– వాటిని ఆర్టీసీకే ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్
– 24న ధర్నాలు జయప్రదం చేయాలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుత్ బస్సుల విధానంలో మార్చు చేసి వాటి నిర్వాహణ బాధ్యతను ఆర్టీసీకే అప్పగించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ బస్సుల వల్ల ఆర్టీసీ పరిరక్షణ ప్రమాదంలో పడుతున్నదనీ, వాటి కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్లు ఆర్టీసీ సంస్థ నిర్వహించేలా విధాన మార్పు చేయాలని కోరారు. వయోబిలిటీ గ్యాప్ ఫండ్ ఆర్టీసీలకు ఇవ్వాలనీ, ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన వేతన ఒప్పందాలు తదితర ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 24న ధర్నాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 97 డిపోల వద్ద సీఐటీయూ జిల్లా కమిటీలు ధర్నాలు నిర్వహించాలనీ, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ముద్రించిన కరపత్రాన్ని విస్తృతంగా పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్ బస్సుల వల్ల ప్రజలకు, కార్మికులకు, ఆర్టీసీ సంస్థలకు వచ్చే ప్రమాదాన్ని ప్రజలు, కార్మికులకు వివరించే విధంగా సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాల్లో ఆర్టీసీ కార్మికులు పాల్గొనాలని కోరారు.
విద్యుత్ బస్సుల విధానంలో మార్పుతేవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



