Thursday, March 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుయుద్ధాన్ని విరమించాలి

యుద్ధాన్ని విరమించాలి

- Advertisement -

ఇరాన్‌పై సామ్రాజ్యవాద దేశాల దాడులను వ్యతిరేకిస్తున్నాం
ట్రంప్‌నకు మోడీ జీ హుజూర్‌ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ-ఆత్మకూర్‌
అమెరికా, ఇజ్రాయిల్‌ కలిసి ఇరాన్‌పై దాడులు చేయడాన్ని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తోందని, ఇప్పటికైనా యుద్ధాన్ని విరమించాలని రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ యుద్ధానికి ముందు ఇజ్రాయిల్‌లో పర్యటించడం వల్ల ఇరాన్‌పై దాడికి భారత్‌ మద్దతు ఇచ్చినట్టు వ్యక్తమవుతోందన్నారు. అమెరికా ఏమి చెబితే అది వినే పద్ధతి మన దేశ సార్వభౌమాధికారానికి తీవ్ర నష్టదాయకమని చెప్పారు. దేశ ప్రజల గౌరవాన్ని కించేపరిచే పద్ధతిని మానుకోవాలని సూచించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పారు. యుద్ధం వల్ల చమురు రవాణాలో సంక్షోభం ఏర్పడిందని, దాంతో గ్యాస్‌ ధరలు పెంచారని తెలిపారు. హాస్టల్స్‌, హోటళ్లు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయన్నారు. రష్యా నుంచి తక్కువ ధరలకు ఆయిల్‌ దిగుమతి అవుతున్నా.. అమెరికా ఆపేయమనగానే ఆపేశారని, ఇప్పుడు మళ్లీ నెల రోజుల వరకు దిగుమతి చేసుకోవచ్చని ట్రంప్‌ చెబితే సరే అంటున్నారని విమర్శించారు. అమెరికాకు ‘జీ హుజూర్‌ ‘అనే పద్ధతిలో మోడీ వ్యవహరించడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా దేశ గౌరవాన్ని కాపాడుకోవాలని, సామ్రాజ్యవాద అమెరికా విధానాలను వ్యతిరేకించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేస్తోందని అన్నారు. దీంతో నెలల తరబడి కూలీలకు డబ్బులు రావడం లేదని తెలిపారు. విద్యుత్‌ సవరణ బిల్లు తీసుకుని వచ్చి విద్యుత్‌ రంగాన్ని ప్రయివేట్‌పరం చేస్తున్నారని, ఉచిత విద్యుత్‌ సరఫరాను రద్దు చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీ వరకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో బస్తీల్లో ప్రచారాలు, మండల కేంద్రంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు.

ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని, ఈసారైనా ఇచ్చిన హామీలు అమలు జరిగే విధంగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పింఛన్లు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు, మహిళలకు రూ.2500 అమలు, కల్యాణ లక్ష్మికి రూ.లక్షతోపాటు తులం బంగారం అమలు కావటం లేదన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇవ్వడం లేదన్నారు. రైతులకు ఇప్పటికీ రుణమాఫీ పూర్తి కాలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు దళితబంధు ఇవ్వడం లేదని, సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ కావడం కాలేదని తెలిపారు. హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తే ప్రభుత్వం అరెస్టులు చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకత విధానాలను అనుసరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జబ్బర్‌, సీనియర్‌ నాయకులు ఎండి.మహమూద్‌, మండల కార్యదర్శి జిఎస్‌.గోపి, నాయకులు వెంకటేష్‌, ఎస్‌.అజయ్, రాఘవేంద్ర, బుచ్చన్న ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -