Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఎస్‌బీఐలో ఉద్యోగులకు సమాన ప్రయోజనాల్లేవు

ఎస్‌బీఐలో ఉద్యోగులకు సమాన ప్రయోజనాల్లేవు

- Advertisement -

– వివరణ ఇవ్వాలంటూ ఆర్బీఐకి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో వేరే బ్యాంకులను విలీనం చేశాక ఉద్యోగులందరికీ సమాన ప్రయోజనాలు కల్పించడం లేదనే పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)కి నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాని ఆర్బీఐని ఆదేశించింది. విలీనం తర్వాత ఎస్‌బీఐలో పనిచేసే ఉద్యోగుల మధ్య ప్రయోజనాల్లో వ్యత్యాసం ఉందంటూ దాఖలైన పిటిషన్‌ను గతంలో సింగిల్‌ జడ్జి కొట్టేశారు. దీనిపై ఆలిండియా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, న్యాయమూర్తి జస్టిస్‌ మోహియుద్దీన్‌ డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారణ జరిపింది. ఎస్‌బీఐలో ఉద్యోగులకు సమాన ప్రయోజనాల్లేవనే దానిపై పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని ఆర్బీఐని ఆదేశించారు.
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌, మైసూర్‌, పాటియాలా, ట్రావెన్‌కోర్‌ ఎస్‌బీహెచ్‌ ఉద్యోగులకూ ఎస్‌బీఐ ఉద్యోగులతో సమాన ప్రయోజనాలు కల్పించలేదని అప్పీల్‌ పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రభాకర శ్రీపాద వాదించారు. ఒకే విధమైన పనిచేసే వారికి ఒకే విధమైన ప్రయోజనాలు ఉండాలన్నారు. ఉద్యోగులందరినీ ఒకేలా పరిగణించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పారు. ఎస్‌బీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ ఇది విధానపరమైన నిర్ణయం కాబట్టి కోర్టు జోక్యానికి వీల్లేదన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పిందని వివరించారు. విలీన బ్యాంకుల నుంచి 70 వేల మంది ఉద్యోగులు, 30 వేల మంది అధికారులు ఎస్‌బీఐలో చేరారన్నారు. ఫెడరేషన్‌ తరఫున ప్రధాన కార్యదర్శి కాకుండా ఉపాధ్యక్షుడు పిటిషన్‌ వేయడం చట్ట వ్యతిరేకమనీ, అప్పీల్‌ను డిస్మిస్‌ చేయాలని కోరారు. తదుపరి విచారణ వచ్చేనెల పదో తేదీకి వాయిదా పడింది.
రేవంత్‌రెడ్డిపై కేసు కొట్టివేత
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై 2019లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ సోమవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలప్పుడు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు గరిడేపల్లి పీఎస్‌లో నాటి మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై 2019, జనవరి 19న కేసు నమోదైంది. అనుమతి లేకుండా కాంగ్రెస్‌ పార్టీ పొనుగోడులో సమావేశం నిర్వహించిందనీ, అందులో రేవంత్‌ పాల్గొన్నారని కేసులో అభియోగం. దీన్ని కొట్టేయాలని కోరుతూ రేవంత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె లక్ష్మణ్‌ విచారణ పూర్తి చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ తీర్పు చెప్పారు. ఆరోపణలకు ఆధారాలు లేనందున కింది కోర్టులో విచారణ అవసరం లేదని స్పష్టం చేశారు.
వ్యక్తిగత విచారణకు మినహాయింపు
వరంగల్‌ జిల్లా కమలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో రేవంత్‌రెడ్డికి వెసులుబాటు లభించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి 2,500 మందితో సమావేశం నిర్వహించారనే కేసును కొట్టేయాలని రేవంత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె లక్ష్మణ్‌ సోమవారం విచారణ జరిపారు. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులు, ఫిర్యాదుదారులను ఆదేశించారు. ట్రయల్‌కోర్టుకు హాజరు నుంచి రేవంత్‌రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. విచారణను వచ్చేనెల తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది.
15,16 తేదీల్లో మాంసం దుకాణాలను ఎందుకు బంద్‌ చేయాలి : వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు నోటీసులు
ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా మాంసం దుకాణాలు, పశు కబేళాలను మూసివేయాలంటూ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ విధమైన అధికారం జీహెచ్‌ఎంసీకి లేదనీ, ఎందుకు మాంసం దుకాణాలు/కబేళాలు మూసివేయాలో ఉత్తర్వుల్లో వివరించలేదంటూ న్యాయ విద్యార్థి వడ్ల శ్రీకాంత్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి విజయసేన్‌ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ఈ నిర్ణయానికి గల కారణాన్ని వివరించాలంటూ జీహెచ్‌ఎంసీకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేశారు. జీహెచ్‌ఎంసీకి ఎలాంటి అధికారం లేకపోయినప్పటికీ చట్ట వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజరు గోపాల్‌ వాదించారు. జీహెచ్‌ఎంసీలోని 533 (బి) నిబంధన ద్వారా కమిషనర్‌ తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లేదన్నారు. నిర్ణయం వెనుక నిర్ధిష్ట కారణం కూడా లేదని వివరించారు. పశువుల వధశాలలు, మాంసం దుకాణాలు మొదలైన వాటిని మూసివేయాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. వ్యాపారులు చట్టబద్ధంగా శాంతియుతంగా చేసుకునే వ్యాపారాన్ని అడ్డుకునేందుకు వీల్లేదన్నారు. రాజ్యాంగంలోని 14, 19 అధికరణాల కింద పౌరులకు లభించిన హక్కులను హరించడమే అవుతుందని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img