ఆ సొమ్ముపై నాదే పెత్తనం
డోనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : వెనిజులాపై చట్టవిరుద్ధంగా అమెరికా జరిపిన దాడి వెనుక వాస్తవ ఉద్దేశ్యాలు బయటకు వచ్చాయి. మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదానికి ఊతం అంటూ ఏవేవో కబుర్లు చెప్పినా అసలు నిజం వెల్లడైంది. వెనిజులా 2.82 బిలియన్ల డాలర్ల విలువైన 50 మిలియన్ బ్యారళ్ళ చమురును అమెరికాకు అప్పగిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనిజులా ఎగుమతులపై అమెరికా ఆంక్షల వల్ల పేరుకుపోయిన ఆ చమురును మార్కెట్ ధరలకు విక్రయించి, ఆ వచ్చిన డబ్బును వెనిజులా, అమెరికా దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. ‘వెనిజులాలోని తాత్కాలిక ప్రభుత్వం అత్యంత నాణ్యమైన, ఆంక్షలతో కూడిన 30 నుండి 50 బ్యారల్స్ చమురును అమెరికాకు సరఫరా చేస్తుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.’ అంటూ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. స్టోరేజీ నౌకల ద్వారా చమురును తీసుకువెళ్ళి నేరుగా అమెరికాలోని ఓడరేవుల్లో అన్‌లోడింగ్ చేస్తామని చెప్పారు.
వెనిజులా చమురు నిల్వలను ఎలాగైనా హస్తగతం చేసుకుంటామన్న గతంలో ప్రకటించిన ట్రంప్ అసలు ఈ చమురు నిల్వలన్నీ అమెరికా నుండి దొంగిలించినవేనంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. వెనిజులాలో రాబోయే 18 నెలల కాలంలో చమురు పరిశ్రమ కార్యకలాపాలను అమెరికా చేపడుతుందని, ఫలితంగా చమురు రంగంలోకి పెద్ద ఎత్తున అమెరికా నుండి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని ట్రంప్ ఆ పోస్టులో వివరించారు. అమెరికాలోని మూడు అతిపెద్ద చమురు కంపెనీలు చెవ్‌రాన్, ఎక్సాన్ మొబిల్, కాంకోఫిలిప్స్ నేరుగా ట్రంప్ వ్యాఖ్యలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కానీ శుక్రవారం ట్రంప్ ఈ కంపెనీల ప్రతినిధులు కలిసే అవకాశం వుందని అమెరికా మీడియా వార్తలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన వెనిజులా అమెరికా ఆంక్షలు, ఏళ్ళ తరబడి పెట్టుబడులు సరిగా పెట్టలేకపోవడం, నిర్వహణా లోపాలు కారణంగా కాస్తంత వెనుకబడింది. మళ్ళీ ఆ స్థాయికి చేరుకోవాలంటే దశాబ్ద కాలం పట్టవచ్చునని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
చైనా ఖండన
కాగా ఇటీవలి సంవత్సరాలలో వెనిజులా చమురుకు అతి పెద్ద కొనుగోలుదారుగా ఉన్న చైనా, ట్రంప్ ప్రకటనను ఖండించింది. వెనిజులా ఉత్పత్తి చేస్తున్న చమురుపై పెత్తనం తమదేనంటూ అమెరికా డిమాండ్ చేయడాన్ని తప్పుపట్టింది. చమురు ఉత్పత్తిపై అమెరికాతోనే భాగస్వామ్యం నెరపాలని, చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్‌కు ట్రంప్ చెప్పినట్లు వస్తున్న వార్తలను చైనా అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
వెనిజులా ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న అమెరికా
వెనిజులా చమురును తీసుకెళుతున్న ట్యాంకర్‌ను అమెరికా, ఉత్తర అట్లాంటిక్ జలాల్లో స్వాధీనం చేసుకుంది. బెల్లా 1గా వున్న ఆ నౌక పేరును మరినెరాగా మార్చింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఆ నౌకను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా మిలటరీ యురోపియన్ కమాండ్ బుధవారం తెలిపింది. వారాల తరబడి నిఘా, పరిశీలనలు చేపట్టిన తర్వాత కోస్ట్ గార్డ్ దళాలు, అమెరికా సైన్యం ఈ చర్య చేపట్టినట్లు ప్రకటించింది. వెనిజులా చమురుపై ఆంక్షలు ప్రపంచంలో ఎక్కడున్నా అమలవుతాయని రక్షణ మంత్రి పీటె హెగ్‌సాథ్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
ఎస్కార్టుగా రష్యా జలాంతర్గామి, నౌకలు ?
ప్రస్తుతం ఐస్‌ల్యాండ్, బ్రిటీష్ ఐల్స్ మధ్య వున్న ఆ నౌకకు ఎస్కార్టుగా రష్యా ఒక జలాంతర్గామిని మోహరించినట్లు తెలుస్తోంది. అమెరికా ఆపరేషన్ సాగిన ప్రదేశానికి కాస్తంత దూరంలోనే రష్యా జలాంతర్గామి, యుద్ధ నౌక వున్నట్లు రాయిటర్స్ కూడా తెలిపింది. అయితే అమెరికా, రష్యా బలగాల మధ్య ఎలాంటి ఘర్షణ జరిగినట్లు సూచనలు కనిపించలేదని పేర్కొంది. ఈ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడానికి గత రెండు వారాలుగా పిల్లి, ఎలుక చెలగాటం సాగుతోందని మాస్కో విలేకరి దిమిత్రి మెద్వెదెంకో వ్యాఖ్యానించారు.
అయితే ఈ జలాంతర్గామిని లేదా నౌకలను మరినెరాకు ఎస్కార్టుగా పంపించారా లేదా అనేది రష్యా ప్రభుత్వం నిర్ధారించలేదని చెప్పారు. తాము పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని మాత్రమే రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్యను సముచితం కానిదిగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం రష్యా జాతీయ పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌక ప్రస్తుతం అంతర్జాతీయ జలాల్లో వుందని, అంతర్జాతీయ సముద్ర జలాల చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. స్వేచ్ఛగా ప్రయాణించేందుకు ఆ నౌకకు గల హక్కును గౌరవించాల్సిందిగా పశ్చిమ దేశాలను కోరింది.



