గల్ఫ్‌దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ దాడులు
నివాసాలు ఖాళీ చేసి హోటళ్లకు..
క్షిపణి, డ్రోన్ దాడులతో యూఎస్ సైనిక స్థావరాల ధ్వంసంపై ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయిల్ కలిపి దాడులు చేస్తుండగా, అటు ఇరాన్ సైతం క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులతో పశ్చిమాసియాలోని అమెరికా సైనిక కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. వారిని ప్రాణభయం వెంటాడుతోంది. ముఖ్యంగా ఇరాన్ నిరంతరాయంగా జరుపుతున్న క్షిపణి, డ్రోన్ దాడుల కారణంగా అనేక అమెరికా సైనిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. యూఎస్-ఇజ్రాయిల్ సంయుక్త దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలోని సుమారు 13 అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని అమెరికా సైనిక అధికారులు వెల్లడించారు. ఈ దాడుల కారణంగా వేలాది మంది అమెరికా సైనికులు తమ సంప్రదాయ స్థావరాలను వదిలిపెట్టి ఈ ప్రాంతంలోని హోటళ్లు, కార్యాలయాలకు తరలివెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.
ఇరాన్ దాడులతో ముఖ్యంగా కువైట్‌లో తీవ్రమైన నష్టం వాటిల్లిందని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. అక్కడ కీలకమైన స్థావరాలపై దాడులు జరిగాయని తెలిపింది. పోర్ట్ షోయబాలో ఒక క్షిపణి ఆర్మీ టాక్టికల్ ఆపరేషన్స్ సెంటర్‌ను ధ్వంసం చేయడంతో ఆరుగురు అమెరికా సైనికులు మరణించినట్టు చెప్పింది. అలీ అల్ సలేం ఎయిర్ బేస్, క్యాంప్ బ్యూరింగ్‌పై కూడా ఇరాన్ దాడులు చేయడంతో విమాన మౌలిక సదుపాయాలు, ఇంధన డిపోలు, నిర్వహణ సౌకర్యాలు దెబ్బతిన్నట్టు వివరించింది. అటు ఖతార్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయంగా భావిస్తున్న అల్ ఉదైద్ ఎయిర్ బేస్‌పైనా దాడి జరిగింది. ఫలితంగా దాని ముందస్తు హెచ్చరిక రాడార్ వ్యవస్థలకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఇలాగే బహ్రెయిన్‌లోని యూఎస్ ఐదో ఫ్లీట్ ప్రధాన కార్యాలయంలోని కమ్యూనికేషన్ పరికరాలను లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది.
సౌదీ అరేబియాలో, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌లోని ఇంధనం నింపే ట్యాంకర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నట్టు వివరించింది. పశ్చిమాసియాలోని అనేక స్థావరాలు ఇకపై కార్యకలాపాలకు అనుకూలంగా లేకపోవడంతో దూరంగా ఉండి యుద్ధ కార్యకలాపాలను నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇక్కడి రన్‌వేల నుంచి వైమానిక దాడులు కొనసాగుతున్నప్పటికీ, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రదేశాల నుంచే సమన్వయం చేసుకుంటూ ఆదేశాలు ఇస్తున్నారని వివరించింది. తాత్కాలికంగా పనిచేస్తున్నప్పటికీ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక ఏర్పాట్లలో కీలకమైన పరికరాలను పూర్తిగా మోహరించలేమని రిటైర్డ్ యూఎస్ ఎయిర్ ఫోర్స్ మాస్టర్ సార్జెంట్ వెస్ జె. బ్రయంట్ అభిప్రాయపడ్డారు.
అమెరికా దళాల ఆచూకీ చెప్పండి : పౌరులకు ఇరాన్ విజ్ఞప్తి
అటు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కూడా వివాదాస్పద బహిరంగ హెచ్చరికలు చేసింది. అమెరికన్ దళాలు హోటళ్లలోని పౌర మౌలిక సదుపాయాలను కవచంగా వాడుకుంటున్నాయని ఆరోపించింది. అందుకే అమెరికా దళాల ఆచూకీని తెలపాలని ఆ ప్రాంతంలోని పౌరులను కోరిందని తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ”అమెరికన్లను గుర్తించి లక్ష్యంగా చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. అందువల్ల, వారికి హోటళ్లలో ఆశ్రయం ఇవ్వకుండా వారికి దూరంగా ఉండటం మంచిది. అమెరికన్ ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాలను కచ్చితంగా తెలపడం మీ ఇస్లామిక్ విధి” అని ప్రకటించింది.
యుద్ధానికి సిద్ధంగా లేని అమెరికా
ఇరాక్, ఆఫ్గానిస్తాన్ వంటి తక్కువ ముప్పు ఉన్న ప్రాంతాలు మినహా అనేక స్థావరాలు యుద్ధానికి సిద్ధంగా లేవని అమెరికా సైనిక అధికారులు అంగీకరించినట్టు న్యూయార్క్ కథనం ప్రచురించింది. తిరుగుబాటు గ్రూపుల్లా కాకుండా ఇరాన్ అధునాతన బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను కలిగి ఉందని, ఇది గల్ఫ్ అంతటా అమెరికా మౌలిక సదుపాయాలను బలహీనతను బహిర్గతం చేసిందని పేర్కొంది. యుద్ధానికి సరైన సన్నద్ధతపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి. ఘర్షణలు ప్రారంభమైన తర్వాతే అమెరికా సైనికులు, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే సూచనలు జారీ చేశారని తెలిపింది.



