Tuesday, January 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిశ్రమజీవుల గొంతుకలు- సీఐటీయూ గ్రామ కమిటీలు

శ్రమజీవుల గొంతుకలు- సీఐటీయూ గ్రామ కమిటీలు

- Advertisement -

మార్పు ఒక్కరోజులో రాదు. కానీ, ఆ మార్పునకు బీజం ఒక్క ప్రశ్నతోనే మొదలవుతుంది. ఆ ప్రశ్నను ప్రజల మెదళ్లలో నాటినప్పుడు అది ఆలోచనా శక్తిగా మారుతుంది. అది మాటలుగా మారినప్పుడు పోరాటాన్ని సంతరించుకుంటుంది. అదే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉద్యమ విత్తనంగా మొలకెత్తింది. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన క్షేత్రస్థాయిలో మాస్‌లైన్‌ కార్యక్రమం నిజంగా ప్రజలకు ఒక భరోసానివ్వడమే కాదు, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందంటే ఆశ్చర్యం కాదు. నాయకులు ప్రజల్లోకి వెళ్లి వారి బాగోగులు తెలుసుకోవాలనే ఆరాటం అభినందనీయం. మాటలు అందరూ చెబుతారు. కానీ, ఆచరణలో కొంతమందే అమలు చేస్తారు. ఆ కొంతమంది ఎవరైనా ఉన్నారంటే అందరికోసం పోరాడే కార్మిక నాయకులు.ఆ పోరాటానికి ఊపిరినిచ్చి ఆలోచనకు చేసిన ప్రయత్నమే ‘ఊరురా తిరిగి..ఒక్కొక్కరిని కలిసి…’ ఆ వివరాలేంటో వారి అభిప్రాయాల్లోనే తెలుసుకుందాం..

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం ఆరు వందల పదమూడు గ్రామ పంచాయతీల్లోని వివిధ రంగాల కార్మికులను నేరుగా కలుసుకోవాలి. వాళ్లందర్నీ గ్రామంలో ఒక చోటకు సమీకరించాలి. సీఐటీయూ గ్రామ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కర్తవ్యాన్ని అమలు చేయడానికి మాస్‌ లైన్‌ అమలుకు క్షేత్రస్థాయిలో పూర్తికాలం కార్యకర్తలు పనిచేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ రాజకీయ నిర్ణయం. ఇంకేముంది, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న ఇరవై రెండు మంది పూర్తికాలం కార్యకర్తలతో రంగంలోకి దిగాము. మరికొంత మంది పార్ట్‌ టైం కార్యకర్తల సహ కారంతో కేవలం పద్నాలుగు రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని దిగ్విజయంగా పూర్తిచేశాము.

మొదట్లో గ్రామాల్లోకి వెళ్లి కార్మికులను కలుసుకోవడం, వారి ఇళ్ల దగ్గరకు వెళ్లడం కొంత కష్టంగా అనిపించింది. కొన్ని గ్రామాల్లో వెళ్లిన రోజు కార్మికుల్ని కలుసుకోలేక వెను తిరిగిన సందర్భాలూ లేకపోలేదు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో అంగన్వాడీలు, కొన్నిచోట్ల గ్రామ పంచాయతీ కార్మికుల కృషి ఉపయోగపడింది.మేము సీఐటీయూ యూనియన్‌ నుండి, ‘మీ హక్కుల కోసం, జీతాల కోసం కోట్లాడే యూనియన్‌ నాయకులం’ అంటూ చెప్పి గ్రామంలోని ఒకరిద్దరు కార్మికులతో ముచ్చటిస్తూనే అందరినీ పిలిపించుకున్నాము. ఈ కమిటీల్లో అన్నిచోట్ల అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, ఆశ, మధ్యాహ్న భోజనం, స్కూల్‌ స్కావెంజర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఐకెపి వివోఏలతో, పారిశ్రామిక కార్మికులు తదితర రంగాల కార్మికులతో సమావేశాలు నిర్వహించాము.

కలిసికట్టుగా ఉద్యమం…
ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ముఖ్యంగా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు నష్టం కలిగించే విధంగా తెచ్చిన లేబర్‌కోడ్‌లతో పాటు అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న నష్టాలను వివరించాము. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలు, వీటి రక్షణ కోసం గ్రామస్థాయిలోనే మనమంతా కలిసికట్టుగా పోరాడాలని చెప్పడం కార్మికులను ఆకర్షించింది. మనకోసం, మన భవిష్యత్తు కోసం జరిగే ప్రతీ ఆందోళనలో మీరంతా ఐక్యంగా ఉంటూ పోరాడాలని, ఆయా రంగాల్లోని కార్మికుల నుండి ఒకర్ని ఆ గ్రామానికి కన్వీనర్‌గా నియమించి మిగతా సభ్యులతో కలిసి కమిటీ వేశాము. గ్రామాల్లో సమావేశాల నిర్వహణకు ఎక్కువచోట్ల అంగన్వాడీ కేంద్రాలే వేదికలయ్యాయి. మనకు పరిచయాలు ఉన్న కొన్నిచోట్ల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సమావేశాల నిర్వహణకు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు సహకరించారు.

జహీరాబాద్‌ ప్రాంతంలోని ఒకట్రెం డు గ్రామాల్లో కార్మికులతో మనం సమావేశాలు నిర్వహిస్తుండగా గ్రామ సర్పంచ్‌లు మాకు తెలియకుండా ఏం సమావేశం ఏర్పాటు చేశారు? అని గొడవకు దిగితే ‘వీళ్లంతా మా కోసం, మా సమస్యల కోసం వచ్చారు. మీకేం నష్టం లేదని’ కార్మికులు ఎదురు తిరిగారు. ఈ క్యాంపెయిన్‌ మన రంగాల కార్మికులను కదిలించడానికి, గ్రామాల్లో మన కార్యకర్తలు ఎవరో గుర్తించడానికి ఉపయోగపడింది. ఆయా గ్రామాల్లో ఏయే రంగాల కార్మికులు ఎంత మంది పని చేస్తున్నారనే సంక్షిప్త సమాచారం సేకరించగలిగాము. అనేకచోట్ల కార్మికులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి రావడానికి మనం గ్రామాల్లోకి వెళ్లడం ఉపయోగపడింది. ‘మీరు సమావేశాలు పెడితే మేము వచ్చే వాళ్లం. కానీ, మీరే మా గ్రామాల్లోకి వచ్చి మా అందర్నీ పిలిచి సమావేశాలు పెట్టడం నిజంగా ఇది ఆశ్చర్యంగా ఉంది’ అని కార్మికులు చెప్పడం కార్యకర్తలకు కనువిప్పు కలిగించే విషయం. కొన్నిచోట్ల కార్మికులే వాళ్ల ఖర్చులతో భోజనాలు పెట్టించడం వారిలోని చైతన్యానికి నిదర్శనం.

వాళ్ల సమస్యలను సైతం…
నిజాంపేట మండల కేంద్రమైన గ్రామంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రానికి ప్రభుత్వం నెలనెలా అద్దె చెల్లించలేదు. దీంతో టీచర్‌ అదే గ్రామంలో తన సొంత స్థలంలో తాత్కాలికంగా రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకుని సెంటర్‌ను నిర్వహిస్తుంది. మరోచోట శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ స్కూల్‌ వర్షం వస్తే ఏకధాటిగా స్లాబ్‌ నుండి నీళ్లు కురవవడంతో లోపలి వస్తువులపై కవర్లు కప్పి పిల్లలను అదే గ్రామంలో మరో సెంటర్లో పిల్లలను రక్షించుకోవడం హదయం ద్రవించే సంఘటన. జహీరాబాద్‌ న్యాల్కల్‌ ప్రాంతంలోని అనేక అంగన్వాడి కేంద్రంలో ఆయాగా సేవలందిస్తూ రిటైర్మెంట్‌ అయ్యారు. అయినా ప్రభుత్వం కొత్తవారిని నియమించకపోవడంతో టీచర్లే తాత్కాలికంగా వేరే వారిని నియమించుకుని వారికి చేతి ఖర్చులు చెల్లించుకుంటూ సెంటర్స్‌ నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో టీచర్లకు ఇతర సెంటర్ల నిర్వహణ బాధ్యత ఉంది.

పంచాయతీ ఎన్నికల అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులపై నూతనంగా వచ్చిన సర్పంచులు కొన్నిచోట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ఘటనలు సైతం వ్యక్తమయ్యాయి. హత్నూర మండలంలోని ఒక గ్రామంలో తన తండ్రి చనిపోయి పదినెలలు గడుస్తోంది నాటి నుండి ఆయన కొడుకు తన తండ్రి పని చేస్తున్నా నేటికీ జీతం అందలేదు. మరో చోటా తన భర్త మతిచెందగా ఆ పనిని భార్య పనిచేస్తున్న తన భర్తకు ఇచ్చే రూ.9500 ఇవ్వకుండా కంటి తుడుపు చర్యగా రూ.5వేలు ఇస్తూ ‘ఇదేనీ జీతం’ అన్నారు పంచాయతీ అధికారి. ఏదైనా సంఘటన జరిగితే కనీసం ఇన్సూరెన్స్‌ కూడా చేయించలేని పంచాయతీలు అనేకం కనిపించాయి. సరాసరి మూడు నెలలుగా, కొన్ని చోట్ల ఎనిమిది నెలలుగా వీరికి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.

స్కూల్‌ స్కావెంజర్‌ పేరు మీద పనిచేస్తున్న చాలామంది కార్మికులకు తమకు కనీస వేతనం ఎంతో తెలియక హెడ్మాస్టర్‌ ఇచ్చే మూడు వేలు, ఆరు వేలే తమ వేతనాలుగా భావిస్తూ ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూల్లో అన్నిరకాల పనులు చేస్తున్నారు. కార్మికులకు సరైన వంటగదులు లేక మధ్యాహ్న భోజన కార్మికులు ఎండ, వానలో చేస్తున్నారు. అనేక గ్రామాల్లో బిల్డింగ్‌ వర్కర్స్‌గా పనిచేస్తున్న కనీసం లేబర్‌ కార్డ్సు చేయించుకోలేని స్థితిలో ఉన్నారు. మారుమూల గ్రామాల్లో కూడా బయటి రాష్ట్రాల నుండి నిర్మాణ రంగంలో కార్మికులు వచ్చి పనిచేయడంతో గ్రామాల్లో మేము ఉపాధి కోల్పోతున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో అడ్డాలమీద కూడా ఇతర రాష్ట్రాల కార్మికులే ఎక్కువ మంది అందుబాటులో ఉంటున్నారని గ్రామస్తులు తెలిపారు. మరి కొన్ని గ్రామాల్లో కారు, ఆటోలు, ఇతర వాహనాలు తెచ్చుకొని పట్టణాల్లోకి వలస వెళ్లి ఉపాధి పొందుతున్నారు.

వారిలో ఒకరిగా మమేకమై…
గ్రామాలను సందర్శించి అందరితో మాట్లాడటం, వారి సమస్యల పరిష్కారానికి కమిటీలు వేయడం, అందులో వారు కూడా ఆనందంగా పాల్గొనడం మంచి పరిణామం. చాలారోజుల తర్వాత గ్రామాల్లోకి వెళ్లి కార్మికులను కలుసుకోవడంతో పాటు వారి కుటుంబ పరిస్థితులు, వారి జీవన విధానాల్ని నాయకులుగా కాకుండా వారిలో మమేకమై వారి బాధలు, సంతోషాలు తెలుసుకోవడానికి ఈ క్యాంపెయిన్‌ ఎంతగానో దోహదపడింది. అందుకే, మన సంఘాల పిలుపులు గ్రామస్థాయిలో అమలు జరిగేందుకు ఈ కృషి ఉపయోగపడే విధంగా వారితో నిత్య సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరాన్ని గ్రామాల అధ్యయనం నొక్కి చెబుతోంది. మొత్తంగా ఉద్యమస్ఫూర్తితో కార్యకర్తలు మొత్తం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సమన్వయ కమిటీలు వేసి, తమ లక్ష్యాన్ని సాధించి అనేక అనుభవాలు పొందారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభ మెదక్‌లో నిర్వహించిన సందర్భంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో సమన్వయ కమిటీలు వేసి రాష్ట్ర ఉద్యమానికి ఇచ్చిన అనుభవంతో సంగారెడ్డి జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం మరొక అనుభవాన్నిచ్చింది. ఇది ఆచరణలోకి తీసుకెళ్లగలిగేది, అంతకుమించి అమలు చేయదగినది.

క్రిష్ణ
9490098705

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -