Sunday, November 2, 2025
E-PAPER
Homeమానవిఇంకా చేయాల్సింది చాలా వుంది

ఇంకా చేయాల్సింది చాలా వుంది

- Advertisement -

శశికళారెడ్డి… సుదీర్ఘకాలం ఓ ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఎంతో సేవ చేసిన తండ్రిని చూస్తూ పెరిగారు. గ్రామీణ ప్రజల బాధలు చూసి చలించిపోయారు. సమాజానికి ఏదో చేయాలని తపించారు. అందుకే నేటి యాంత్రిక జీవితంతో ఒత్తిడి పెరిగి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి అవగాహన కల్పించేందుకు ‘రోషిణి’ ప్రారంభించారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ‘గంగా చారిటబుల్‌ ట్రస్ట్‌ స్థాపించారు. కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు ‘పరంపర’ను కొనసాగిస్తున్నారు. ఇలా సమాజానికి తన వంతుగా చేయూతనందిస్తున్న ఆమెతో మానవి సంభాషణ…
డాక్టర్‌ సలీమ
మీ కుటుంబ నేపథ్యం చెబుతారా?
నేను పుట్టి పెరిగింది నిజామాబాద్‌. అమ్మ లక్ష్మీకాంతమ్మ, నాన్న గడ్డం గంగారెడ్డి. కేశ్‌పల్లి గంగారెడ్డిగా ఆయన అందరికీ సుపరిచితులు. మూడు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. నా స్కూలింగ్‌ అంతా నిజామాబాద్‌లో జరిగింది. ఇంటర్‌, డిగ్రీ హైదరాబాద్‌లో చదివాను. పెండ్లి తర్వాత మా వారి వృత్తిరీత్యా రెండేండ్లు నైజీరియాలో ఉన్నాను. అక్కడి నుండి హైదరాబాద్‌ వచ్చేశాము.

సమాజక సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?

హైదరాబాద్‌ వచ్చిన తర్వాత మా ఇంటి పక్కనే ఉండే పూనం అనే నా స్నేహితురాలు ‘సహాయ’ అనే ఆర్గనైజేషన్‌లో వాలంటీర్‌గా పని చేస్తుండేది. నాకూ మొదటి నుండి సొసైటీకి ఎంతో కొంత సేవ చేయాలి అనే ఆలోచన వుండేది. అది నాకు నాన్న నుండి వచ్చింది. నా చిన్నతనంలో నాన్న ఎలక్షన్‌ ప్రచారం కోసం గ్రామాలకు వెళ్లేదాన్ని. గ్రామీణ ప్రజల జీవన విధానం చూసినప్పుడు చాలా బాధ కలిగేది. తల్లిదండ్రులు పనులకు వెళ్లిపోతే పిల్లలు రోడ్లపైన తిరుగుతూ కనపించేవాళ్లు. అలాంటి గ్రామాల అభివృద్ధి కోసం నాన్న చాలా సాయం చేసేవారు. ఇవన్నీ చూస్తూ పెరిగిన నాకు కూడా సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆసక్తి ఉండేది. అందుకే ఫ్యామిలీ బిజినెస్‌ చూసుకుంటూనే ‘సహాయ’లో వాలంటీర్‌గా పని చేయడం మొదలుపెట్టాను. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, జీవితంపై విరక్తితో ఆత్మహత్యలకు పాల్పడే వారికి ఈ సంస్థ అవగాహన కల్పించేది.

రోషిణి ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది?
నేను వాలంటీర్‌గా పనిచేసిన ‘సహాయ’ కొంత కాలానికి క్లోజ్‌ చేసేశారు. కానీ ప్రస్తుత సమాజంలో ఇలాంటి సంస్థలు చాలా అవసరం అనే ఆలోచనతో నేనూ, నా స్నేహితురాలు పూనం కలిసి 1996లో ‘రోషిణి’ ప్రారంభించాము. అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఇది పని చేస్తుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో దీని కోసం పని చేసేవాళ్లు లేరు. దాంతో ఆ బాధ్యత మేము తీసుకొని హైదరాబాద్‌లో రోషిణినీ రిజిస్ట్రేషన్‌ చేయించాము. అప్పుడు నా వయసు 25 ఏండ్లు. సికింద్రాబాద్‌లో మా ఆఫీస్‌ ఉండేది. అప్పట్లో డా||రెడ్డిగారు మాకు చాలా సపోర్ట్‌ చేశారు. మా సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టేవాళ్లం. ఫండ్స్‌ కోసం ఎక్కడికీ వెళ్లే వాళ్లం కాదు.

ప్రారంభంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కొన్నాం. అనుభవం లేకపోవడంతో ముందు మేము అవగాహన పెంచుకున్నాం. ప్రజలకు దీని గురించి తెలియాలి. మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి చేయూతనిచ్చే ఇలాంటి ఓ సంస్థ ఉందనే విషయం ప్రచారం చేయాలి. అందుకే పేపర్లో వాలంటీర్స్‌ కావాలని ప్రకటన ఇచ్చాము. అది చూసి చాలా మంది వచ్చారు. అలా అప్పుడు వచ్చిన వాళ్లు ఇప్పటికీ మాతో కొనసాగుతున్నారు. స్వచ్ఛందంగా పని చేయడానికి వచ్చిన వారికి వారాంతరాలలో మూడు నెలలు ట్రైనింగ్‌ ఇస్తాము. ఆ తర్వాతే వాళ్లను చేర్చుకుంటాము. అలా మొదలైన రోషిణి ఇప్పుడు చాలా మందికి చేరువయ్యింది.

అప్పటికీ ఇప్పటికీ మీరు గమనించిన మార్పులు?
అప్పట్లో ఏదైనా మానసిక సమస్య వస్తే సైకాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లడానికి చాలా మంది ఇబ్బంది పడేవారు. ‘మేమేమైనా పిచ్చి వాళ్లమా’ అని ట్రీట్‌మెంట్‌ తీసుకునేందుకు నిరాకరించేవారు. తమ సమస్యలను బయటకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అవగాహన పెరిగింది. ఏదైనా సమస్య వస్తే ఇతరులతో పంచుకోవాలనే ఆలోచన వచ్చింది. మాకు చాలా ఫోన్‌ కాల్స్‌ వస్తుంటాయి. సమస్యల పరిష్కారం కోసం మా దగ్గరకు వస్తుంటారు. ఒత్తిడి, పోటీతత్వం పెరగడంతో మానసిక సమస్యలు బాగా ఎక్కువవుతున్నాయి. సరైన సమయంలో వాళ్లు మమ్మల్ని కలిస్తే మేము వారికి సరైన గైడెన్స్‌ ఇవ్వగలిగితే తిరిగి ధైర్యంగా జీవితంలో ముందుకు వెళ్లగలుగుతారు. సమస్యలు షేర్‌ చేసుకునే వారు ఉంటే సమస్యలు చాలా వరకు పరిష్కారం అయినట్టే. కానీ అదే ఇప్పుడు కరువైపోయింది. అది అందించడమే రోషిణి లక్ష్యం.

మీరు ప్రారంభించిన ట్రస్ట్‌ గురించి చెబుతారా?
నాన్న చనిపోయిన తర్వాత ఆయన పేరుతో ‘గంగా చారిటబుల్‌ ట్రస్ట్‌’ ప్రారంభించాము. ప్రతిభవున్న పేద విద్యార్థులను ఎంపిక చేసి మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత విద్య ఉచితంగా అందిస్తున్నాము. ఏడాదికి 20 నుండి 25 మందికి ఆర్థికంగా సాయం చేస్తున్నాము. ఇది కూడా నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. ఇదంతా కేవలం మా కుటుంబం నుండి మాత్రమే చేస్తున్నాము. మా చెల్లి అవనిజారెడ్డి కూడా దీనికి సహకరిస్తుంది. అలాగే శమంతారెడ్డి అని మా కజిన్‌ నిజామాబాద్‌లో స్కూల్‌ నడిపిస్తుంది.

సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.. వాటి గురించి కూడా పంచుకుంటారా?
తెలంగాణ ప్రజలకు కళలను పరిచయం చేయాలనే ఉద్దేశంతో 2016లో ‘పరంపర’ ప్రారంభించాము. సాధారణంగా సాంస్కృతిక కార్యక్రమాలంటే రవీంధ్రభారతిలో జరుగుతుంటాయి. అలా కాకుండా మేము దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలలో నిర్వహిస్తున్నాము. ఒకప్పుడు ఇలాంటి కార్యక్రమాలు దేవాలయాలలోనే జరిగేవి. తర్వాత ఆ సంస్కృతి కనుమరుగయింది. మేము ప్రారంభించిన తర్వాత ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు. మా ఫ్రెండ్స్‌ కూడా చాలా మంది ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్‌ ఉంటే సాంప్రదాయ నృత్యం, సంగీతం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా కళలకు, కళాకారులకు కొంత వరకు ప్రోత్సాహం దొరుకుతుంది. విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్‌ చేస్తున్నాము.

మీ భవిష్యత్‌ ప్రణాళిక..?
రోషిణి ఆధ్వర్యంలోనే ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలి. అవగాహన కార్యక్రమాలు పెంచాలి. స్కూల్స్‌లో వర్క్‌షాప్‌లు పెడుతున్నాము. వాటి సంఖ్య పెరగాలి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలు పెట్టాలనుకుంటున్నాం. అలాగే పరంపర ఆధ్వర్యంలో కూడా కల్చరల్‌ కార్యక్రమాలు పెంచాలి. చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా మరింత మంది పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించాలి. ఇలా సమాజానికి నాకు చేతనైనంత సపోర్ట్‌ చేయాలి.
డాక్టర్‌ సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -