– గుణాత్మకమైన విద్యతోనే భవిష్యత్ :మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
వందేమాతర గీతం ఆనాడు యావత్ భారతదేశాన్ని ఉద్యమస్ఫూర్తితో నడిపించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని మహబూబియా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సామూహిక ఆలాపన ద్వారా మన జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, లక్ష్య సాధనలో ఈ గీతం ఉపయోగపడుతుందని అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం తమకు దక్కిందని చెప్పారు. విద్యతోనే మంచి ఉజ్వల భవిషత్ అని, విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ వందేమాతరం గీతం సమర నినాదంలా నిలిచిందని గుర్తు చేశారు. స్వతంత్ర సమరయోధులకు మనోబలాన్నిచ్చిందని, ”సుజలాం సుఫలాం మలయజ శీతలాం” ఈ పదాలు వినగానే ప్రతి భారతీయుడి హృదయం దేశభక్తితో ఉప్పొంగుతుందని అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో సమరయోధులకు ఊపిరిగా, స్వతంత్ర భారతంలో జాతీయ గేయంగా అజరామర కీర్తిని పొందిన ‘వందేమాతరం’.. ఓ అక్షర జ్వాల అని అన్నారు. పోరాట స్ఫూర్తిని నింపిన వందేమాతరం గురించి భావితరాలకు ఘనంగా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు. అదే స్ఫూర్తితో విద్యార్థులు కూడా జీవితంలో సవాళ్లను ఎదుర్కొని నిలబడాలని, ఉన్నత శిఖరాలకు చేరితే దేశం గర్వపడుతుందని అన్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి మీకు విద్యను అందిస్తున్నారని, వారి ఆశలు, కలలు నెరవేర్చాలని కోరారు. విద్యార్థినులతో కలిసి మంత్రులు వందేమాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, డీఈవో రోహిణి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఆర్‌జేడీ విజయలక్ష్మి, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ వెంకటేష్, ప్రైమరీ పాఠశాల హెచ్‌ఎం సుధారాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతర గీతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



