మధ్యప్రాచ్య జలాల్లోకి రెండో యుద్ధ విమాన వాహక నౌక
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : ఇరాన్‌లో అధికార మార్పిడి జరగడం మంచిదని, అది జరగవచ్చునని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్‌పై సైనిక చర్యకు దిగే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఉత్తర కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్‌లో ఉన్న సైనిక దళాలను కలుసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. మధ్యప్రాచ్య జలాలలోకి రెండో యుద్ధ విమాన వాహక నౌకను తరలిస్తున్నామని అంతకుముందు ఆయన ధృవీకరించారు. ఇరాన్‌లో ఇస్లామిక్ మతాధికారిని పదవీచ్యుతుడిని చేసేందుకు ఒత్తిడి తెస్తారా అని పాత్రికేయులు ప్రశ్నించగా ‘అక్కడ అధికార మార్పిడి జరగడం మంచిది. అది జరగవచ్చు.
47 సంవత్సరాలుగా వారు మాట్లాడుతూనే… మాట్లాడుతూనే ఉన్నారు’ అని ట్రంప్ అన్నారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను పదవీచ్యుతిడిని చేసేందుకు తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో పోలిస్తే ఇరాన్‌లో అధికార మార్పిడి మరింత సంక్లిష్టంగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇటీవల చెప్పారు. ఇప్పుడు ట్రంప్ కూడా టెహ్రాన్‌లో అధికార మార్పిడిని ప్రస్తావించారు. దీనిని బట్టి చూస్తే ఇరాన్‌లో అయతొల్లా అలీ ఖమేనీని గద్దె దించడానికే అమెరికా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు అర్థమవుతోంది.



