Friday, March 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆ రెండింటికీ నిధుల కోత ప్రసక్తే లేదు

ఆ రెండింటికీ నిధుల కోత ప్రసక్తే లేదు

- Advertisement -

వాటికి అవసరమైన ఫండ్‌ కేటాయిస్తాం
విద్య, వైద్య రంగాలపై సీఎం రేవంత్‌రెడ్డి
ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ల సేవలను వినియోగించుకుంటాం
అందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌
బోధనాస్పత్రుల్లో పని చేసే వైద్యులకు ప్రోత్సాహకాలు
పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించటమే ధ్యేయం
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ముఖ్యమంత్రి సమాధానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్య, వైద్య రంగాలకు కేటాయించే నిధుల్లో కోత విధించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వాటికి చాలినంత ఫండ్‌ కేటాయిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో వైద్య విద్యనభ్యసించి విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ వైద్యులు… ఇక్కడకు వచ్చినప్పుడు ప్రభుత్వ దవాఖానాలు, బోధనాసుపత్రుల్లో వారి సేవలను వినియోగిం చుకునేలా ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉప నేత తన్నీరు హరీశ్‌రావు, ఆ పార్టీ సభ్యుడు డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్… ఆరోగ్యశ్రీ బకాయిల అంశాన్ని లేవనెత్తారు. వారి ప్రశ్నలకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమాధానమిచ్చారు.

ఈ దశలో సీఎం రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకుని… వైద్యారోగ్య శాఖలో ప్రభుత్వం చేపడుతున్న పలు సంస్కరణలను సోదాహరణంగా వివరించారు. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు వర్తించే విధంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ఇటీవలే ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఏదైనా కారణం చేత కుటుంబ పెద్ద చనిపోతే ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉంటుందనే ధీమాను ఆ పథకం కల్పిస్తుందని వివరించారు. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని అమలు చేసి, అక్కడి వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తామని తెలిపారు. ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవల పర్యవేక్షణ… ఈ రెండింటి బాధ్యతలను ఒక్కరికే కాకుండా వేర్వేరు విభాగాలుగా మారుస్తామని చెప్పారు. వైద్యులను కేవలం వైద్య సేవలకే పరిమితం చేస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎల్‌వోసీ అనే విధానం కేవలం నిమ్స్‌కే పరిమితమైందని గుర్తు చేశారు. దాన్ని అన్ని బోధనాసుపత్రులతోపాటు సనత్‌నగర్‌, అల్వాల్‌ తదితర ప్రాంతాల్లోని టిమ్స్‌లకు కూడా వర్తింపజేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ వైద్య రంగంలో త్వరలో మరో పది వేల పడకలను అందుబాటులోకి తెస్తామని సీఎం చెప్పారు. తద్వారా పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తామని హామీనిచ్చారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి గత బీఆర్‌ఎస్‌ హయాంలో కేటాయించిన నిధులను, ప్రస్తుత పరిస్థితితో పోల్చి సీఎం ఏకరువు పెట్టారు. గతంలో ఆ పథకానికి ప్రతినెలా రూ.52 కోట్లను ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.89 కోట్లను ఖర్చు చేస్తున్నామని వివరించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆరోగ్య శ్రీ కింద మొత్తం రూ.2,408.51 కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి ఆ పథకం బకాయిలు రూ.600 లక్షలు పేరుకు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి ఆ బకాయిలు రూ.727 కోట్లకు చేరాయని, అంటే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడ్డ బకాయిలు కేవలం రూ.127 కోట్లేనని స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు సుమారుగా రూ.496 కోట్లు, ప్రయివేటుకు రూ.231 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతినెలా రూ.102 కోట్ల విలువైన వైద్యసేవలందిస్తే, ఇప్పుడు రూ.184 కోట్ల సేవలందుతున్నాయని చెప్పుకొచ్చారు.

ఆ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచిన తర్వాత వైద్యసేవలు రెట్టింపయ్యాయని వ్యాఖ్యానించారు. గతానికి భిన్నంగా తాము సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించి పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకొచ్చి, పేదలను ఆదుకుంటున్నామని తెలిపారు. 2023 డిసెంబరు 7 నుంచి ఇప్పటి వరకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.2046 కోట్ల ఆర్థిక సాయం చేశామని వివరించారు. పేదల వైద్యానికి ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మొత్తం రూ.4,500 కోట్లను ఖర్చు చేశామని వెల్లడించారు. రానున్న రోజుల్లో వైద్యారోగ్యశాఖలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి, పేదలకు మరింత నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -