ఈ ఏడాదీ పాత పద్ధతిలోనే పరీక్షలు
విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ మార్కులను ఎత్తేయాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. ప్రస్తుత విద్యాసం వత్సరం (2025-26)లోనూ పాత పద్ధతిలోనే పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 80 శాతం మార్కులకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని వివరించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు ఉన్న 20 శాతం ఇంటర్నల్ మార్కులు, 80 శాతం ఎక్స్‌టెర్నల్ మార్కుల విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత విద్యాసంవత్సరం (2024-25)లో 20 శాతం ఇంటర్నల్ మార్కులను ఎత్తేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వంద మార్కులకు పదో తరగతి వార్షిక పరీక్షలుంటాయని నిర్ణయించింది. ఆ నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గడం గమనార్హం. అయితే గత విద్యాసంవత్సరంలో పాత పద్ధతిలోనే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26) నుంచి 20 శాతం ఇంటర్నల్ మార్కులను ఎత్తేస్తున్నట్టు ఉత్తర్వులను జారీ చేసింది. అంటే వంద మార్కులకు పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) అధికారులు పదో తరగతి ప్రశ్నాపత్రం రూపకల్పనపై కసరత్తు చేశారు. సబ్జెక్టు నిపుణులతో చర్చించారు. వంద మార్కుల ప్రశ్నాపత్రాలను ఎలా రూపొందించాలో నమూనాలను తయారు చేశారు. దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఇంటర్నల్ మార్కుల తొలగింపు నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. పాత విధానంలోనే పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల ఢిల్లీలో జాతీయ విద్యా, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) వర్క్‌షాప్ నిర్వహించింది. అందులో పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసి వంద మార్కుల ప్రశ్నాపత్రం రూపొందించడంపై పలు ప్రశ్నలు తలెత్తినట్టు తెలిసింది. దీంతో పునరాలోచనలో పడిన విద్యాశాఖ పాత విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే గత విద్యాసంవత్సరం నుంచే గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి విద్యార్థులకు ఫలితాలు గ్రేడింగ్‌లో కాకుండా మార్కులే వస్తాయి.
టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులుంటారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES