకున్నాడు. అది విన్న పెద్దకోడలు ఆక్రోషంతో చూసింది. జడుసుకున్న కళాకారుడు పరారైండు. ఉప్పలయ్య వీరుడు, శూరుడు అన్నందుకు పెద్దమనుషులంతా నారాజు అయ్యిండ్రు. సావులో మాత్రం ఎవరి లొల్లి వారికున్నది. ఒక్క పాట మనుషులలో లొల్లి పుట్టించింది. ఆన్‌లైన్‌ ఆటలు, గేమింగ్‌ ఆప్స్‌తో ఛిద్రమవుతున్న బతుకుల్ని చిత్రించిన బి. నరసన్‌ కథ ‘ఆట కాదు… వేట’. ఈ కథలో మురళి అక్క పెళ్లికోసం జాగ అమ్మగా వచ్చిన ఐదులక్షల రూపాయలను తండ్రి చెప్పగా బ్యాంకులో డిపాజిట్‌ చేశాడు మురళి. మురళి మిత్రులు జగన్‌, ప్రశాంత్‌ ఆన్లైన్‌ గేమ్‌డౌన్లోడ్‌ చేసి ఆట ఆడించారు. ముందుగా మురిపించారు. ఆటలో రెండు లక్షల పోగొట్టుకున్నాక అతనికి వాస్తవం తెలిసింది. తండ్రి బ్యాంకుకు పోయి అడిగితే రెండు లక్షలు డ్రా అయ్యాయి. అని చెప్పాడు క్యాషియర్‌. అప్పటికే జీవితం మీద విరక్తి చెంది రైలుకు ఎదురు వెళ్లి చావాలని నిశ్చయించుకుని మురళి లోలోన కుమిలిపోతూ కూలబడిపోయిన జీవితం ఎలా మలుపు తిరిగిందో చెప్పే కథ.

ఆధునిక కాలంలో మంత్రాల నెపంతో సమాజం మూఢత్వంతో దాడులు చేసి ప్రాణాలు హరిస్తున్న వైనాన్ని చక్కగా చిత్రించిన బద్ది గణేష్‌ కథ ‘నింద’. గుమగుమలాడే మస్కట్‌ సెంటు. దుబాయ్‌ గర్మికోటు. గల్లలుంగి. టైటాన్‌ వాచ్‌. మెడల బంగారు గొలుసుతో కనపడే ఆహార్యం మస్కట్‌ దుబాయిలకు వెళ్లాలని ఉసిగొలుపుతుంటాయి. ఆ సంపాదన ప్రభావంతో గాలానికి చిక్కిన చేపలాగా జీవితాన్ని కోల్పోతున్న దుబాయ్‌ బతుకుల్ని తెలిపే కళాగోపాల్‌ కథ ‘ఖల్లివెళ్లి’ ప్రత్యేకమైనది. తిండిపెట్టలేదని ఎవరిని బదనాం చేయలే. ఆత్మగౌరవం గల మనిషి. ఆత్మగౌరవంతోటే ఆత్మహత్య చేసుకున్న సంఘటన కథగా చదువుతుంటే వ్యవస్థలోని లుకలుకలు అర్థమవుతాయి. ఏ రుణం మిగిల్చకుండా సావాలనుకున్న ధిక్కారమే శిరంశెట్టి కాంతారావు ‘దర్భశయ్య’ కథ.

గౌరమ్మ చనిపోయాక సూరయ్య ఒంటరివాడయ్యాడు. ఉపావాసంతో కాళ్లు కడుపులో పెట్టుకొని పడుకున్నడు. తన అంత్యక్రియలకు అవసరమైన వాటన్నిటిని సమకూర్చుకున్నాడు. ఎవరికి ఏ భారం మిగిల్చకుండా చనిపోయిన సూరయ్య జీవితమే దర్భశయ్య. కాష్టంకుండ, తలాపున దీపంతలు కుమ్మరి ముత్తమ్మ నుంచి తెచ్చుకున్నాడు. మూడువేలయితే ఇత్తన్న. నా సావు చేయండ్రని మాదిగ ఇంగిలయ్యకి ఇచ్చాడు. దూదేకుల లాల్‌సాబ్‌ ఇంటి ముందటి చింత చెట్టు కట్టే కొన్నాడు. రేషన్‌ డీలర్‌ బిల్ల మల్లారెడ్డి నుంచి బియ్యం, రామ్‌ నర్సయ్య సేటు వద్ద నుంచి మామిడి పల్లెలో నా సడ్డకుడు చచ్చిపోయిండు దానం చేయనీకి కావలసిన సరుకులు, దినాలకు కావలసిన యాటను గొల్ల కోటయ్య దగ్గర, అన్ని కట్టుమనీ, తన సావుకు ఎన్ని కావాలో అన్ని తానే కొనుక్కున్నాడు. పంచనామకు వచ్చిన సర్పంచ్‌ పోలీసుతో దర్భశయ్య మీద పడుకొని ఊపిరి బిగబట్టి చచ్చిపోయినట్టున్నాడని చెప్పిండు.

కుళ్ళు రాజకీయాలలో ప్రభుత్వ సంస్థలు ఎలా నిర్వీర్యం అవుతున్నాయో తెలియజేసే మనుప్రీతం కథ ‘ధర్నా బ్రాంచ్‌’. పాత ప్రిన్సిపల్‌ చంద్రం ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త ప్రిన్సిపల్‌ కు తెలిసాక భవిష్యత్తు వేధిస్తున్న ప్రశ్నగా మిగిలింది. స్టేటస్‌ లేని మైనింగ్‌ బ్రాంచ్‌ కి గౌరవప్రదమైన హౌదా ఇవ్వాలని విద్యార్థులు ధర్నా చేస్తుంటారు. అధికార, విపక్ష నాయకులు పట్టించుకోరు. అందుకే ఆ ప్రిన్సిపల్‌ చచ్చిపోయాడని తెలుస్తుంది. కొత్త ప్రిన్సిపల్‌ కు వ్యతిరేకంగా గిరి తన గర్ల్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అయిన అతని గర్ల్‌ ఫ్రెండ్‌తో సహా విద్యార్థులు తిరగబడ్డారు. మిషనరీ వాడడం తెలియని కూలీలు సింగరేణిలో అనేక ప్రమాదాలకు గురవుతున్నారు.

నీళ్లులేక కన్నీళ్లు. నీళ్లుండి కన్నీళ్లుగా మలచిన చందుతులసి కథ ‘నీళ్లునీళ్లు’. నీళ్ల కోసం బోర్‌ ఏసి అప్పులపాలై పట్నం పోయిన సోమయ్య కుటుంబ గాథ. కాలక్షేపం కోసం చదివే కథలు కావివి. కథలలో పాత్రలు మనముందు కదలాడుతాయి. పాత్రోచిత సంభాషణలు జీవం ఉట్టిపడుతుంది. ప్రతీ కథాశైలీ ఆకట్టుకుంటూ పాఠకున్ని చదివిస్తుంది. కథ కథలా కాక జీవితంలా కనిపిస్తుంటది.
తెలంగాణ సమాజాన్ని చిత్రించిన కథలు ఇవి. మేలైన కథా సంకలనాన్ని తెస్తున్న సంపాదకులకు జంబూ సాహితి తరపున శెనార్థులు. అభినందనీయులు.

డా. సిద్దెంకి యాదగిరి, 941244773

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -