మహ్మద్ అఖ్లక్ కేసులో జోక్యం చేసుకోండి
రాష్ట్రపతి ముర్ముకు బృందాకరత్ లేఖ
న్యూఢిల్లీ : పదేండ్ల క్రితం అల్లరి మూక దాడిలో మరణించిన మహ్మద్ అఖ్లక్ కేసులో జోక్యం చేసుకోవాలని కోరుతూ సీపీఐ(ఎం) నేత, మాజీ ఎంపీ బృందాకరత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. 2015 సెప్టెంబరులో జరిగిన ఈ ఘటనలో యూపీ గవర్నర్ పాత్రపై దృష్టి సారించాలని ఆమె కోరారు. ఈ కేసులో ప్రధాన సాక్షి అప్పటికే సాక్ష్యమిచ్చిననప్పటికీ మొత్తం కేసును ఉపసంహరించేందుకు, న్యాయ ప్రక్రియను ధ్వంసం చేసేందుకు యూపీ ప్రభుత్వం అన్యాయంగా, అక్రమ ప్రయత్నాలతో ముందుకు సాగడానికి గవర్నర్ రాతపూర్వకంగా అనుమతినిచ్చారని బృందాకరత్ ఆ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతితో యూపీ ప్రభుత్వం గ్రేటర్ నొయిడాలోని జిల్లా కోర్టులో కేసును ఉపసంహ రించేందుకు అఫిడవిట్ దాఖలు చేసిందని తెలిపారు. గవర్నర్‌ను మీరు నియమించినందున, ఆయన మీకు జవాబుదారీ అయినందున న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఈ కేసులోని వాస్తవాలు మీకు తెలియజేయాలని, దీంట్లో మీరు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ లేఖ రాసినట్టు బృందాకరత్ ఆ లేఖలో తెలిపారు. గతంలో న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనేక అంశాలపై రాష్ట్రపతి జోక్యం చేసుకున్న అంశాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అసలేం జరిగింది..
బిషాడా గ్రామం గౌతమ్ బుధ్‌నగర్ ప్రాంత నివాసి అయిన మహ్మద్ అఖ్‌లక్‌ను 2015 సెప్టెంబరు 28న ఆయన నివాసం వెలుపలే అల్లరి మూక దాడి చేసి చంపేసింది. ఈదాడిలో ఆయన కుమారుడు డానిష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఐసీపీలోని సెక్షన్లు 147, 148, 149, 307, 323, 302, 504, 506, 427, 458 కింద కేసు దాఖలైంది. దారుణంగా జరిగిన ఈ హత్య పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇందుకు బాధ్యులైన వారికి కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హత్య జరిగిన రోజు నుంచి నేటి వరకు ఆ కుటుంబంతో ఏ ప్రభుత్వ అధికారీ మాట్లాడలేదు. అయినా తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో వారున్నారు. ఈనాటికీ కుమారుడు డానిష్ పూర్తిగా కోలుకోలేదు. తనకు తగిలిన గాయాల ప్రభావాన్ని, ఇబ్బందులను అనుభవిస్తూనే ఉన్నాడు.
చార్జిషీట్ దాఖలైంది. కేసు ప్రారంభమైంది. 2022లో, ప్రత్యక్ష సాక్షి బాధితురాలి కుమార్తె సాక్ష్యమిచ్చింది. పేర్లు వెల్లడించింది. నిందితులందరినీ గుర్తించింది. మరో మాటలో చెప్పాలంటే, నిందితులపై సాక్ష్యాధారాలను అందజేశారు. కోర్టులో నమోదు కూడా చేశారు. కేసు నడుస్తోంది. మరో ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు తమ స్టేట్‌మెంట్‌లను ఇవ్వాల్సి వుంది. అటువంటి సమయంలో కేసును ఉపసంహరించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగానూ అసలేమాత్రమూ సమర్థనీయం కాని కారణాలను సాకుగా చూపింది. నిందితులు తుపాకులు కాదని, లాఠీలు ఉపయోగించారని, పైగా బాధితుడితో వారికెలాంటి వ్యక్తిగత శతృత్వం లేదని పేర్కొంది. ఈ కేసును ఇలా కొనసాగించడం వల్ల మత కల్లోలానికి దారి తీస్తుందని పేర్కొంది. ఈ సమయంలో కేసు దర్యాప్తులో జాప్యం జరిగింది. సాక్షులను హాజరు కావాలని వారికి నోటీసులు కూడా ఇవ్వలేదు, కానీ ఈనాడు కేసు ఉప సంహరణకు జాప్యం జరిగిందనే కారణాన్ని చెబుతున్నారు.
ఇది, న్యాయం కోసం కాకుండా మొత్తంగా న్యాయ ప్రక్రియను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే చేశారని బృందాకరత్ పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 321ని దారుణంగా దుర్వినియోగం చేయడమేనని అన్నారు. అయితే, ఇక్కడ, హత్య, హత్యాయత్నం, మూకదాడి కేసును ఉపసంహరిం చుకునేందుకు రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం ఇటు వంటి చర్యలు తీసుకుంటుంటే వీటికి వ్యతిరేకంగా గవర్నర్, ప్రభుత్వానికి సూచించలేరా అని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన, చట్టబద్ధ పాలనను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌ది కాదా? ఇటువంటి కేసు ఉపసంహరించుకుంటే ఇక న్యాయ ప్రక్రియకు ఏమి మిగులుతుంది?
అటువంటపుడు తుపాకులను కాదు, లాఠీలు ఉపయోగించారని, వ్యక్తిగత శతృత్వం లేదని, సామరస్యత పాటించాలనే కారణాలను ఇటువంటి మూక దాడుల కేసులన్నింటినీ ఉపసంహరించుకోవడానికి వర్తింపజేయరా? అని బృందాకరత్ ప్రశ్నించారు. ఇటువంటి ఆందోళన కలిగించే ప్రశ్నలు ఉత్పన్నమ వుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి జోక్యం చేసుకుని, ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాల్సిందిగా గవర్నర్‌ను ఆదేశించా లని బృందాకరత్ ఆ లేఖలో కోరారు. గవర్నర్ ఆమోదించిన ప్రభుత్వ అఫిడవిట్‌పై న్యాయస్థానంలో శుక్రవారం జరగాల్సిన చర్చ ప్రాసిక్యూషన్ అభ్యర్ధన మేరకు వాయిదా పడినందున అత్యవసరంగా ఈ అంశంపై దృష్టి సారించాలని ఆమె ఆ లేఖలో కోరారు.



