నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసే ఎలాంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్‌లో తెలిపారు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, వీటిలో కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ద్వారా సకాలంలో తగినంత రుణం అందించడం కూడా ఒకటి మంత్రి తెలిపారు. అలాగే, సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్‌ఎస్) కింద రూ 3 లక్షల వరకూ రుణాన్ని రాయితీ వడ్డీ రేట్లకు అందిస్తున్నాయని, వీటిని సకాలంలో తిరిగి చెల్లించే వారికి అదనపు ప్రోత్సహకాలను కూడా అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు పూచీకత్తు లేని స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను రూ. 1.60 లక్షల నుంచి రూ 2 లక్షలకు కేంద్రం పెంచిందని మంత్రి తెలిపారు.
అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొదలైన పంటల బీమా, భూమి కలిగిన రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, మరోక ప్రశ్నకు సమాధానం ఇస్తూ సైనికులకు ఇచ్చే వైకల్య పింఛనకు సంబంధించి ఆదాయపు పన్ను మిహాయింపు ఇప్పటికీ అమల్లో ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 2025 ఆదాయపు పన్ను చట్టంలో దీనికి సంబంధించిన కొత్త నిబంధనను జత చేర్చినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి వైకల్యంతో సైనిక రంగం నుంచి పదవీ విరమణ చేసిన సాయుధ దళాల సిబ్బంది సంఖ్య 1,47,263గా మంత్రి తెలిపారు. వైకల్య పింఛను పొందుతున్న సిబ్బంది సంఖ్య 89,598గా మంత్రి పేర్కొన్నారు.
కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
లోక్‌సభలో కార్పొరేట్ చట్టాల (సవరణ) 2026 బిల్లును కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సమగ్ర పరిశీలన కోసం ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలన్న తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లు పరిమిత బాధ్యత భాగస్వామ్య చట్టం 2008, కంపెనీల చట్టం 2013లకు మరిన్ని సవరణలను కోరుతోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రతిపాదనలను వివరించే ఫైనాన్స్ బిల్లు 2026ను కూడా పరిశీలన కోసం ఆర్థికమంత్రి ప్రవేశపెట్టనున్నారు.
కాగా, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లును ప్రవేశపెట్టడానిన కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 245-246ను ఉల్లంచి ఈ బిల్లులో ముఖ్యమైన శాసన విధులను మితిమీరి అప్పగించారు. కంపెనీల వర్గీకరణ, మినహాయింపులు, పాటించాల్సిన నిబంధనల నిర్ధారణ, కార్పొరేట్ సామాజిక బాధ్యతకు సంబంధించిన పరిమితి, ఆడిట్ బాధ్యతలు, జరిమానాల చట్రాలు వంటి కీలక విధానపరమైన అంశాలను తగిన శాసన మార్గదర్శకత్వం లేకుండా అనుబంధ శాసనలకు వదిలివేశారని మనీశ్ తివారీ విమర్శించారు.



